లోటు.. కాటు
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:42 AM
రాష్ట్రంలో కరువు చాయలు అలుముకుంటున్నాయి. ఎల్ నినో ప్రభావంతో తలెత్తిన తీవ్ర వాన లోటుకు తోడు, కాలువల్లో నీరు పెద్దగా లేకపోవడంతో ఇప్పటికే వేసిన పంటలు ఎండిపోతున్నాయి.
వాన లేక ఎండుతున్న పైర్లు
భయపెడుతున్న కరువు చాయలు
జూన్, జూలైలో 55.9 శాతం వర్షపాతమే
ఏకంగా 21 జిల్లాల్లో వాన లోటు
ఇప్పటికే వేసిన పంటలపై ఆందోళన
కాపాడుకునేందుకు రైతుల యత్నం
బుంగలతో నీళ్లు పోస్తూ పత్తికి ప్రాణం
బెండ రక్షణకు ట్యాంకర్లతో నీళ్లు
బోర్లు, చెరువుల నుంచి డ్రమ్ములతో
నీళ్లు తెచ్చి నారుమడులకు తడి
మెట్ట కష్టమే.. వరికి నీరు గగనమే
వర్షాధార, ప్రత్యామ్నాయ పంటలు వేయాలి.. మంత్రి అచ్చెన్న సమీక్ష
దట్టంగా మేఘాలు పట్టి...గట్టిగా వానలు పడాల్సిన సమయమిది. కానీ, వాన జాడ కోసం రాష్ట్రం ముఖం వాచేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి. జూలై చివరకు వచ్చినా సీజనల్ వానలు కరువయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో ఎండుతున్న పంటల రక్షణకు రైతులు భగీరఽథ ప్రయత్నం చేస్తున్నారు. మెట్టప్రాంతాల్లో వెదజల్లిన వరి పైరు, వరి నారుమడులు ఎండిపోతున్నాయి. ఇప్పటికే వేసిన పత్తి, బెండ, ఉల్లి, అపరాల పంటలను కాపాడుకునేందుకు కడవలతో, ట్యాంకర్లతో రైతులు తడులు పెడుతున్నారు.
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో కరువు చాయలు అలుముకుంటున్నాయి. ఎల్ నినో ప్రభావంతో తలెత్తిన తీవ్ర వాన లోటుకు తోడు, కాలువల్లో నీరు పెద్దగా లేకపోవడంతో ఇప్పటికే వేసిన పంటలు ఎండిపోతున్నాయి. జూన్ 1నుంచి ఇప్పటివరకు 55.9శాతం వర్షపాతం లోటు ఏర్పడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఏకంగా 21 వానలోటులో ఉన్నాయి. మొత్తం 249మండలాలు తీవ్రలోటు, 359 మండలాలు మోస్తరు లోటులో ఉన్నాయి. కేవలం 2 మండలాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమతోపాటు ఉత్తరాంధ్ర, ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాలూ వర్షాభావంతోనే ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ కింద వేసిన పంటలు ఎండు మొఖం పట్టాయి. మెట్ట ప్రాంతాల్లో పంటలకు వాన చాలీచాలని పరిస్థితి. దీంతో రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగించి, పంటలను కాపాడుకుంటున్నారు. కడప జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో పంటలను రైతులు కాపాడుకునేందుకు కాలువ పక్కనే ట్రాక్టర్ ఇంజన్లు పెట్టుకుని నీళ్లపైపులు ఏర్పాటు చేసుకుని పంటలకు సరఫరా చేసుకుంటున్నారు. ఏలూరులోని మెట్ట ప్రాంతాల్లో వరి పైరు, నారుమడులు ఎండిపోతున్నాయి. మురుగు డ్రెయిన్లలోని కొద్దిపాటి నీటిని ఇంజన్లతో తోడి పైరును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వానల కోసం ప్రత్యేక పూజలు, వరుణ యాగాలు నిర్వహించారు. దెందులూరు మండలం కొవ్వలి, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో కప్పలకు పెళ్లి చేశారు. విజయనగరం జిల్లాలో చాలాచోట్ల నారుమళ్లు ఎండుతున్నాయి. గంట్యాడ మండలం సిరిపురంలో నారు మడి నెర్రెలిచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లాలో కొన్నిచోట్ల రైతులు మోటార్ల సాయంతో నారుమడికి తడులు అందిస్తున్నారు. మరికొన్ని చోట్ల సుదూర ప్రాంతాల్లో ఉన్న బోర్లు, చెరువుల నుంచి డ్రమ్ములు, బిందెలతో నీటిని తెచ్చుకుని నారుమడులను కాపాడుకుంటున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం, నంద్యాల, కొత్తపల్లె, డోన్ మండలాల్లో . 28వేల హెక్టార్లలో వేసిన మొక్కజొన్న పంట కళ్లముందే ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మండలాల్లో కాల్వల్లో నిలిచిన నీటిని మోటార్‌లతో తోడు కుంటూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వచ్చేది మరింత కష్టకాలం..
గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా జూన్, జూలైలో వర్షపాతలోటు 50శాతం దాటింది. గత 50 రోజుల్లో ఎల్‌నినో ప్రభావం ఎక్కువగానే ఉంది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు ల్లో ఇది తీవ్ర రూపందాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే.. ఖరీఫ్ పైర్లు పూర్తిగా దెబ్బతినడంతో పాటు.. పంట ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా తగ్గిపోయే అవకాశంఉంది. రాష్ట్ర జీవీఏపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార ప్రాజెక్టుల నుంచి డెల్టా ఆయకట్టులకు సాగునీరు విడుదల చేయడంతో అన్నదాతలు వరి సాగును ముమ్మరం చేశారు. మరోవైపు వ్యవసాయ బోర్ల కింద కూడా కొందరు వరిసాగు చేస్తున్నారు. రుతుపవన వర్షాలు చాలా తక్కువగా కురవడంతో పాటు వేసవికి కొనసాగింపుగా గడిచిన 50 రోజుల్లో ఎక్కువ రోజులు పొడి వాతావరణం, ఎండ తీవ్రత కొనసాగుతోంది. దీంతో భూగర్భజలాలు కూడా పెద్దగా వృద్ధి చెందలేదని అధికారులు చెప్తున్నారు. అయినా కొందరు రైతులు బోర్లు కింద వరి సాగు చేస్తున్నారు. ఈ సీజన్‌లో 15.14 లక్షల హెక్టార్లలో వరి సాగు జరగాల్సి ఉండగా, ఇప్పటికే 34 శాతం దాకా నాట్లు పడ్డాయి. ఇంకా వరి నాట్లు వేయని రైతులు పునరాలోచన చేసి, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నారు.
ఖరీఫ్ పంటలకు గండం
నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 580.1 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటికే 225.7 మిల్లీమీటర్ల వాన పడాల్సి ఉంది. కానీ కేవలం 104.5 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. దీంతో 53.7శాతంలోటు ఏర్పడింది. పశ్చిమగోదావరి 77.9శాతం , అన్నమయ్య 70.9శాతం , కోనసీమ 69.5శాతం , తూర్పుగోదావరి 65.7శాతం , విశాఖ 65శాతం , ప్రకాశం 63.9శాతం, చిత్తూరు 61.5శాతం తీవ్ర వానలోటులో ఉన్నాయి. 249 మండలాలు తీవ్ర లోటు, 359 మండలాలు మోస్తరు లోటులో ఉన్నాయి. 168 మండలాల్లోని 1,357 రైతుసేవా కేంద్రాల పరిధిలో ఖరీఫ్ పంటలు ఎల్‌నినో ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా కోస్తాంధ్ర, రాయలసీమలోని మండలాలన్నీ వర్షపాత లోటునే ఉన్నాయి. సాధారణ స్థాయిలో కూడా వర్షాలు కురవకపోతుండటంతో మెట్ట పంటలకు నీటితడులు అందించడం కష్టసాధ్యంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగు 30.84లక్షల హెక్టార్ల లక్ష్యంలో ఇప్పటి వరకు 16.35లక్షల హెక్టార్లలో(39శాతం) సాగులోకి వచ్చాయి. రాష్ట్రంలో ప్రధానమైన వరి, పత్తి, అపరాలు, చిరుధాన్యాల సాగు సాధారణ స్థాయిలో ఉండగా, వేరుశనగ లక్ష హెక్టార్లలో కూడా విత్తనం పడలేదు. జూలై 25 నాటికి 12 జిల్లాల్లో సాధారణంగా సాగవ్వాల్సిన విస్తీర్ణంలో 50శాతం నేలలో విత్తనం పడలేదు. అన్నమయ్య, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో అతి తక్కువగా సాగు జరుగుతోంది. అయితే శ్రీకాకుళం, అల్లూరి, నెల్లూరు, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సాధారణ స్థాయిలో విత్తనం పడింది. వాన లోటు తీవ్రంగా ఉన్న 168 మండలాల్లో సాధారణ సాగు 39శాతానికి చేరింది. కర్నూలు జిల్లాలో వానలోటున్న ఎక్కువ మండలాల్లోనూ రైతులు పంటల సాగు చేపట్టారు. మార్కాపురం జిల్లాలో సాగు వెనుకబడి ఉంది. మరోవైపు కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార డెల్టాల్లో వరి సాగు ప్రశ్నార్ధకంగా మారింది. ఎగువ నుంచి నదీ జలాలు వచ్చే పరిస్థితి లేక.. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోని నీటిని కాలువలకు వదిలిన ప్రభుత్వం.. వరి సాగుపై గ్యారెంటీ ఇవ్వలేని స్థితికి వచ్చింది. అయితే వాస్తవంగా ఎప్పుడైనా వర్షపాతం గణనీయంగా తగ్గితే.. జూలై నెలాఖరు లేదా ఆగస్టు 15 వరకు పరిస్థితిని అంచనా వేసి, వర్షపాతం తీవ్ర లోటు ఉండే మండలాలను ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించడం జరుగుతోంది. ఈ సారి అదే పరిస్థితి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.