కొరత తీవ్రం!
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:21 AM
ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 4,500కు పైగా పెట్రోలు బంకులు ఉండగా.. పలుచోట్ల ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వందల సంఖ్యలో బంకులు మూతబడటంతో...
డీజిల్ ‘నో స్టాక్’.. పెట్రోలుకూ రేషన్!
పెట్రోలు బంకుల వద్ద వాహనాల బారులు
వందల సంఖ్యలో మూతపడిన బంకులు
వాహనదారులు, అన్నదాతల అవస్థలు
మండుటెండలో గంటల తరబడి పడిగాపులు
పలుచోట్ల ఘర్షణలు.. పోలీసు బందోబస్తు
ఆయిల్ కంపెనీల తీరుతోనే సంక్షోభం!
క్రెడిట్ విధానం మార్చడంతో ఇక్కట్లు
కొన్ని బంకుల మూతతో భారీగా పెరిగిన కొనుగోళ్లు.. దాంతో సమస్య తీవ్రం
అమరావతి, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 4,500కు పైగా పెట్రోలు బంకులు ఉండగా.. పలుచోట్ల ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వందల సంఖ్యలో బంకులు మూతబడటంతో డీజిల్, పెట్రోలు కోసం వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే సమస్య కొనసాగుతోంది. తెరిచి ఉంచిన బంకుల వద్ద కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులు తీరుతున్నాయి. డిమాండ్ తగ్గట్టుగా సరఫరా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆయిల్ కంపెనీలు రేషన్ విధానం పాటిస్తూ బంకులకు తక్కువ పరిమాణంలో డీజిల్, పెట్రోలు సరఫరా చేస్తుండటంతో అదంతా గంటల్లోనే ఖాళీ అయిపోతోంది. ఆ వెంటనే బంకుల నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. అప్పటివరకు మండుటెండలో గంటల తరబడి వరుసలో నిలబడి ఓపికగా ఎదురు చూసిన వాహనాదారులు.. నిర్వాహకులతో ఘర్షణలకు దిగుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల బంకుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సివిల్ సప్లయిస్ కమిషనర్ కన్నబాబు శుక్రవారం ఆయిల్ కంపెనీలు, పెట్రోలు బంకుల ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన అమ్మకాలకు మరో 10శాతం అదనంగా డీజిల్, పెట్రోలు సరఫరా చేయాలని కోరగా కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. ఆ మేరకు సరఫరా పెంచినా కూడా పరిస్థితి మెరుగుపడలేదు. ప్రస్తుత ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా డిమాండ్ దాదాపు 50శాతం పెరిగి సమస్య మరింత తీవ్రమవుతోంది.
వ్యవసాయ పనులపై ప్రభావం
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో రైతులు పంట మాసూళ్లలో బిజీబిజీగా ఉన్నారు. ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలకు డీజిల్ కోసం ఖాళీ డబ్బాలతో పెట్రోలు బంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. రొయ్యలు, చేపల చెరువుల రైతుల నుంచి కూడా డీజిల్ కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఆదివారం కైకలూరులో పోలీసు పెట్రోలు బంకు వద్ద రైతులు, వాహనదారులు ఖాళీ డబ్బాలతో కిలోమీటర్ల మేర బారులు తీరారు. దీంతో పోలీసులు దగ్గర ఉండి వాహనదారులకు డీజిల్, పెట్రోలు కొట్టించారు. ద్విచక్ర వాహనాలకు రూ.200కు మించి పెట్రోలు కొట్టడం లేదని వాహనదారులు వాపోతున్నారు.
క్రెడిట్ సౌకర్యం కట్
ఆయిల్ కంపెనీల తీరు వల్లే డీజిల్, పెట్రోలుకు కొరత ఏర్పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో బంకులకు క్రెడిట్‌పై సరఫరా చేసిన కంపెనీలు.. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఆ సౌకర్యాన్ని నిలిపివేశాయి. బకాయిలు పూర్తిగా క్లియర్ చేయడంతో పాటు అడ్వాన్స్‌లు చెల్లించేవారికి మాత్రమే డీజిల్, పెట్రోలు సరఫరా చేస్తున్నాయి. అప్పులు తెచ్చి పాత బకాయిలు చెల్లించినా కూడా ఆయిల్ కంపెనీలు డిమాండ్‌కు తగినంతగా ఇంధన సరఫరా చేయడం లేదని బంకుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతేడాది అమ్మకాల కంటే పది శాతం పెంచే డీజిల్, పెట్రోలు సరఫరా చేస్తున్నామని, అయితే రిలయన్స్, నయారా, జియో తదితర ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు పూర్తిగా సరఫరా నిలిపివేయడంతో ఆ డిమాండ్ కూడా ప్రస్తుతం ప్రభుత్వ రంగ కంపెనీలకు చెందిన బంకులపైనే పడుతోందని కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. పరిశ్రమలకు సరఫరా చేసే బల్క్ డీజిల్ ధర లీటరుకు రూ.22 పెంచడంతో ఆ వినియోగదారులందరూ ఇప్పుడు రిటైల్ ఔట్‌లెట్లను ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో బంకుల నుంచి డీజిల్ బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.