జలాశయాలు వెలవెల
ABN , Publish Date - May 14 , 2026 | 05:00 AM
రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు అడుగంటిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 39.2 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి.
డెడ్ స్టోరేజీ చేరువకు శ్రీశైలం
కేవలం 7.7 అడుగులే అందుబాటులో
అదేదారిలో నాగార్జునసాగర్
మరో 14 అడుగులు తగ్గితే వాడకం కష్టమే
రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు
అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు అడుగంటిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 39.2 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లో డెడ్ స్టోరేజీ 810 అడుగులకు గాను 817.7 అడుగుల మేర నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అంటే.. డెడ్ స్టోరేజీ స్థాయికి పైన కేవలం 7.7 అడుగుల మేర కృష్ణా జలాలున్నాయి. మరో ప్రధాన జలాశయం నాగార్జునసాగర్‌లోనూ గరిష్ఠ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను ప్రస్తుతం 157.42 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజీ 510 అడుగులకు గాను 524 అడుగుల మేర నీటి నిల్వలున్నాయి. వేసవి తాపం తీర్చేందుకు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీలు, తెలంగాణకు 16 టీఎంసీలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) కేటాయించింది. ఇక పులిచింతలలో 45.77 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యానికి గాను 32.42 టీఎంసీల జలాలున్నాయి. గాజులదిన్నెలో 4.5 టీఎంసీలకు గాను 2.25, గోరకల్లులో 11 టీఎంసీలకుగాను 2.75 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీలో మాత్రం గరిష్ఠ స్థాయిలో 3.07 టీఎంసీల జలాలున్నాయి.
జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు
గత ఏడాది వర్షాలు బాగానే పడినా.. ఈ ఏడాది ఇప్పటి దాకా తగినంతగా కురవలేదు. దీంతో చాలా జిల్లాల్లో వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. కోస్తాంధ్రలో 13.68 మి.మీ.కు 6.26, రాయలసీమలో 6.48 మి.మీ.కు 0.95 వర్షపాతం నమోదైంది. మొత్తంగా రాష్ట్రంలో 9.56 మి.మీ.కు 4.4 వర్షపాతం నమోదైంది. మొత్తానికి రాష్ట్రమంతా ఈ నెల లో వర్షపాతం తక్కువగా నమోదు కావ డం, చెరువుల్లో నీళ్లు అడుగుకు చేరడంతో రైతాంగంలో ఆందోళన మొదలైంది.