ఏపీ రైల్వే లైన్లకు మహర్దశ
ABN , Publish Date - Apr 19 , 2026 | 03:47 AM
దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. తూర్పుతీరంలో రైల్వే రవాణా వ్యవస్థను శక్తివంతం చేస్తూ, మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది.
రూ.9,889 కోట్లతో నిడదవోలు-దువ్వాడ రైల్వే లైన్లు
198 కి.మీ. పొడవున మూడు, నాలుగో లైన్ల నిర్మాణం
మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
విశాఖపట్నం, న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. తూర్పుతీరంలో రైల్వే రవాణా వ్యవస్థను శక్తివంతం చేస్తూ, మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది. అందులో ఏపీలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం (దువ్వాడ) వరకు 198 కిలోమీటర్ల పొడవున మూడు, నాలుగో లైన్లు వేయడానికి రూ.9,889 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. రైల్వే శాఖ పరిధిలో మొత్తం రూ.24,815 కోట్ల వ్యయంతో రెండు మల్టీ ట్రాక్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. గజియాబాద్- సీతాపూర్ మధ్య దాదాపు రూ.14,926 కోట్లతో మూడు, నాలుగో రైల్వే లైన్లకు (403 కిలోమీటర్లు) కేంద్రం ఆమోదం తెలిపింది. మరో మల్టీ ట్రాక్ ప్రాజెక్టు ఏపీ పరిధిలో తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల మీదుగా విశాఖపట్నం వరకు వస్తుంది. 2030-31 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. తూర్పు తీరంలో విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల నుంచి సరుకు రవాణా వ్యవస్థను ఈ నిర్ణయం మరింత బలోపేతం చేయనుంది.
ఇప్పటికే ఈ మార్గంలో 130 శాతం మేరకు సరుకు రవాణా జరుగుతోంది. కొత్తగా వేసే లైన్ల వల్ల పోర్టుల నుంచి ఏడాదికి 29 మిలియన్ టన్నుల సరుకు రవాణా పెరుగుతుందని అంచనా. అందులో బొగ్గు, సిమెంట్, రసాయనాలు, ముడి ఇనుము, బాక్సైట్, లైమ్ స్టోన్ వంటివి ప్రధానంగా ఉంటాయి. కొత్త రైల్వే నిర్మాణాల ద్వారా 135 లక్షల పనిదినాల ఉపాధి లభిస్తుంది. తూర్పుతీరంలో రోడ్డు మార్గాలకు వెచ్చించే రవాణావ్యయం 1,150 కోట్లు తగ్గనుంది.
పర్యాటకానికీ ఊతం
పర్యాటక రంగాభివృద్ధికీ కొత్త మార్గం దోహదపడుతుందని భావిస్తున్నారు. అన్నవరం,అంతర్వేది, ద్రాక్షారామం తదితర ప్రసిద్థ క్షేత్రాలకు రైల్వే అనుసంధానం మెరుగవుతుంది. హౌడా-చెన్నై హైడెన్సిటీ నెట్‌వర్క్‌లో భాగంగా ఈ మల్టీట్రాక్‌ను మంజూరుచేశారు. దీనిలోభాగంగా గోదావరి నదిపై 4.3 కి.మీ. పొడవున కొత్త రైలు వంతెన, 2.67 కిలోమీటర్ల వయాడక్ట్, 3 బైపాస్‌లు వస్తాయి.