నదుల్లో కాలుష్య నియంత్రణకు ‘టాస్క్‌ఫోర్స్’
ABN , Publish Date - May 28 , 2026 | 05:34 AM
వచ్చే ఏడాది జరగనున్నగోదావరి పుష్కరాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో కాలుష్య నియంత్రణ లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
చైర్మన్‌గా అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
త్వరలోనే సమగ్ర పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తాం
నిబంధనలు ఉల్లంఘిస్తే పరిశ్రమలకు తాళాలే
ఆంధ్రా పేపరు మిల్లువి దొంగ మాటలు: మంత్రి దుర్గేశ్
అమరావతి/రాజమహేంద్రవరం, మే 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జరగనున్నగోదావరి పుష్కరాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో కాలుష్య నియంత్రణ లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుష్కరాల ఏర్పాట్లపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా సమీక్షించిన సందర్భంగా నదుల్లో కాలుష్యాన్ని తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గోదావరితో పాటు ఇతర నదుల్లో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేందుకు పర్యావరణ పరిరక్షణ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించే ఈ టాస్క్‌ఫోర్స్‌కు కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. పురపాలక, పంచాయతీరాజ్, పరిశ్రమలు, వ్యవసాయం, మత్స్య, దేవదాయ శాఖల కమిషనర్లు, ఏపీ టూరిజం సీఈవో, జలవనరులు, గ్రామీణ నీటి సరఫరా శాఖల చీఫ్ ఇంజనీర్లు, మిషన్ డైరెక్టర్ ఫర్ క్లీన్ కృష్ణా, గోదావరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పోలవరం జిల్లాల కలెక్టర్లను సభ్యులుగా నియమించింది. గోదావరి నదిలో కాలుష్యంపై త్వరలోనే సమగ్ర పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ప్రజా రక్షణ, పర్యావరణ ప్రమాణాలను ఉల్లంఘించే కంపెనీలకు తాళాలు తప్పవని హెచ్చరించారు. వ్యర్థాల తీవ్రత, నిర్వహణఫై ఆంధ్రా పేపర్ మిల్లు వారు దొంగమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. మునిసిపాలిటీకి రూ.13 కోట్ల బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఓవైపు లాభాలు పొందుతూ కార్మికులకు కనీసం వేతనాలు ఇవ్వడానికి వెనుకడుగు వేసే దారుణ పరిస్థితుల్లో కడియం పేపరు మిల్లు యాజమాన్యం ఉందని ఆరోపించారు. కుంభమేళా తరహాలో పుష్కరాలను వైభవంగా నిర్వహించడానికి రూ.8,500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షులను త్వరలో నియమిస్తామన్నారు.