Share News

క్లిక్‌ తప్పితే ఖాతా ఖాళీ

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:32 AM

యాండ్రాయిడ్‌ ఫోన్‌లో జాగ్రత్త లేకుండా ఏదో ఒకటి క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా హెచ్చరించారు.

క్లిక్‌ తప్పితే ఖాతా ఖాళీ

  • సోషల్‌ గ్రూపుల్లో ‘ఏపీకే’ ఫైళ్ల లింకులు వద్దు

  • డిజిటల్‌ అరెస్టు అనేది దేశ చట్టంలోనే లేదు

  • టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కు ఫోన్‌ చేయాలి

  • డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా నిర్దేశం

అమరావతి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): యాండ్రాయిడ్‌ ఫోన్‌లో జాగ్రత్త లేకుండా ఏదో ఒకటి క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా హెచ్చరించారు. ఏపీకే ఫైళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. సైబర్‌ మోసగాళ్లు ట్రెండ్‌ను అనుసరిస్తుంటారని, గ్యాస్‌ కొరతను వాడుకుని ఇప్పుడు ఆ తరహా ఆప్షన్లు పంపుతున్నారని తెలిపారు. వాటి నుంచి అప్రమత్తంగా ఉండాలంటూ శనివారం పోలీస్‌ బాస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘గ్యాస్‌ కనెక్షన్‌ రీ కేవైసీ అంటారు.. ప్రభుత్వ పథకాల కోసం అంటారు... ఏదో ఒకటి చెప్పి ఏపీకే ఫైళ్లు డౌన్‌లోడ్‌ చేయిస్తారు. వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు అడిగి ఫోన్‌ యాక్సె్‌స్‌లోకి తీసుకుంటారు. బ్యాంకు లావాదేవీలు జరిపి మొత్తం డబ్బు ఖాతాలో నుంచి లాగేస్తారు.. జాగ్రత్త’’ అంటూ అప్రమత్తం చేశారు. సోషల్‌ మీడియా ద్వారా వచ్చే ‘ఏపీకే ఫైల్స్‌’ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ధారించుకోకుండా డౌన్‌లోడ్‌ చేయవద్దని సూచించారు. ఒకసారి ఫోన్‌ ఆపరేషన్‌ సైబర్‌ నేరగాడి చేతిలోకి వెళ్లిందంటే సొమ్ము కాజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేలోపే విదేశాల్లోని క్రిప్టో ఖాతాల్లోకి డబ్బు చేరిపోతుందని వివరించారు. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ తదితర సోషల్‌ మీడియా మార్గాల్లో వచ్చే ‘ఏపీకే ఫైల్స్‌’ డౌన్‌లోడ్‌ చేయక పోవడమే ఉత్తమం అని చెప్పారు. అవి ఇన్‌స్టాల్‌ అవగానే ఎస్‌ఎంఎస్‌లు, కాల్స్‌, కాంటాక్టులు, బ్యాంక్‌ ఖాతాలు, పాస్‌వర్డ్‌లు అన్నీ అవతలి వ్యక్తులు సులభంగా లాగేస్తారన్నారు. ‘‘అవి మీకు అవసరం అనిపిస్తే నేరుగా ప్లే స్టోర్‌లో వెతికి సరిచూసుకున్నాకే నిర్ణయం తీసుకోండి. ఫోన్‌ సెట్టింగ్స్‌లో ’ఇన్‌స్టాల్‌ ఫ్రమ్‌ అన్నోన్‌ సోర్సెస్‌’ అనే ఆప్షన్‌ను డిజేబుల్‌ చేసుకోవాలి.


పొరపాటున ఎవరైనా మాల్వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే వెంటనే ఫోన్‌ రీబూట్‌ చేసుకోవాలి. రూ.50వేల ఫోన్‌ రూ.8వేలకు, 4కిలోల డ్రై ఫ్రూట్స్‌ రూ.400 అంటూ వచ్చే ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఆఫర్ల పేరుతో సైబర్‌ నేరగాళ్ల బారిన పడొద్దు. ఒకవేళ ఎవరైనా మోసపోతే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కు ఫోన్‌ చేయాలి. డిజిటల్‌ అరెస్టు పేరుతో ఎవరైనా వీడియో కాల్స్‌ చేస్తే ఎట్టి పరిస్థితులోనూ భయపడొద్దు. అటువంటిది మన దేశ చట్టంలోనే లేదు. బెదిరిస్తే బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము బదిలీ చేయవద్దు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి’’ అని డీజీపీ సూచించారు.

Updated Date - Mar 22 , 2026 | 04:32 AM