నేతన్నకు ‘పవర్’ గిఫ్ట్
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:29 AM
రాష్ట్రంలోని లక్షకు పైగా చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం బుధవారం నుంచే ఉచిత విద్యుత్ అందించనుంది. ఎన్నికల హామీలో భాగంగా ప్రతి చేనేత కుటుంబానికి...
నేటి నుంచే చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
మర మగ్గాలకైతే 500 యూనిట్ల వరకు
ఏటా నేత కార్మికుడికి రూ.8,640 ఆదా
పవర్ లూమ్‌కు రూ.21,600 దాకా
ప్రభుత్వంపై ఏడాదికి రూ.150 కోట్ల భారం
ధర్మవరం, పిఠాపురం, మంగళగిరిలో ప్రత్యేక హ్యాండ్‌లూం ప్రాజెక్టులు
పది చిన్న క్లస్టర్ల మంజూరు
చేనేత జౌళి మంత్రి సవిత వెల్లడి
అమరావతి/హిందూపురం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని లక్షకు పైగా చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం బుధవారం నుంచే ఉచిత విద్యుత్ అందించనుంది. ఎన్నికల హామీలో భాగంగా ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మర మగ్గాలకైతే 500 యూనిట్ల చొప్పున ఉచితంగా అందజేయనుంది. నేత పనిలో కరెంటు వినియోగం కీలకంగా మారడంతో.. నేతన్నలకు గణనీయమైన ఉపశమనం లభించనుంది. చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత విద్యుత్ ద్వారా ప్రతి చేనేత కార్మికుడికి ఏటా రూ.8,640, మర మగ్గాలకు రూ.21,600 ఆదా అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.04 లక్షల చేనేత కుటుంబాలకు ఉచితంగా అందించడం వల్ల రూ.150 కోట్లు ఖర్చవుతాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రవ్యాప్తంగా చేనేత క్లస్టర్లు, మినీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. ధర్మవరంలో రూ.38.30 కోట్లతో హ్యాండ్ లూమ్ క్లస్టర్, పిఠాపురంలో రూ.12 కోట్లు, మంగళగిరిలో రూ.22.35 కోట్లతో ప్రత్యేక హ్యాండ్‌లూం ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాం. సహకార సంఘాలకు త్రిఫ్ట్ ఫండ్ కేటాయింపు, ఆధునిక నేత యంత్రాల కొనుగోలుకు 90 శాతం సబ్సిడీ, ముడి సరుకుపై రాయితీ వంటివి అమలు చేస్తున్నాం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ వేదికల ద్వారా నేరుగా విక్రయాలకు అవకాశం కల్పిస్తున్నాం. త్వరలోనే నేతన్న భరోసా పథకానికి శ్రీకారం చుట్టనున్నాం. నేతన్నల ఆరోగ్య రక్షణకు యూనవర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం.
ప్రతి నేతన్న గౌరవప్రదమైన జీవనం సాగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆ రోజున ఎన్టీఆర్ కూడు-గూడు-గుడ్డ నినాదంతో చేనేత రంగానికి అండగా నిలిచారు. ఆయన స్ఫూర్తితో సీఎం చంద్రబాబు ఈ రంగం అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 92,724 మంది నేతన్నలకు రూ.4 వేల చొప్పున ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తున్నారు. స్మాల్ క్లస్టర్ అభివృద్ధి కింద పది చిన్న క్లస్టర్లు మంజూరు చేశాం. ఇందుకోసం 15 శాతం రాయితీపై నూలు, సబ్సిడీ ఇస్తున్నాం. 2024 నుంచి 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.78.73 కోట్లు నగదు పరపతి సౌకర్యం కల్పించాం. చేనేత వస్ర్తాల అమ్మకాలు పెంచేలా ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించి, 40-50 శాతం డిస్కౌంట్‌లతో చేనేత ఉత్పత్తులు విక్రయిస్తాం. చేనేత వస్ర్తాలపై ఆప్కో, చేనేత సంఘాలకు జీఎ్‌సటీ మినహాయించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. ఆప్కోలో డిజిటలైజేషన్‌కు ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు లభించింది’ అని మంత్రి వివరించారు.