Investment Growth: పెట్టుబడుల్లో ఏపీ టాప్
ABN , Publish Date - Jan 03 , 2026 | 05:14 AM
పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబరు...
దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో నాలుగో వంతు ఆంధ్ర రాష్ట్రానికే
బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక
ఫోర్బ్స్ ఇండియాలో కథనం
పెట్టుబడి అనుకూల విధానాల ఫలితం
అనుమతులూ శరవేగంగా ఇస్తున్నాం
రంగాలవారీగా సుస్థిర విధానాలు
మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యం
అందుకే అగ్రస్థానంలో: ప్రభుత్వం
అమరావతి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఆ రాష్ట్రానికే వెళ్లాయని.. ఇతర రాష్ట్రాలన్నిటికంటే గరిష్ఠ వాటాను సొంతం చేసుకుందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికను ఉటంకిస్తూ ఫోర్బ్స్ ఇండియా తాజాగా కథనం ప్రచురించింది. ఒడిశా 13.1 శాతం, మహారాష్ట్ర 12.8 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని తెలిపింది. జాతీయస్థాయిలో మొత్తం ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఈ మూడు రాష్ట్రాలే 51.2 శాతం దక్కించుకున్నాయని పేర్కొంది. తెలంగాణ పెట్టుబడుల వాటా 9.5 శాతంగా నమోదైంది. దేశంలో ఈ 9 నెలల కాలంలో రూ.26.60 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని.. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో వచ్చిన పెట్టుబడుల కంటే ఇది 11.5శాతం ఎక్కువని నివేదిక తెలిపింది. ఈ 26.60 లక్షల కోట్లలో అత్యధికంగా ఇంధన రంగంలో 22 శాతం పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని.. రసాయన పరిశ్రమల రంగంలో 21 శాతం, మెటల్ ఉత్పత్తులు 17 శాతం, ఐటీ ఆధారిత రంగాల్లో పది శాతం పెట్టుబడులు ఉన్నట్లు వెల్లడించింది.
కాగా.. దేశంలో పెట్టుబడులు, పారిశ్రామిక పవనాలు దక్షిణ, తూర్పు కారిడార్‌ల వైపు వీస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమని రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల పాలన ఉందని, అనుమతులు శరవేగంగా ఇస్తున్నామని.. రంగాలవారీగా విధానాలు తీసుకొచ్చామని.. పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్, ఇంధన, డిజిటల్ రంగాల్లో మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. దీనివల్లే పెట్టుబడుల్లో అగ్రస్థానంలో నిలిచామని పేర్కొంది. అంతర్జాతీయ, దేశీయ ఇన్వెస్టర్లతో నిరంతరం క్రియాశీలంగా సంప్రదింపులు జరుపుతున్నామని.. సుస్థిర పాలసీలు, అమలు చేసే కార్యశీల యంత్రాంగం తోడ్పాటుతో మాన్యుఫాక్చరింగ్, పునరుత్పాదక ఇంధనం, ఎలకా్ట్రనిక్స్, డేటా సెంటర్లు, మొబిలిటీ తదితర రంగాల్లో అధిక పెట్టుబడులకు అవగాహన కుదుర్చుకుంటున్నట్లు తెలిపింది.
పెట్టుబడుల్లో ఏపీ దూసుకుపోతోంది
‘ఎక్స్’లో లోకేశ్.. ఫోర్బ్స్ కథనాన్ని ట్యాగ్ చేసిన మంత్రి
‘ఏపీ పెట్టుబడి లక్ష్యాలను అందుకోవడం కాదు.. పెట్టుబడుల సాధనలో దూసుకుపోతోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇదే..!’ అని మంత్రి లోకేశ్ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. పెట్టుబడులను రాబట్టడంలో దేశంలోనే ఏపీ టాప్‌లో నిలిచిందంటూ ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన కథనాన్ని ట్యాగ్ చేశారు.