భక్తుల సౌకర్యాల్లో రాజీ పడొద్దు
ABN , Publish Date - May 20 , 2026 | 05:57 AM
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నూతన ఆర్జిత సేవలు, వేగవంతమైన డిజిటల్ సేవలు ప్రారంభించాలని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశించారు.
ఆలయాల్లో విస్తృతంగా ఆన్‌లైన్ సేవలు
ఈవోలకు దేవదాయ కమిషనర్ ఆదేశాలు
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నూతన ఆర్జిత సేవలు, వేగవంతమైన డిజిటల్ సేవలు ప్రారంభించాలని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశించారు. భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని చెప్పారు. బుధవారం గొల్లపూడిలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో 22మంది ప్రముఖ ఆలయాల ఈవోలతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. కమిషనర్ మాట్లాడుతూ బయో గ్యాస్, పైప్డ్ గ్యాస్ ప్లాంట్లు, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్‌లను నెల రోజుల్లోగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక ఆలయంలో విజయవంతమైన విధానాన్ని మిగిలిన అన్ని ఆలయాలకూ వర్తింపజేయాలన్న సీఎం ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. భక్తులకు మరింత సులభంగా, వేగంగా సేవలు అందించేందుకు ఆలయాల్లో ఆన్‌లైన్ సేవల పరిధిని పెంచడంతో పాటు పరిస్థితులకు అనుగుణంగా నూతన ఆర్జిత సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆలయాల నుంచి సేకరించిన చెత్తను వేస్ట్ డంపింగ్ యార్డులకు పంపకుండా, జీరో వేస్ట్ డిస్పోజల్ పాలసీని అమలు చేయాలని సూచించారు. భక్తుల సంతృప్తిస్థాయిని పెంచేలా దర్శన ఏర్పాట్లు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు, ప్రసాదం రుచి పెంచే విషయంలో శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.