లోకాయుక్త ఎంపికకు సెర్చ్ కమిటీ
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:14 AM
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త, ఉపలోకాయుక్త నియామక విధానం, పద్ధతి నియమాలు-2025కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది.
అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త, ఉపలోకాయుక్త నియామక విధానం, పద్ధతి నియమాలు-2025కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది. లోకాయుక్త పదవి ఖాళీగా ఉన్నప్పుడు, అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల ఎంపికకు అన్ని హైకోర్టుల రిజిస్ర్టార్ జనరల్స్‌కు సమాచారం ఇవ్వడం ద్వారా నామినేషన్లు కోరుతారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడం కోసం ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన సెర్చ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు జీవోలో వెల్లడించారు. దరఖాస్తులను సెర్చ్ కమిటీ పరిశీలించి, అభ్యర్థుల అర్హతలు, అనుకూలతలను చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా అంచనా వేసి, లోకాయుక్త, ఉపలోకాయుక్త పదవులకు తగిన విధంగా చెరో ఐదుగురితో ప్యానెల్ సిద్ధం చేస్తుంది. ఈ ప్యానెళ్లను సెలక్షన్ కమిటీకి పంపిస్తారు. దాని సిఫారసు ఆధారంగా.. ప్రభుత్వం లోకాయుక్త, ఉపలోకాయుక్తను నియమిస్తుంది.