అటు ఎండా.. ఇటు వాన!
ABN , Publish Date - May 01 , 2026 | 04:28 AM
రాష్ట్రంలో ఓవైపు ఎండ తీవ్రత, వడ గాలి, ఉక్కపోత ఉండగా, మరోవైపు ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నెల్లూరు జిల్లా గూడూరులో...
ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి
అమరావతి/ విశాఖపట్నం, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓవైపు ఎండ తీవ్రత, వడ గాలి, ఉక్కపోత ఉండగా, మరోవైపు ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. పల్నాడు, కడప, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, చిత్తూరు, గుంటూరు జిల్లాలతో సహా 20 జిల్లాల్లోని 216 మండలాల్లో 41 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్కాపురం జిల్లా పొదిలిలో 37, ఎన్టీఆర్ జిల్లా కుంటముక్కలలో 22, మిల్లీమీటర్ల వాన పడింది. కాగా, ఎన్టీఆర్ జిల్లాలో గురువారం సాయంత్రం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. జి.కొండూరు మండలం కవులూరులో పశువుల కాసేందుకు పొలానికి వెళ్లి వస్తున్న తాడికొండ రామారావు(80) పిడుగుపాటు శబ్దానికి గుండె ఆగి మృతి చెందాడు. కాగా, తిరుమలలో మధ్యాహ్నం 20నిమిషాల పాటు వడగండ్ల వాన కురిసింది.
13 నాటికి అండమాన్‌కు రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది గడువు కంటే ముందుగానే దేశంలో ప్రవేశిస్తాయని పలువురు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 13 నాటికి అండమాన్, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతం, ఆగ్నేయ అరేబియా సముద్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్‌లో పేర్కొంది.