Share News

పెట్టుబడుల గమ్యంఏపీ

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:11 AM

ఆంధ్రప్రదేశ్‌లో అవిష్కరణల కోసం స్థానికంగా క్యాపిటల్‌ను సమీకరించి, దీర్ఘకాలిక రాబడులను ఇచ్చే ఆవిష్కరణల ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తూ విశ్వసనీయ చర్యలు తీసుకుంటున్నామని ఐటీ మంత్రి లోకేశ్‌ వెల్లడించారు.

పెట్టుబడుల గమ్యంఏపీ

  • ఆవిష్కరణలు-పరిశ్రమల మధ్య అంతరాలు లేకుండా నిర్మాణాత్మక చర్యలు

  • రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా రాష్ట్రంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహకాలు

  • పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తున్నాం.. ఇన్నోవేషన్స్‌పై దావోస్‌ సదస్సులో లోకేశ్‌

అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో అవిష్కరణల కోసం స్థానికంగా క్యాపిటల్‌ను సమీకరించి, దీర్ఘకాలిక రాబడులను ఇచ్చే ఆవిష్కరణల ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తూ విశ్వసనీయ చర్యలు తీసుకుంటున్నామని ఐటీ మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా మంగళవారం ‘పెట్టుబడులను బలోపేతం చేయడంలో మనం ఎక్కడ?’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో లోకేశ్‌ మాట్లాడారు. పెట్టుబడులను ఆకర్షించడమంటే కేవలం సంస్థలను తీసుకురావడం కాదని, అవిష్కరణలకు అవసరమైన స్థిరమైన ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడమని అన్నారు. భారత్‌లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో ఆవిష్కరణలు, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా స్టార్ట్‌పలకు ప్రోత్సాహకాలను కల్పిస్తున్నామన్నారు. విశాఖలో గూగుల్‌ క్లౌడ్‌, సిస్కో, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్సీసెస్‌ భాగస్వామ్యంతో ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలతో పాటు ఆర్‌ అండ్‌ డీపై ప్రత్యక్షంగా పెట్టుబడి పెడుతున్నామన్నారు.

పెట్టుబడిదారులకు భరోసా ఇస్తున్నాం

తమ రాష్ట్రంలోని స్థానిక ప్రతిభ ప్రపంచ సవాళ్లకు పరిష్కారం చూపుతుందని లోకేశ్‌ అభిప్రాయపడ్డారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెట్టుబడిదారులకు భరోసా ఇస్తున్నామన్నారు. 2047 నాటికి క్లీన్‌ ఎనర్జీ లక్ష్యాలను సాధించేందుకు ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీని తెచ్చామన్నారు. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి, 167 గిగావాట్ల క్లీన్‌ ఎనర్జీని సాధించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామన్నారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కోసం క్వాంటమ్‌ వ్యాలీ, దేశంలోనే మొట్టమొదటి డ్రోన్‌ సిటీ, స్పేస్‌ సిటీలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన లక్ష్యంలో ఇప్పటికే రూ.5.22 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామన్నారు.


విశాఖలో రీజనల్‌ టెక్నాలజీ ఆపరేషన్స్‌ హబ్‌

గ్లోబల్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌, డేటా సెంటర్‌ సర్వీసులలో పేరొందిన అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ఐరన్‌ మౌంటైన్‌ ప్రెసిడెంట్‌, సీఈవో విలియం మీనేతో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. స్కిల్డ్‌ వర్క్‌ఫోర్స్‌, గ్లోబల్‌ కనెక్టివిటీని మెరుగుపరచడానికి భారత్‌, ఏపీఏసీ డేటా సెంటర్లకు మద్దతుగా డేటా సెంటర్‌ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖలో రీజనల్‌ టెక్నాలజీ ఆపరేషన్స్‌ హబ్‌ నెలకొల్పాలని కోరారు. డేటా మేనేజ్‌మెంట్‌, సెక్యూర్‌ స్టోరేజీ టెక్నాలజీస్‌, నెక్స్ట్‌ జెన్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దృష్టి సారించాలన్నారు. రాబోయే మూడు నాలుగేళ్లలో క్లౌడ్‌, ఎంటర్‌ప్రైజ్‌, హైపర్‌ స్కేల్‌ విభాగాల నుంచి డిమాండ్‌ను అంచనా వేయాలన్నారు. క్వాంటమ్‌లలో ఏఐ-రెడీ మౌలిక సదుపాయాలను నిర్మించడంపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

ఓడరేవుల అభివృద్ధికి సహకరించండి

జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ (జేబీఐసీ) ఎండీ షిగెటోతో భేటీ సందర్భంగా ఏపీలో ఓడరేవుల అభివృద్ధికి సహకరించాలని లోకేశ్‌ కోరారు. ఓడరేవుల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధన భద్రత, ఇతర కేంద్రీకృత రంగాలకు నిధులు సమకూర్చడం, ఎఫ్‌డీఐలను సులభతరం చేయడంలో ఏపీకి సంస్థాగత భాగస్వామ్యం వహించాలని కోరారు. నౌకల నిర్మాణం, సెమికండక్టర్‌, ఆటోమెబైల్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఇండస్ట్రియల్‌ మాన్యుఫాక్చరింగ్‌ రంగాల్లో జపాన్‌ విదేశీ పెట్టుబడులకు మార్గదర్శనం చేయాలన్నారు. సీబీఐసీ కారిడార్‌ వెంట జపాన్‌ ఇండస్ట్రియల్‌ టౌన్‌షి్‌ప అభివృద్ధి చేయాలని కోరారు.

డేటా సెంటర్‌ పనులు వేగవంతం చేయండి

బ్రూక్‌ఫీల్డ్‌ ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రెసిడెంట్‌ కానర్‌ టెస్కీతో మంత్రి లోకేశ్‌ విడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు గిగావాట్‌ స్కేల్‌ క్లీన్‌ ఎనర్జీ పవర్‌ డేటా సెంటర్‌ ప్లాట్‌ఫాం పనులను వేగవంతం చేయాలని కోరారు. గ్రిడ్‌ స్కేల్‌ స్టోరేజీ అవసరాలకు అనుగుణంగా బ్యాటరీ స్టోరేజీ సోలార్‌ సెల్‌, మాడ్యూల్‌ తయారీ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని, కృష్ణపట్నం పోర్టు పరిసరాల్లో పారిశ్రామిక క్లస్టర్‌ సమీపాన గ్రీన్‌ మాలిక్యూల్‌/హైడ్రోజన్‌ లింక్డ్‌ పైలట్‌ ప్రాజెక్టుల ఏర్పాటును పరిశీలించాలని కోరారు. ఏపీ ఐటీ కారిడార్‌లో మిశ్రమ వినియోగానికి భారీ స్థాయిలో వాణిజ్య, ఐటీ కార్యాలయాలను అభివృద్ధి చేయాలన్నారు. ఏపీ-బ్రూక్‌ఫీల్డ్‌ సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టులకు సహకరించేందుకు నిర్మాణాత్మక యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని కోరారు. రాష్ట్రంలో 12 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రూక్‌ఫీల్డ్‌ ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రెసిడెంట్‌ కానర్‌టెస్కీ తెలిపారు. క్లీన్‌ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్‌ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని టెస్కీ వివరించారు.

Updated Date - Jan 21 , 2026 | 04:40 AM