ఏపీకి విదేశీ పెట్టుబడుల వెల్లువ
ABN , Publish Date - Aug 06 , 2026 | 04:28 AM
ఆంధ్రప్రదేశ్‌కు పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంతో పోలిేస్త 6 రెట్లు ఎఫ్‌డీఐలు పెరిగాయని స్పష్టం చేసింది.
6 రెట్లు పెరిగిన ఎఫ్‌డీఐలు
2023-24లో 92.13 మిలియన్ డాలర్లే
2025-26లో 608.59 మిలియన్ డాలర్లకు పెరుగుదల
పల్లెల్లో డిజిటల్, వసతుల కల్పనలోనూ ఏపీ భేష్
పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ ప్రశ్నకు కేంద్రం జవాబు
న్యూఢిల్లీ, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంతో పోలిేస్త 6 రెట్లు ఎఫ్‌డీఐలు పెరిగాయని స్పష్టం చేసింది. పార్లమెంట్ సాక్షిగా లెక్కలతో సహా ఏపీ వృద్ధిని వివరిస్తూ ప్రసంశంల్లో ముంచెత్తింది. బుధవారం వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర సైన్స్, టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆ వివరాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు కేవలం 92.13 మిలియన్ డాలర్లకే (సుమారు రూ.760 కోట్లు) పరిమితమయ్యాయి. అయితే, కొత్త పారిశ్రామిక విధానం, సింగిల్ విండో అనుమతులు వేగవంతం కావడంతో 2024-25లో ఇవి 233.14 మిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇక 2025-26లో రికార్డుస్థాయిలో 608.59 మిలియన్ డాలర్లకు (రూ.5,000 కోట్లకు పైగా) చేరి.. దాదాపు 6.6 రెట్ల వృద్థిని నమోదు చేయడం పారిశ్రామిక వర్గాల్లో సరికొత్త ఆశలు నింపింది. లోహ పరిశ్రమల రంగంలో అత్యధికంగా 250.67మిలియన్ డాలర్లు, ఆహార శుద్థి రంగంలో 107.30 మిలియన్ డాలర్లు, సిమెంట్ ఉత్పత్తుల రంగంలో 99.90 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు వివరించింది. గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక విధానాల్లో అనిశ్చితితో విదేశీ పెట్టుబడుల్లో రాష్ట్రం వెనుకబడింది.
పంచాయతీల్లోని మౌలిక సదుపాయాల్లోనూ అగ్రగామి
ఏపీలో స్థానిక పరిపాలన, గ్రామీణ డిజిటలైజేషన్ నెట్‌వర్క్ కూడా బలంగా పుంజుకుందని కేంద్రం వెల్లడించింది. 96.8శాతం పంచాయతీల్లో గ్రామసభ హాల్స్, సీటింగ్ సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. పంచాయతీ రికార్డుల్లో 90.3శాతం డిజిటలైజ్ కావడం పారదర్శకతకు నిదర్శనంగా నిలిచింది. 90.3శాతం పంచాయతీల్లో మంచినీటి సదుపాయం కల్పించారు. 96.8శాతం పంచాయతీల్లో సమాచార మార్పిడికి వాట్సాప్ వినియోగిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా, 38.7శాతం పంచాయతీలకు వీడియో కాన్ఫరెన్సింగ్ వసతులు సమకూరాయి. 67.7శాతం కేంద్రాల్లో ప్రత్యేక మరుగుదొడ్లు, సౌండ్‌సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ స్థాయిలో డిజిటల్ నెట్‌వర్క్ (90శాతం పైగా రికార్డుల డిజిటలైజేషన్) బలపడటం, పారిశ్రామిక విధానాలు పారదర్శకంగా ఉండటంతోనే బహుళజాతి సంస్థలు ఏపీకి ప్రాధాన్యమిస్తున్నట్లు కేంద్ర నివేదిక వెల్లడిస్తోంది.