Share News

గ్రామకంఠ ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌

ABN , Publish Date - May 20 , 2026 | 06:08 AM

గ్రామకంఠం భూముల్లోని ఇళ్లు, నివాస స్థలాల రిజిస్ట్రేషన్‌లోని సంక్లిష్టతలను తొలగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రామకంఠ ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌

  • లింక్‌ డాక్యుమెంట్లు లేకుంటే స్వీయ ధ్రువీకరణ

  • ఉత్తర్వులు జారీ చే సిన ప్రభుత్వం

అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): గ్రామకంఠం భూముల్లోని ఇళ్లు, నివాస స్థలాల రిజిస్ట్రేషన్‌లోని సంక్లిష్టతలను తొలగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్‌ల్యాండ్‌ రికార్డు ప్రాతిపదికన, గ్రామకంఠంలోని భూముల సర్వే నంబర్లు నిషేధ జాబితాలో ఉన్నా, అందులో నివాసాలు, ఖాళీ ఇంటిస్థలాలు, వారసత్వంగా వచ్చిన భూములు ఉంటే, నిర్దిష్ట డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకొని రిజిస్ట్రేషన్‌ చేయాలని సోమవారం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే, ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అవే మార్గదర్శకాల అమలుకు మంగళవారం ఉత్తర్వులు (జీవో నం. 297) జారీ చేశారు. గ్రామకంఠంలోని నివాస స్థలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ 2015 నుంచి ఇచ్చిన జీవోలు 187, 361తోపాటు, 2023 మార్చి 31, ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఇచ్చిన సర్క్యూలర్‌ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని రిజిస్ట్రేషన్లు చేయాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖలకు దిశానిర్దేశం చేశారు. వెబ్‌ల్యాండ్‌ రికార్డు ప్రకారం ఓ ఆస్తి గ్రామకంఠం సర్వే నంబర్‌లో ఉంటే దాని సంబంధం లేకుండా, అది నిషేధ జాబితాలో ఉన్నప్పటికీ ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేయాలి. గ్రామకంఠం సర్వే నంబర్‌లో ఉన్న ఆస్తికి లింకు డాక్యుమెంట్‌ ఉంటే దాని ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేయాలి.


గ్రామకంఠం లోని నివాసిత ప్రాంతం లో ఉన్న ఆస్తికి ఎలాంటి లింకు డాక్యుమెంట్‌ లేకున్నా , ఆస్తిపన్ను రశీదును ప్రామాణికంగా తీసుకుని రిజిస్ర్టేషన్‌ చేయాలి. పట్టణ గ్రామకంఠాల పరిధిలో వారసత్వంగా వచ్చిన ఇంటి స్థలాలు ఉండి, అవి సుదీర్ఘకాలం ఖాళీగా ఉండి, వాటికి ఎలాంటి లింకు డాక్యుమెంట్స్‌, ఆస్తిపన్ను రశీదులు లేకున్నా ఆ భూమికి సంబంధించి ఖాళీస్ధలం పన్ను రశీదు, ఇతర డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకోవాలి. డాక్యుమెంట్లు లేనప్పడు.. ఆ భూమి, లేదా ఆస్తి తనకు వారసత్వంగా వచ్చిందని, అది తన పొజిషన్‌లోనే ఉందని, నిషేధ జాబితాలో లేదని సంబంధిత వ్యక్తి నుంచి స్వీయ ధ్రువీకరణ తీసుకోవాలి.

Updated Date - May 20 , 2026 | 06:09 AM