‘అనంత’లో ఎన్‌టీపీసీ భారీ సోలార్ ప్రాజెక్టు
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:12 AM
రాష్ట్రంలో మరో భారీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. ఎన్‌టీపీసీ అనుబంధ సంస్థ ఎన్‌టీపీసీ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ దీనిని అనంతపురం జిల్లాలో నెలకొల్పుతోంది.
1200 మెగావాట్ల సామర్థ్యం
డి.హీరేహల్ మండలం కనేకల్, రాయదుర్గం పరిధిలో ఏర్పాటు
దేశంలో ఆ సంస్థకు ఇది నాలుగో భారీ ప్రాజెక్టు
ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో స్థాపన
అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో భారీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. ఎన్‌టీపీసీ అనుబంధ సంస్థ ఎన్‌టీపీసీ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ దీనిని అనంతపురం జిల్లాలో నెలకొల్పుతోంది. 1200 మెగావాట్ల సామర్థ్యంతో డి.హీరేహల్ మండలం కనేకల్, రాయదుర్గం గ్రామాల పరిధిలో ఈ ప్రాజెక్టు స్థాపనకు అనుమతి ఇస్తూ రాష్ట్రప్రభుత్వం సోమవారం ఉత్తర్వు జారీచేసింది. ఈ ప్రాజెక్టు దేశంలో ఎన్‌టీపీసీ నిర్మించే నాలుగో భారీ ప్రాజెక్టు. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 4262 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. ఈ మూడు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్‌లో కూడా 8087 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరికొన్ని సోలార్ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. రాష్ట్రం లో అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. అనంతపురం సోలార్ పార్కులో 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫొటో వోల్టాయిక్ ప్రాజెక్టును పూర్తి చేసి.. అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నంలో సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రిజర్వాయర్‌పై 25 మెగావాట్ల సామర్థ్యంతో తేలియాడే సోలార్ ప్లాంట్‌నూ విజయవంతంగా పూర్తి చేసి, వినియోగంలోకి తెచ్చింది. వీటితోపాటు కర్నూలులో 900 మెగావాట్ల భారీ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్రాజెక్టును నిర్మించనుంది. విశాఖపట్నం జిల్లా పూడిమడకలో సుమారు 1200 ఎకరాల్లో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. దీని కోసం సుమారు 7 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని (సోలార్, విం డ్) ఈ ప్రాజెక్టుకు అనుసంధానం చేయనున్నారు.
2 సీబీజీ ప్లాంట్లకు అనుమతి.. ఏపీ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా తాజాగా 32 టన్స్ పర్ డే (టీపీడీ) సామర్థ్యం కలిగిన రెండు కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ) ప్లాంట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడులో 20 టీపీడీ సామర్థ్యం కలిగిన సీబీజీ ప్లాంట్‌ను వికసిత్ అగ్రి గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్..కృష్ణా జిల్లా మల్లవల్లిలో 12 టీపీడీ సామర్థ్యం కలిగిన సీబీజీ ప్లాంట్‌ను ఆరాధ్య బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నాయి.