Share News

ఏపీ.. హెచ్‌పీ!

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:01 AM

ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లు, సంక్షేమ పథకాలు, అప్పులపై వడ్డీలు, అసలుకు కట్టే కిస్తీలు... ఇంకా రకరకాల అవసరాలు! కానీ ఆదాయం చూస్తే అత్తెసరు! మొత్తంగా...

ఏపీ.. హెచ్‌పీ!

  • ఖర్చుల నియంత్రణ కోసం జీతాలు తగ్గించిన హిమాచల్‌

  • ఆర్థికంగా మనమూ అంతంతే

  • అప్పులు ఆగిపోతే అధోగతే

  • జీతాలు, పెన్షన్ల వ్యయం ఏపీలోనే అధికం

  • వడ్డీలు, అప్పుల కిస్తీల భారం కొండంత

  • సొంత ఆదాయం ఈ ఖర్చులకే సరి

  • సంక్షేమ పథకాలకు రూ.75 వేల కోట్లు

  • అనర్హులను ఏరివేసే ధైర్యం చేయలేరు

  • దుబారా ఖర్చులు తగ్గించుకోరు

  • ఇలాగైతే మనదీ హెచ్‌పీ పరిస్థితే!

ఇతరత్రా దుబారా తగ్గించుకుని, పొదుపు మంత్రం పాటిస్తే తప్ప రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు. కానీ, మన ప్రభుత్వాలు దీని గురించే పట్టించుకోవు.

సంక్షేమ పథకాలు అమలు చేయడం ఎంత ముఖ్యమో... అందులో అనర్హులను ఏరివేయడం అంతే ముఖ్యం. కానీ... ఏ ప్రభుత్వమూ ఇందుకు సాహసించదు.

రాష్ట్రాల సొంత ఆదాయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లదే అగ్రవాటా. ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగితే... ప్రభుత్వ ఆదాయం ఉద్యోగుల జీతాలకు కూడా సరిపోదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లు, సంక్షేమ పథకాలు, అప్పులపై వడ్డీలు, అసలుకు కట్టే కిస్తీలు... ఇంకా రకరకాల అవసరాలు! కానీ ఆదాయం చూస్తే అత్తెసరు! మొత్తంగా... గాలి బుడగలా ఆర్థిక పరిస్థితి! చిన్నపాటి ఒత్తిడి తలెత్తితే పేలిపోవడమే! ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి మాత్రమే కాదు! దేశంలోని మెజారిటీ రాష్ట్రాల ఆర్థిక దుస్థితి! ఇప్పుడు... హిమాచల్‌ ప్రదేశ్‌ బయటపడింది! పొదుపు మంత్రం పఠిస్తోంది. రేపు... ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పథకాలు, సబ్సిడీల మాటెలా ఉన్నా కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరు. ఆదాయంకంటే జీతాలు, పెన్షన్లు, సబ్సిడీల భారం పెరిగితే అంతే సంగతులు! పేరుగొప్ప ‘ధనిక రాష్ట్రాలు’ సైతం బొక్కబోర్లా పడక తప్పదు. హిమాచల్‌ ప్రదేశ్‌ చిన్న రాష్ట్రం. ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో... ప్రభుత్వం సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, సెక్రటరీ ఆపై అధికారుల జీతాల్లో 50 నుంచి 20 శాతానికి కోత వేసింది. ఈ చెల్లింపులను 6 నెలలపాటు వాయిదా వేసింది. ప్రభుత్వ ఆదాయాల కంటే రెవెన్యూ ఖర్చులు వేగంగా పెరిగితే ఎంతటి బలమైన రాష్ట్రమైనా తట్టుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఎప్పుడో వెంటిలేటర్‌పైకి ఎక్కేసింది. రాష్ట్రానికి అప్పులు ఆగిపోతే ఆ క్షణమే కుప్పకూలిపోతుంది.


జీతాలు, పెన్షన్లు...

ఏపీ విషయానికొస్తే... ఏటా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి రూ.70,000 కోట్లు చెల్లించాలి. అప్పులపై అసలు, వడ్డీ కలిపి మరో రూ.75వేల కోట్లు! రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే ఆదాయం కంటే ఈ రెండు పద్దులపై పెట్టే వ్యయమే ఎక్కువ. ఇవి తప్పనిసరి, తప్పించుకోలేని ఖర్చులు. ఇక అధికారులు తాము తీసుకునే జీతభత్యాలు చాలవని భారీ స్థాయిలో వాహనాలనూ వాడుతున్నారు. చాలామంది ప్రభుత్వం ఇచ్చే వాహనం సరిపోదంటూ తమ పరిధిలోని కార్పొరేషన్లు, హెచ్‌ఓడీల నుంచీ లెక్కకుమించి వాహనాలు వాడుతున్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకునే సిబ్బందిని తమ సొంత అవసరాలకు వాడుతున్నారు. ఇక... విచ్చలవిడిగా ప్రొటోకాల్‌ ఖర్చులు! జగన్‌ హయాంలో ఆప్కాస్‌ ద్వారా 50,000 మందికి పైగా ఉద్యోగులను కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమించారు. వారంతా ఎక్కడ పనిచేస్తున్నారో లెక్క తేలలేదు. కానీ, వారికి జీతాలు మాత్రం వెళ్తున్నాయి.


సంక్షేమంలో సంక్షోభం!

పేదలకు సంక్షేమ పథకాలు అందాల్సిందే! వారి ఆర్థిక స్థితి మెరుగు పడాల్సిందే! కానీ.. ఇందులో లీకేజీల మాటేమిటి? ఏపీలో వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా సుమారు రూ.75వేల కోట్లు! ‘దేశంలో మరో రాష్ట్రంలో లేనివిధంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్నాం!’... అని ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకొంటున్నాయి! దానిభారం... ఏటా రూ.35వేల కోట్లు. ‘తల్లికి వందనం’ మూల్యం రూ.10వేల కోట్లకు పైగానే. ‘అన్నదాతా సుఖీభవ’ వంటి వ్యవసాయ సంబంధిత పథకాల వ్యయం రూ.4వేల కోట్లు! ఎంతమంది రేషన్‌ బియ్యం వండుకుని తింటున్నారనే విషయం పక్కన పెడితే... రేషన్‌ బియ్యం కోసం ఏటా పెడుతున్న ఖర్చు రూ.15వేల కోట్లు! ఉచిత బస్సు ప్రయాణాలు (స్త్రీ శక్తి), దీపం సిలిండర్లు, ఇతరత్రా పథకాలు, సబ్సిడీలు కలిపి మరో రూ.10వేల కోట్లపైనే ఖర్చు తేలుతుంది. ఈ పథకాలు అందుకుంటున్న వారంతా పేదలేనా? అనర్హులను ఏరివేయలేరా? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ... అనర్హుల జోలికి వెళ్లలేదు! వెళితే... ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనే భయం! దీంతో... సంక్షేమ పథకాల రూపంలో భారీగా అనర్హులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాలన్నీ దాదాపుగా అప్పులు తెచ్చి అమలు చేస్తున్నవే! అప్పు పుట్టకపోతే అసలు పథకమే ఉండదు!


కాగ్‌, సమీర్‌ శర్మ నివేదికలు

దేశంలోని రాష్ట్రాలు పెరుగుతున్న జీతాలు, పెన్షన్లు, వడ్డీ ఖర్చుల భారంలో చిక్కుకుపోయాయని, దీంతో మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలకు అవకాశం లేకుండా పోయిందని ‘కాగ్‌’ ఇటీవల తన నివేదికలో వెల్లడించింది. అలాగే, 2021లో సీఎస్‌గా ఉన్న సమీర్‌ శర్మ అప్పటి సీఎం జగన్‌కు దీనిపై ఒక నివేదిక ఇచ్చారు. కొత్తగా పీఆర్సీ అమలుచేస్తే మరో రూ.10,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని, అన్నీ కలుపుకొని ఉద్యోగుల, జీతాలు పెన్షన్లకు రూ.78,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం మొత్తం ఖర్చులో జీతాలు, పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమని సమీర్‌ శర్మ నివేదికలో తెలిపారు. దేశంలో హిమాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, త్రిపుర రాష్ట్రాలు జీతాలు, పెన్షన్లకు తీవ్ర ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం జీతాలు తగ్గించేసింది.


వామ్మో కన్సల్టెంట్లు...

ఐఏఎ్‌సలు, సీనియర్‌ అధికారులు, సెక్షన్‌ ఆఫీసర్లు, ఇంకా ఎంతోమంది అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నప్పటికీ... విచ్చలవిడిగా కన్సల్టెంట్లను నియమించుకోవడం ట్రెండుగా మారింది. ‘నైపుణ్యం... ప్రొఫెషనలిజం’ పేరుతో వాళ్లకు లక్షలకు లక్షల జీతాలు ఇస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవడం, వారికి తగిన శిక్షణ ఇవ్వడం గురించి ఆలోచించడంలేదు.

విద్య, వైద్యం మాటేమిటి?

ప్రమాణాలతో కూడిన విద్య, ఉత్తమ వైద్యం! పేదల బతుకులను నిలబెట్టేవి, భవిష్యత్తును మార్చేవి ఇవే. కానీ... ఇబ్బడిముబ్బడి సంక్షేమ పథకాల ప్రవాహంలో కొట్టుకుపోతూ కీలకమైన ఈ రంగాలనే ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. వచ్చిన ఆదాయం, తెచ్చిన అప్పులన్నీ జీతభత్యాలు, పెన్షన్లు, అప్పుల అసలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, ప్రభుత్వ మద్దతులో నడిచే కార్పొరేషన్లకు ఇచ్చే గ్రాంట్లు, రోజువారీ కార్యకలాపాలు, నిర్వహణకే సరి! ఈ విషయాన్ని ‘కాగ్‌’ స్వయంగా తన నివేదికలో తెలిపింది. రాష్ట్ర బడ్జెట్లలో 83.25 శాతం పైసా తిరిగి రాని రెవెన్యూ ఖర్చులకే కేటాయిస్తున్నారు.

Updated Date - Apr 22 , 2026 | 04:05 AM