Share News

ఏప్రిల్‌ వరకు ఉపాధి పథకం

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:53 AM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏప్రిల్‌ నెలాఖరు దాకా కొనసాగించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్‌ వరకు ఉపాధి పథకం

  • మే నుంచి ‘జీ రామ్‌ జీ’ అమలు

  • ఈకేవైసీలో దేశంలో నంబర్‌ వన్‌గా నిలిచిన ఏపీ

  • 90శాతం ఈకేవైసీతో దొంగ మస్టర్లకు చెక్‌

  • కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రశంసలు

అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏప్రిల్‌ నెలాఖరు దాకా కొనసాగించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం స్థానంలో ‘వీబీ జీ రామ్‌ జీ’ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఈ పథకం విధి విధానాలు, మార్గదర్శకాలను ఇంకా విడుదల చేయలేదు. దీంతో పాటు దేశ వ్యాప్తంగా ఉపాధి పథకంలో ప్రారంభించిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ పథకాన్ని మరో నెల పాటు కొనసాగించాలని నిర్ణయించింది. మే 1 నుంచి జీ రామ్‌ జీ ప్రారంభించాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీనికి సంబంధించి సోమవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఏప్రిల్‌ నెలలో 4.40 కోట్ల పనిదినాలతో లేబర్‌ బడ్జెట్‌ మంజూరు చేశారు. ఇప్పటికే కొనసాగుతున్న పనులు ముమ్మరంగా సాగుతుండడంతో శ్రామికులకు పనులు కల్పించేందుకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కేంద్రం వెసులుబాటు కల్పించిందని అధికారులు భావిస్తున్నారు. కాగా, మార్చి ఒకటో తేదీ నుంచి ఉపాధి హామీ పథకంలో శ్రామికుల హాజరును నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టిం(ఎన్‌ఎంఎంఎస్) ద్వారా నమోదు చేస్తున్నారు. ప్రతి శ్రామికుడి ఆధార్‌కార్డ్‌ను ఈకేవైసీ చేసి మొబైల్‌ యాప్‌కు లింక్‌ చేశారు. అంటే పని ప్రదేశాలకు వెళ్లిన వారికే హాజరు వేసే విధంగా టెక్నాలజీ అభివృద్ధి చేశారు. గతంలో మాదిరిగా పనులు రాని వారికి కూడా మస్టర్లు వేసే ప్రక్రియకు చెక్‌ పెట్టారు. శ్రామికులతో 90 శాతానికి పైగా ఈకేవైసీ చేయించి దేశంలో ఏపీ నంబర్‌ వన్‌గా నిలిచింది.


దీంతో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు మన రాష్ట్ర అధికారులను అభినందించారు. పారదర్శకంగా మస్టర్లు వేసేందుకు ఏపీ అధికారులు నడుం బిగించారని, అందుకే వారు దేశంలోనే ఈకేవైసీలో ముందున్నారని ప్రశంసలు కురిపించారు. ఏడేళ్ల కిందట ఏపీ గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులకు ఇదే గౌరవం దక్కిందని, గత వైసీపీ హయాంలో పోగొట్టుకున్న రాష్ట్ర ప్రతిష్ఠను తిరిగి కాపాడుకున్నట్లయిందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. జీ రామ్‌ జీ వచ్చినా ఏపీలో ఈ పథకంలో మనమే ముందుంటామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 24 , 2026 | 04:53 AM