పౌరసరఫరాల శాఖలో విజిలెన్స్ కమిటీ!
ABN , Publish Date - Jun 30 , 2026 | 06:27 AM
రాష్ట్ర పౌరసరఫరాలశాఖలో తనిఖీల కోసం ప్రభుత్వం ప్రత్యేక విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రజా పంపిణీ అవసరాల కోసం..
శాఖపరంగా తనిఖీలకు 12 మంది అధికారులతో ఏర్పాటు
అక్రమాలు, అవకతవకలపై ఫిర్యాదులు పెరగడంతో చర్యలు
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పౌరసరఫరాలశాఖలో తనిఖీల కోసం ప్రభుత్వం ప్రత్యేక విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రజా పంపిణీ అవసరాల కోసం ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ డెలివరీలు, పీడీఎస్ స్టాక్ పాయింట్లు, ఎల్పీజీ అవుట్‌లెట్లు, దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలు, అవకతవకలపై ఫిర్యాదులు ఎక్కువవుతుండటంతో శాఖపరంగా తనిఖీలను ముమ్మరం చేసేందుకు 12 మంది అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ పౌరసరఫరాల కమిషనర్ కె.కన్నబాబు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు, కర్నూలు, కడప, శ్రీసత్యసాయి, బాపట్ల, పార్వతీపురం మన్యం జిల్లాల డీఎస్‌వోలతోపాటు పశ్చిమగోదావరి జిల్లా ఏఎస్‌వో, విజయవాడలో సివిల్ సప్లయిస్ ప్రధాన కార్యాలయం నుంచి మరొక ఏఎస్‌వో ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు, మండల స్టాక్ పాయింట్లు, బఫర్ గోదాములు, రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోలు బంకులు, అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందితే.. వెంటనే ఆకస్మిక తనిఖీలు, దాడులు నిర్వహిస్తుంది. ఆ దాడుల్లో వెలుగు చూసిన అక్రమాలు, ఉల్లంఘనలపై నివేదికలు రూపొందించి పౌరసరఫరాల కమిషనర్‌కు నివేదిస్తుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎస్‌వోలు, పౌరసరఫరాల డీఎంలు, ఇతర అధికారులు ఈ బృందానికి అవసరమైన సహకారాన్ని అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.