రాష్ట్రాభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో వరాలు..
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:51 AM
ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్, ఉత్పత్తి, పరిశోధన, క్రమబద్ధీకరణను ప్రోత్సహించేందుకు రేర్ ఎర్త్ కారిడార్ నెలకొల్పుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించారు..
రాష్ట్రానికి రేర్ ఎర్త్ కారిడార్.. ‘పూర్వోదయ’లో ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్, ఉత్పత్తి, పరిశోధన, క్రమబద్ధీకరణను ప్రోత్సహించేందుకు రేర్ ఎర్త్ కారిడార్ నెలకొల్పుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించారు. పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్ సహా ఐదు పూర్వోదయ రాష్ట్రాల్లో సమగ్ర ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఉన్న ఈ కారిడార్ కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు 2,500 కిలోమీటర్ల మేర విస్తరించింది. దేశంలో ప్రపంచ స్థాయి ట్రెక్కింగ్, హైకింగ్ సౌకర్యాలను హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, పశ్చిమ ఘాట్లతో పాటు తూర్పు ఘాట్లలో కీలకమైన అరకు లోయలో కల్పించనున్నారు. ఏపీ, తమిళనాడులో పులికాట్ సరస్సులో పక్షుల విహారాన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. సిటీ ఆర్థిక మండలిలో భాగంగా ఐదేళ్లపాటు రూ.5 వేలకోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించడంతో అమరావతికి నిధులు లభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సంస్కరణలు, ఫలితాలతో కూడిన ఆర్థిక యంత్రాంగాన్ని సవాల్‌గా తీసుకుని కట్టుదిట్టంగా ప్రణాళికలు అమలు చేసే నగరాలకు ఈ నిధులు లభిస్తాయి. కేంద్రం ప్రకటించిన ఏడు హైస్పీడ్ కారిడార్లలో హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్ల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు కీలక ప్రయోజనాలు సమకూరనున్నాయి. విజయవాడ, అమరావతికి అనుసంధానం చేసే హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ రాష్ట్రానికి ఇతోధికంగా ప్రయోజనం కలిపిస్తుందని భావిస్తున్నారు.
డేటా సెంటర్‌కు పన్ను రాయితీ
డేటా సెంటర్లలో కీలక పెట్టుబడులు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు వీలుగా ఏ విదేశీ కంపెనీ అయినా భారత్ నుంచి డేటా సెంటర్ సేవల ద్వారా క్లౌడ్ సర్వీసులను అందిస్తే 2047 వరకూ టాక్స్ హాలిడే ప్రకటించారు. విశాఖలో ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. పెద్ద నగరపాలక సంస్థలకు వెయ్యి కోట్ల మేర బాండ్ల ద్వారా నిధులు సమీకరించేందుకు అవకాశం కల్పించారు. వందకోట్ల మేరకు కేంద్రమే ప్రోత్సాహకం కల్పించనుంది. దీంతో ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి తదితర నగరపాలక సంస్థలకు నిధులు లభించనున్నాయి. అమృత్ 2.0 ద్వారా వచ్చే నిధులతో ఏపీలోని నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం లభించే అవకాశాలు ఉన్నాయి. మెడికల్ టూరిజం, రీజినల్ హబ్‌లను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక కారిడార్లలో 5 యూనివర్సిటీ టౌన్‌షి్‌పలను ఏర్పాటు చేయడం, నైపుణ్య శిక్షణకు అవకాశం కల్పించడం, ప్రతి జిల్లాకు ఒక మహిళా హాస్టల్ ఏర్పాటు చేయడం వంటి అనేక నిర్ణయాల ద్వారా ఏపీకి ప్రయోజనం చేకూరనుంది. వీబీ జీ రామ్ జీ పథకం కింద గ్రామీణ ఉపాధికి గతంలో కంటే మరో రూ.10 వేలకోట్లు కేటాయించడం వల్ల ఏపీకి లబ్ధి కలిగే అవకాశాలు ఉన్నాయి. మూలధన వ్యయం కింద దీర్ఘకాలిక వడ్డీలేని రుణాలు మంజూరు నిర్ణయం కూడా ఏపీకి అనుకూలం.
రాష్ట్రానికి పన్నుల్లో వాటా
2026-27 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర పన్నుల్లో రూ.64,362.16 కోట్లు. 16వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా 4.217 శాతం.
కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా రూ.18,893.64 కోట్లు
ఆదాయ పన్ను రూపంలో రూ.22,904.77 కోట్లు
కేంద్ర జీఎస్టీ రూపంలో రూ.17,603.01 కోట్లు
కస్టమ్స్ రూపంలో రూ.3,434.92 కోట్లు
కేంద్ర ఎక్సైజ్ సుంకం రూపంలో రూ.1,462.85 కోట్లు, ఇతర పన్నులు, సుంకాల రూపంలో రూ.63.97 కోట్లు
2024-25, 2025-26లో కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా 4.047 శాతం కాగా, ప్రస్తుతం 0.174 శాతం పెరిగింది. దీంతో గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే రాష్ట్రానికి దాదాపు రూ.7489 కోట్లు అదనంగా లభించినట్టు అయ్యింది.
ఏపీకి నిధులు
అమరావతి ఇన్‌క్లూసివ్ అండ్ సస్టెయినబుల్ క్యాపిటల్ సిటీ అభివృద్ధికి (ఏడీబీ నిధులు) రూ.1128.91 కోట్లు కేటాయింపు. ఇందులో అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవల్‌పమెంట్ ప్రోగ్రాం (ఐబీఆర్డీ నిధులు) కింద రూ.432.09 కోట్లు మంజూరు.
గ్రామీణ రోడ్ ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లు.
పట్టణ తాగు, మురుగు నీటి నిర్వహణకు రూ.800 కోట్లు. ప్రకృతి వ్యవసాయానికి రూ.155.32 కోట్లు. రహదారులు, వంతెనల పునర్‌నిర్మాణం కోసం రూ.350 కోట్లు.
ఈక్విటీ మూలధనం కింద విశాఖలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు రూ.100 కోట్లు.
హిందూస్థాన్ షిప్ యార్డుకు రూ.150 కోట్లు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.3320.39 కోట్లు. 41.15 మీటర్ల నీటి నిల్వ మేరకు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.30436.95 కోట్లు కాగా, కేంద్రం చెల్లించవలసిన మొత్తం రూ.12157.53 కోట్లు మాత్రమేనని బడ్జెట్ పత్రాల్లో స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రూ.20 కోట్లు.
కేంద్రం వరాలు
కేంద్ర బడ్జెట్ అనగానే... రాష్ట్రాలన్నీ ‘మాకేంటి?’ అని చూస్తాయి! అందరికీ వచ్చేవి కొన్ని! కొందరికి మాత్రమే ఇచ్చేవి కొన్ని! ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి మేలు చేసే కొన్ని ప్రత్యేక నిర్ణయాలివి...
పూర్వోదయానికి శుభోదయం: తూర్పు తీరం వెంబడి ఉన్న ఐదు ‘పూర్వోదయ’ రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ‘పూర్వోదయ’ రాష్ట్రాలకు తాజా బడ్జెట్‌లో అనేక వరాలు ప్రకటించారు. ఐదు రాష్ట్రాలకు 4 వేల ఈ-బస్సులు ఇస్తామన్నారు. అందులో ఏపీకి ఎన్ని అన్నది తేలాల్సి ఉంది.
సాహస పర్యాటకం: భారత్‌లో ‘ట్రెక్కింగ్’ను మరింత ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించుకుంది. తూర్పు కనుమల్లోని ‘అరకు లోయ’నూ ఇందుకు ఎంపిక చేసింది. అలాగే, పులికాట్ సరస్సులో విదేశీ వలస పక్షుల వీక్షణ మరింత సౌకర్యవంతం చేయనుంది.
కోకో, కొబ్బరి: కొబ్బరి, జీడిపప్పు, కొకో పంటలను సాగు చేసే రైతుల ఆదాయాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఇది రాష్ట్రంలోని రైతులకు మేలు చేయనుంది.
గనులు: ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ‘అరుదైన ఖనిజాల’ వెలికితీతకు చర్యలు తీసుకోనున్నారు.
డేటా సెంటర్లకు ‘స్పీడ్’: డేటా సెంటర్ల ఏర్పాటు చేసే విదేశీ సంస్థలకు 2047 దాకా పన్నులుండవని ప్రకటించారు. గూగుల్ రాకతో భారత డేటా సెంటర్ల ‘హబ్’గా మారుతున్న విశాఖకు ఇది మరింత జోష్ తెచ్చే అవకాశముంది.
సెజ్: ప్రత్యేక ఆర్థిక మండళ్ల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు వల్ల వల్ల నెల్లూరులోని శ్రీసిటీ సెజ్‌కు మరిన్ని పరిశ్రమలు వచ్చే వీలుంది.