Share News

లోకేశ్‌.. భేష్‌!

ABN , Publish Date - Feb 25 , 2026 | 03:23 AM

రాష్ట్ర విద్యా మంత్రి లోకేశ్‌ పనితీరును హైకోర్టు ధర్మాసనం ప్రశంసించింది. ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరులోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో విద్యార్థినులను...

లోకేశ్‌.. భేష్‌!

  • సమస్యలపై మంత్రి తక్షణమే స్పందిస్తున్నారు

  • ఎ.కొండూరు కేజీబీవీలో విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటనలో ఆదేశాలిచ్చారు

  • కలెక్టర్‌, జేసీ, యంత్రాంగమంతా తరలివెళ్లింది

  • కేజీబీవీల్లో శాశ్వత ప్రాతిపదికన పోస్టుల భర్తీపై కేంద్రంతో మాట్లాడుతున్నట్లు అసెంబ్లీలో చెప్పారు

  • హైకోర్టు కితాబు.. మంత్రి ఇలా పనిచేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంతో చెడ్డపేరు తెస్తున్నారేం?

  • సర్వశిక్ష పీడీ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్‌

అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యా మంత్రి లోకేశ్‌ పనితీరును హైకోర్టు ధర్మాసనం ప్రశంసించింది. ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరులోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటనపై తక్షణమే స్పందించారని గుర్తుచేసింది. ఆయన ఆదేశాలతో జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌తో పాటు జిల్లా యంత్రాంగమంతా ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థినులను ఆదుకున్నారని పేర్కొంది. ‘కేజీబీవీల్లో పనిచేస్తున్న బోధనాసిబ్బందికి జీతాలు పెంచడంతోపాటు శాశ్వత ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేయడంపై కేంద్రంతో చర్చిస్తున్నామని శాసనసభలో ఆయన ప్రకటన చేసినట్లు పత్రికల్లో చూశాం. మంత్రి ఈ విధంగా పనిచేస్తున్నప్పుడు కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వానికి, మంత్రికి ఎందుకు చెడ్డపేరు తెస్తున్నారు’ అని వ్యాఖ్యానించింది. కేజీబీవీల్లో పీజీటీల నియామకానికి సంబంధించి సింగల్‌ జడ్జి ఉత్తర్వులను అమలు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంపై సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. గత విచారణ సందర్భంగా ధర్మాసనం సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు వైఖరిని తప్పుపట్టింది. దిగువ స్థాయి అధికారిని రక్షించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయని అధికారులపై తీసుకున్న చర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. మంగళవారంనాటి విచారణలో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వేసిన అఫిడవిట్‌ను పరిశీలించింది. ‘గత విచారణలో బాధ్యులైన అధికారికి నోటీసు ఇచ్చామని చెప్పారు. అఫిడవిట్‌లో కోర్టు విచారణ తర్వాత నోటీసు జారీ చేసినట్లుగా ఉంది.


ఐఏఎస్‌ అధికారి అయిఉండి కోర్టును తప్పుదోవ పట్టిస్తారా? మీపై క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తాం. తగిన చర్యలు తీసుకునే నిమిత్తం సిబ్బంది-శిక్షణ విభాగానికి సిఫారసు చేస్తాం’ అని శ్రీనివాసరావును హెచ్చరించింది. ప్రస్తుత అఫిడవిట్‌ సంతృప్తికరంగా లేదని, తాజాగా మరోసారి దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టుదేవానంద్‌, జస్టిస్‌ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. కేజీబీవీల్లో శాశ్వత ప్రాతిపదికన పోస్టుల భర్తీపై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.


ఇదీ కేసు.. సమగ్ర శిక్ష పథకం కింద నిర్వహించే కేజీబీవీల్లో పార్ట్‌టైం పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్లు(పీజీటీలు)గా పనిచేస్తున్న తమను అర్ధాంతరంగా తొలగించడాన్ని సవాల్‌ చస్తూ 2023లో వారు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. పిటిషనర్లను ఉద్యోగాల్లో కొనసాగించాలని, ఒప్పందం ముగిసిన అనంతరం కూడా కొనసాగించే విషయాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశిస్తూ 2023 డిసెంబరు 5న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ అధికారులు 2024 జనవరిలో ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. ఈ అప్పీల్‌ విచారణ సందర్భంగా సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను అమలు చేస్తామని ఇచ్చిన హామీ పూర్తిస్థాయిలో అమలుకాకపోవడంతో సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుపై సుమోటో కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. గత విచారణ సందర్భంగా ఆయన నేరుగా ధర్మాసనం ముందు హాజరయ్యారు. ఆయన ఇచ్చిన సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. కోర్టు ఉత్తర్వులు అమలు చేయని అధికారులపై ఏమి చర్యలు తీసుకున్నారో సవివరంగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

Updated Date - Feb 25 , 2026 | 03:48 AM