డీజిల్‌కు కటకట!
ABN , Publish Date - Apr 25 , 2026 | 04:11 AM
పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా వంట గ్యాస్ కోసం కష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఇంధన కష్టాలు కూడా మొదలయ్యాయి.
పెట్రోలు బంకుల వద్ద వాహనాల బారులు
రాష్ట్రవ్యాప్తంగా మూతబడిన పలు బంకులు
సరఫరా తగ్గించేసిన ఆయిల్ కంపెనీలు
ట్రాక్టర్లు, వరికోత యంత్రాలకు అందని డీజిల్
వ్యవసాయ, వరికోత పనులపై ప్రభావం
కర్నూలులో పెట్రోల్ కోసమూ ఎగబడిన జనం
అమరావతి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా వంట గ్యాస్ కోసం కష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఇంధన కష్టాలు కూడా మొదలయ్యాయి. పెట్రోలు, డీజిల్‌కు కొరత లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ.. రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన సరఫరాను తగ్గించడంతో బంకుల్లో డీజిల్ నిల్వలు నిండుకుంటున్నాయి. కంపెనీలు ఒక్కో బంకుకు రోజుకు 20 వేల లీటర్ల డీజిల్‌ను మాత్రమే సరఫరా చేస్తుండగా.. అదంతా గంటల్లోనే ఖాళీ అయిపోతోంది. వారం రోజులుగా రాష్ట్రంలోని చాలా బంకుల్లో ఇదే పరిస్థితి..! రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, కోనసీమ, కర్నూలు, నంద్యాల తదితర జిల్లాల్లో వారం రోజులుగా డీజిల్ తగినంత దొరకడం లేదు. ఆటోలు, వ్యాన్లు, ఇతర డీజిల్ వాహనదారులు పెద్దసంఖ్యలో బంకుల వద్ద బారులు తీరుతున్నారు. వరి ఎక్కువగా పండించే ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో రైతులు పంట కోత పనుల్లో బిజీగా ఉన్నారు. కీలక సమయంలో ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలకు డీజిల్ లభించక వ్యవసాయ పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో పొలాల్లో నిలిచిపోయిన ట్రాక్టర్లు, వరికోత యంత్రాలకు డీజిల్ కోసం వాటి యజమానులు, రైతులు.. పెద్దపెద్ద టిన్నులు, క్యాన్లు తీసుకుని బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు రొయ్యలు, చేపల పెంపకం రైతులు కూడా డీజిల్ కోసం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో బంకుల యజమానులతో గొడవకు దిగుతున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలాచోట్ల ‘నో స్టాక్’ బోర్డులు పెట్టి బంకులు మూసేస్తున్నారు.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. దీంతో ఆయిల్ కంపెనీలు డీజిల్, పెట్రోలు సరఫరాను నియంత్రించాయి. గతంలో బంకులకు క్రెడిట్‌పై పెట్రోలు, డీజిల్ సరఫరా చేసిన కంపెనీలు.. యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆ సౌకర్యాన్ని నిలిపివేశాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన బకాయిలు చెల్లించని బంకులకు కూడా సరఫరా ఆపేశాయి. వ్యాపారాలు మూసుకోవడం ఇష్టంలేక బయట అప్పులు తెచ్చి పాత బకాయిలు చెల్లించినా కూడా ఆయిల్ కంపెనీలు డిమాండ్‌కు తగ్గట్లు ఇంధన సరఫరా చేయడం లేదు. దీనివల్ల కూడా కొరత ఏర్పడుతోందని బంకుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయిల్ కంపెనీలతో చర్చలు జరిపి.. పాత బకాయిలు చెల్లించిన బంకులకు పూర్తిస్థాయిలో ఇంధన సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రంలో ఎక్కడా డీజిల్ కొరత లేదని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.
సివిల్ సప్లయిస్ కమిషనర్ చర్చలు
డీజిల్ కొరత ఏర్పడడంతో సివిల్ సప్లయిస్ కమిషనర్ కె.కన్నబాబు శుక్రవారం ఆయిల్ కంపెనీలు, పెట్రోలు బంకుల ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా డీజిల్, పెట్రోలుకు కొరత లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా పెట్రోలు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడానికి వీల్లేదన్నారు. అలాగే.. డీలర్లు తమ రిటైల్ అవుట్‌లెట్ల నుంచి ఇంధనాన్ని దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కర్నూలులో కటకట..!
కర్నూలు, నంద్యాల రూరల్, భీమవరం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు ఆందోళన రేపుతున్నాయి. దీంతో.. వాహనదారులు సైతం అవసరం ఉన్నా, లేకపోయినా.. ఫుల్ ట్యాంక్ కోసం ఎగబడుతున్నారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద క్యూలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు అన్నిచోట్లా శుక్రవారం ఉదయం నుంచే నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రతి బంకు వద్ద ఉదయం నుంచే పడిగాపులు కాస్తున్నారు. కొందరు భయంతో ముందస్తుగా చిన్న చిన్న ట్యాంకుల్లో.. పెట్రోల్, డీజిల్ నింపుకొంటున్నారు. కర్నూలు నగరంలో పలు పెట్రోల్ బంకుల యజమానులు సిండికేట్ అయినట్లు తెలుస్తోంది. పెట్రోల్ ట్యాంక్ వచ్చీ రాగానే స్టాక్ అయిపోయిందంటూ బోర్డులు పెట్టేస్తున్నారు. లీటర్ పెట్రోల్ 110 ఉండగా దానిపై అదనంగా రూ.50 నుంచి రూ.100 దాకా బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. కాగా.. బంకుల వద్ద రద్దీ ఘర్షణలకు దారి తీస్తోంది. పాణ్యం పట్టణానికి చెందిన మధు శుక్రవారం రాత్రి తన బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చాడు. ఆసమయంలో కొండజూటూరుకు చెందిన సద్దల సుజిత్ అలియాస్ బిట్టు వాహనాన్ని క్యూలో కాకుండా ముందుకు తీసుకెళ్లాడు. క్యూలో రావాలంటూ మధు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ‘నేనెవరో తెలుసా...? సూర్యనారాయణ రెడ్డి కొడుకుని..’ అంటూ సుజిత్ దురుసగా సమాధానమిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో సుజిత్ తన స్నేహితులను పిలిపించి దాడిచేశాడు. ఈ ఘటనలో మధు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో డీజిల్ కోసం వాహన యజమానులు క్యాన్‌లు తీసుకుని బంకుల వద్ద క్యూ కడుతున్నారు. వీరిని అదుపు చేసేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసలే వరి కోతల సమయం కావడంతో డీజిల్ కోసం రైతులు బంకుల వద్ద ప్రదక్షిణలు చేస్తున్నారు. కోత మిషన్‌దారులకు తాడేపల్లిగూడెంలో తహశీల్దార్ నుంచి తెచ్చిన లెటర్ చూపిస్తేనే డీజిల్ కొడుతున్నారు. పెద్ద వాహనాలకు రూ.1,000, ఆటోలకు రూ.500 మించి నింపడం లేదు.