Share News

ఇంధన పొదుపునకు ప్రాధాన్యం

ABN , Publish Date - May 17 , 2026 | 05:09 AM

కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతాంశంగా తీసుకుందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు.

ఇంధన పొదుపునకు ప్రాధాన్యం

  • పునరుత్పాదక విద్యుత్‌కు కూటమి పెద్దపీట: మంత్రి గొట్టిపాటి

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతాంశంగా తీసుకుందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశమంతటా కోటి సూర్యఘర్‌ కనెక్షన్లు ఉండాలని ప్రధాని నిర్దేశిస్తే ఒక్క ఏపీలోనే 20 లక్షల కనెక్షన్లు లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో ఇంటిపై 2 కిలోవాట్ల సామర్థ్యంతో 6 లక్షల సూర్యఘర్‌ కనెక్షన్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆస్పత్రులపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసి ప్రజలపై భారంపడకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వినియోగదారులపై విద్యుత్‌ బిల్లుల భారం పడకుండా ప్రభుత్వమే ఆ భారాన్ని భరించిందని చెప్పారు. పగటిపూట లభ్యమయ్యే గాలి, వెలుతురు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని సీఎం నిర్ణయించి, వాటిని ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోనూ సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, సోలార్‌ ద్వారా వంట చేసుకునే విధానాన్నీ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి విద్యుత్‌ సంస్కరణలు అమలవుతున్నా వాటిని అందిపుచ్చుకునే తొలి రాష్ట్రంగా ఏపీని నిలిపేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు.

Updated Date - May 17 , 2026 | 05:10 AM