టెన్త్ ఇన్విజిలేషన్‌లో ఆటోమేషన్
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:45 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్విజిలేషన్ అంశాల్లో ముఖ్యమైన మార్పులు తీసుకొస్తోంది.
సాఫ్ట్‌వేర్‌తో ఇన్విజిలేటర్ల నియామకం
మాన్యువల్ విధానానికి విద్యాశాఖ స్వస్తి
అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్విజిలేషన్ అంశాల్లో ముఖ్యమైన మార్పులు తీసుకొస్తోంది. దీనిలో భాగంగా ఇన్విజిలేటర్లను మాన్యువల్‌గా కేటాయించే విధానానికి స్వస్తి పలకనుంది. ఈ స్థానంలో ఆటోమేషన్ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గురువారం మంత్రి నారా లోకేశ్ వద్ద ఈ అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. టెన్త్ పబ్లిక్ పరీక్షలకు తొలి నుంచీ మాన్యువల్ విధానంలోనే ఇన్విజిలేటర్లను కేటాయిస్తున్నారు. డీఈవో, ఎంఈవోల విచక్షణాధికారంతో ఇన్విజిలేటర్లను పరీక్షా కేంద్రాలకు పంపుతున్నారు. అయితే, ఇక నుంచి మాన్యువల్ స్థానంలో ఆటోమేషన్ విధానం తీసుకొస్తున్నారు. దీనికిగాను సాఫ్ట్‌వేర్ కూడా రూపొందించారు. ఏ టీచర్‌ను ఎక్కడకు పంపాలనేది ఆటోమేషన్‌లో భాగంగా సాఫ్ట్‌వేరే నిర్ణయిస్తుంది. ఈ విధానంలో 8 నుంచి 10 కిలోమీటర్ల పరిధిని పెట్టనున్నారు. టీచర్ ప్రస్తుత పాఠశాల నుంచి ఆ దూరంలోని పరీక్ష కేంద్రానికే కేటాయిస్తారు. అలాగే ప్రస్తుత విధానంలో ఏదైనా ఒక సబ్జెక్టు పరీక్ష జరిగే సమయంలో ఆ సబ్జెక్టు టీచర్లకు ఇన్విజిలేషన్ డ్యూటీ వేయరు. ఇకపై గణితం, సైన్స్, సోషల్(గ్రూపు సబ్జెక్టులు) పరీక్షలు జరిగేటప్పుడు భాషా సబ్జెక్టుల టీచర్లను.. భాషా పరీక్షలు జరిగే సమయంలో గ్రూపు సబ్జెక్టుల టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమించాలని నిర్ణయించారు. అలాగే అనారోగ్య సమస్యలున్న టీచర్లకు కొన్ని మినహాయింపులుంటాయి. ఈ నిబంధనల ప్రామాణికంగానే టీచర్లకు సాఫ్ట్‌వేర్ ఇన్విజిలేటర్ బాధ్యతలు కేటాయిస్తుంది.
ఫలితంగా ఇన్విజిలేషన్ కేటాయింపు విషయంలో టీచర్లు, అధికారుల జోక్యం, నిబంధనల ఉల్లంఘనలు ఉండవని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఇక, ఇన్విజిలేషన్‌కు ప్రైవేటు టీచర్లను కూడా వినియోగించాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించింది. టెన్త్ పరీక్షల నిర్వహణకు 33వేల మంది టీచర్లు అవసరమవుతారు. ప్రైవేటు బడుల్లోనూ ప్రభుత్వ టీచర్లే ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, అభ్యసన కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు, అకడమిక్ పనులు కొనసాగుతున్నాయి. దీనివల్ల 20 శాతం మంది ప్రైవేటు టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమించాలని భావిస్తున్నారు.
టెన్త్ విద్యార్థులకు సీజనల్ హాస్టళ్లు
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 ఏర్పాటు
అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): బడులకు దీర్ఘకాలికంగా సెలవు పెట్టిన, సక్రమంగా రాని విద్యార్థుల కోసం సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. సమగ్రశిక్ష నిధులతో రాష్ట్రవ్యాప్తంగా డివిజన్ స్థాయిలో సుమారు 50 హాస్టళ్లను వచ్చే సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికిగాను క్షేత్రస్థాయిలో పాఠశాల విద్యాశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. పాఠశాలలకు సక్రమంగా రాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. సీజనల్ హాస్టళ్లలో వసతితో పాటు భోజనం సౌకర్యం కల్పిస్తారు. కొందరు టీచర్లను కేటాయించి తరగతులు నిర్వహిస్తారు. రోజూ కొన్ని సబ్జెక్టుల టీచర్లను సీజనల్ హాస్టళ్లకు నియమిస్తారు. విద్యార్థుల భద్రత కోసం వాచ్‌మెన్, నిర్వాహకులను నియమించనున్నారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా రోజూ స్లిప్ టెస్టులు నిర్వహించి, మార్కులు ‘లీప్’ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. వాటిని పరిశీలించిన ఉన్నతాధికారులు సుమారు 20వేల మంది టెస్ట్‌లు రాయడం లేదని గుర్తించారు. వారంతా దీర్ఘకాలికంగా సెలవులో ఉన్నారని తేలింది. అలాంటి వారిని తిరిగి బడులకు రప్పించే లక్ష్యంతో సీజనల్ హాస్టళ్లను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.