Share News

ఇంకా ఇక్కట్లే

ABN , Publish Date - Apr 28 , 2026 | 04:22 AM

రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభం సోమవారం కూడా కొనసాగింది. అయితే, సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించడం, జిల్లాల కలెక్టర్లకు పరిస్థితిని చక్కదిద్దేలా దిశానిర్దేశం చేయడంతో...

ఇంకా ఇక్కట్లే

  • బంకుల్లో తొలగని ‘నో స్టాక్‌’ బోర్డులు

  • పెట్రోలు, డీజిల్‌ కోసం వాహనాల బారులు

  • సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

  • డిపోల నుంచి బయల్దేరిన ఆయిల్‌ ట్యాంకర్లు

  • సాయంత్రానికి పరిస్థితి కాస్త మెరుగు

  • పోలీసు బందోబస్తుతో రేషన్‌ పద్ధతిలో సరఫరా

  • 600కు చేరిన మూతబడిన బంకుల సంఖ్య

  • మరో రెండు రోజుల్లో సాధారణ పరిస్థితులు

అమరావతి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభం సోమవారం కూడా కొనసాగింది. అయితే, సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించడం, జిల్లాల కలెక్టర్లకు పరిస్థితిని చక్కదిద్దేలా దిశానిర్దేశం చేయడంతో సోమవారం సాయంత్రానికి పరిస్థితి కాస్తమెరుగు పడింది. అయినప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా చాలా బంకుల్లో ‘నో స్టాకు’ బోర్డులు దర్శనమిచ్చాయి. ఇంధన సరఫరా లేక మూతబడిన పెట్రోల్‌ బంకుల సంఖ్య సోమవారానికి 600లకు చేరిందని అధికారులు తెలిపారు. ఇక తెరిచి ఉన్న పెట్రోలు బంకుల దగ్గర పెట్రోలు, డీజిల్‌ కోసం వచ్చిన వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. మండుటెండలో గంటల తరబడి నిలబడ్డారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు రేషన్‌ పద్ధతిలో చమురు విక్రయించాలన్న సర్కారు ఆదేశాల మేరకు బంకుల్లో.. ద్విచక్ర వాహనాలకు గరిష్ఠంగా రూ.200, ఆటోలకు రూ.500, కార్లు, జీపులకు రూ.1000, లారీలు, బస్సులు తదితర భారీ వాహనాలకు రూ.2 వేల విలువైన ఇంధనాన్ని మాత్రమే విక్రయించారు. ఈ క్రమంలో కొన్ని బంకుల్లో వాహనదారులు వాగ్వాదానికి దిగడంతో పోలీసులు సర్దిచెప్పిన పరిస్థితి కనిపించింది.


కదిలిన యంత్రాంగం

సీఎం చంద్రబాబు ఆదేశాలతో అన్ని జిల్లాల యంత్రాంగం ఇంధన సరఫరా, రవాణాపైనే దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఉన్న ఆయిల్‌ డిపోల(డిస్పాచ్‌ సెంటర్లు) నుంచి ట్యాంకర్ల ద్వారా అన్ని జిల్లాలకు డీజిల్‌, పెట్రోలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రానికి అన్ని డిపోల నుంచి మొత్తం 2,608 లోడ్‌ల పెట్రోలు బంకులకు పంపాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ, సాయంత్రానికి 1,165 లోడ్‌లు మాత్రమే పంపగలిగారు. వీటిలో 11,909 కిలో లీటర్లు పెట్రోలు, 19,707 కిలో లీటర్ల డీజిల్‌ ఉన్నట్టు ఆయిల్‌ కంపెనీలు ప్రభుత్వానికి నివేదికలు అందించాయి. ఆదివారంతో పోలిస్తే ఇంధన సరఫరా పెరగడంతో సోమవారం సాయంత్రానికి పెట్రోలు బంకుల వద్ద వాహనాల రద్దీ కొంత మేరకు తగ్గుముఖం పట్టింది. రాత్రివేళలో కూడా ఆయిల్‌ ట్యాంకర్లు తరలివెళ్లేలా చర్య లు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించడంతో ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. ఫలితంగా రెండు, మూడు రోజుల్లో ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ట్రేడర్స్‌ అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. రోజువారీ విక్రయాలకు అనుగుణంగా తాము ఇండెంట్లు పెడుతున్నా ఆయిల్‌ కంపెనీలు సరిపడా డీజిల్‌, పెట్రోలు లోడ్‌ను పంపడం లేదని పెట్రోలు బంకుల డీలర్లు ఆరోపిస్తున్నారు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో వరికోత యంత్రాలు, ట్రాక్టర్లకు, ఆక్వా రంగంలో యంత్రాలకు డీజిల్‌ సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Apr 28 , 2026 | 04:24 AM