Kiran Babu Cherukuri: రాష్ట్రంలో జీసీసీలకు అనుకూల విధానం
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:48 AM
ప్రపంచ సామర్థ్య కేంద్రాల(జీసీసీ-గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్)కు ఏపీలో అనుకూల విధానాలు ఉన్నాయని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ జీసీసీ గ్లోబల్ ప్రాక్టీస్..
టైర్-2 నగరాల్లో కోయంబత్తూరు, విశాఖపట్నం మధ్య గట్టి పోటీ
‘ఆంధ్రజ్యోతి’తో హెచ్‌సీఎల్ జీసీసీ గ్లోబల్ ప్రాక్టీస్ లీడర్ కిరణ్‌బాబు చెరుకూరి వెల్లడి
విశాఖపట్నం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రపంచ సామర్థ్య కేంద్రాల(జీసీసీ-గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్)కు ఏపీలో అనుకూల విధానాలు ఉన్నాయని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ జీసీసీ గ్లోబల్ ప్రాక్టీస్ లీడర్, ఏపీ సలహా మండలి సభ్యుడు కిరణ్‌బాబు చెరుకూరి తెలిపారు. టైర్-2 నగరాల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, ఏపీలోని విశాఖపట్నాల మధ్య గట్టి పోటీ నెలకొందన్నారు. ఇక, ప్రపంచంలోని జీసీసీలలో 55 శాతం భారత్‌లోనే ఉన్నాయని, వాటిలో 19 లక్షల మంది పనిచేస్తున్నారని వివరించారు. విశాఖపట్నంలో శుక్రవారం మొదలైన ‘ఏపీ డిజటల్ టెక్నాలజీ’ సదస్సుకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో కిరణ్ బాబు మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో 1,800 జీసీసీలు ఉన్నాయని, వాటి ద్వారా 65 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోందన్నారు. 2030 నాటికి జీసీసీల సంఖ్య 2,500కు, వాటి టర్నోవర్ 110 బిలియన్ డాలర్లకు చేరుతుందని తెలిపారు. అదే సమయంలో ఉద్యోగుల సంఖ్య కూడా 28 లక్షలకు పెరుగుతుందన్నారు. ‘‘భారత్‌లోని టెక్నాలజీ వర్క్ ఫోర్స్(సాంకేతిక ఉద్యోగ రంగం)లో 35 శాతం ప్రస్తుతం జీసీసీలలో పనిచేస్తున్నారు. 2030 నాటికి ఇది 50 శాతానికి చేరుతుంది. అంటే సాధారణ సాఫ్ట్‌వేర్ కంపెనీలో 50 శాతం మంది ఉపాధి పొందితే, మిగిలిన 50 శాతం మందికి జీసీసీలు అవకాశాలు కల్పిస్తాయి.’’ అని వివరించారు. జీసీసీలో ఉద్యోగం పొందాలంటే ఐదారేళ్ల అనుభవంతో పాటు విస్తరిస్తున్న సాంకేతిక అంశాలైన కృత్రిమ మేధ(ఏఐ), సైబర్ భద్రత, క్వాంటం సాంకేతికత, ప్రాజెక్టు ఇంజనీరింగ్ వంటి రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు.
జీసీసీల హబ్‌గా విశాఖ!
‘‘ఆంధ్రప్రదేశ్‌లో జీసీసీల కోసం మంచి పాలసీని ప్రవేశపెట్టారు. సలహా మండలిని కూడా ఏర్పాటు చేశారు. అయితే అదొక్కటే సరిపోదు. దానిని సరిగ్గా ముందుకు నడిపించినప్పుడే కంపెనీలు ఇక్కడకు తరలి వస్తాయి.’’ అని కిరణ్‌బాబు తెలిపారు. జీసీసీలు రావాలంటే.. కాస్ట్ ఎఫెక్టివ్ ఆపరేషన్లు, నైపుణ్యాలు, సోషల్ ఎకో సిస్టమ్, కార్యాలయాలు వంటివి అవసరమని తెలిపారు. ఏపీలో విశాఖపట్నం, విజయవాడలో ఇవి కొంతవరకు ఉన్నాయన్నారు. విశాఖపట్నాన్ని జీసీసీల హబ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. జీసీసీలు స్థానిక అవసరాలకు అనుగుణంగా విస్తరిస్తాయని చెప్పారు. విశాఖలో హెచ్‌ఎ్‌సబీసీ ఫైనాన్షియల్ రంగంలో ఒక బాటను నెలకొల్పిందని కిరణ్‌బాబు వివరించారు. జీసీసీలకు అవసరమైన నైపుణ్యం ఉన్నవారు కావాలంటే.. విద్యా సంస్థ లు, పరిశ్రమలు కలిసి పనిచేయాలని కిరణ్‌బాబు సూచించారు. ప్రభుత్వం అవసరమైన నైపుణ్య శిక్షణ అందించాలన్నారు. ఇవన్నీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఐఐఎం, ఐఐఐటీ, ఎస్‌ఆర్‌ఎం, వీఐటీ, గీతం వంటి విద్యా సంస్థలు దీనికి సహకారం అందించాల్సి ఉందన్నారు.