Share News

పాలన ప్రక్షాళన చేశాం!

ABN , Publish Date - Mar 15 , 2026 | 03:29 AM

గత ప్రభుత్వ హయాంలో సమస్యలు చెప్పుకోవడానికి కూడా ప్రజలు భయపడేవారని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

పాలన ప్రక్షాళన చేశాం!

  • నిబద్ధతతో పనిచేస్తాం: డిప్యూటీ సీఎం పవన్‌

  • గతంలో సమస్యలు చెప్పుకోవడానికే జనం భయపడేవారు

  • నేడు ప్రభుత్వ యంత్రాంగమే మీ వద్దకు వస్తోంది

  • ఏడాదిన్నరలో గిరిజన ప్రాంతంలో 460 కిమీ రోడ్లు వేశాం

  • కష్టపడే ప్రభుత్వానికి అండగా ఉంటే మరింత బాగా పనిచేస్తాం

  • మీరు రోడ్డుపైకి రాక ముందే వాటి పరిష్కారానికి సిద్ధం: పవన్‌

  • అల్లూరి జిల్లా మారుమూల పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవం

కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. కష్టపడే ప్రభుత్వానికి ప్రజలు అండగానిలబడితే, మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. సమస్యలు చెప్పుకోవడానికి రోడ్డుపైకి రాక ముందే వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటాం.

- ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

పాడేరు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో సమస్యలు చెప్పుకోవడానికి కూడా ప్రజలు భయపడేవారని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎమ్మెల్యే వద్దకు వెళ్తే.. మీ ఊరు ఎక్కడుందని అడిగే పరిస్థితులుండేవని.. నేడు అందుకు భిన్నంగా సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగమే ప్రజల ముందుకు వచ్చేలా పాలనను ప్రక్షాళన చేశామని తెలిపారు. ‘ఇచ్చిన మాట ప్రకారం ప్రజల కోసం నిబద్ధతతో పనిచేస్తాం. మాది పీపుల్స్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం.. మీ కష్టాలు వినడానికి, సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం..’ అని చెప్పారు. శనివారం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి పంచాయతీ నందిగరువు గ్రామాన్ని సందర్శించారు. ఆదివాసీలతో కలిసి పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొన్నారు. వారితో ‘మాటామంతీ’ నిర్వహించారు. ‘కేవలం 40 కుటుంబాలున్న నందిగరువుకు సుమారు రూ.2 కోట్ల వ్యయంతో తారురోడ్డు వేయించాం. గిరి శిఖర గ్రామాల్లో గర్భిణులు డోలీ మోతలతో పడుతున్న ఇబ్బందులను చూసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏడాదిన్నరలో 460 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టాం.


మీరు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ఏనాడైనా మీ గ్రామానికి వచ్చారా.. మీ కష్టం విన్నారా? వైసీపీ పాలనలో నిధులు మళ్లించారు. జల్‌ జీవన్‌ మిషన్‌కు విడుదలైన రూ.4 వేల కోట్లు దుర్వినియోగం చేశారు. ఈ ప్రాంతంలో కూటమి అభ్యర్థులు గెలవకపోయినా అభివృద్ధిలో ఎటువంటి వివక్షా చూపడం లేదు. ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తూ, వారి అవసరాలను తీర్చేందుకు నిబద్ధతతో కృషిచేస్తున్నాం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఇటువంటిచోట్లకు వచ్చేందుకు నాయకులు భయపడతారు. కానీ ప్రజల కోసం పనిచేసే నాకు అటువంటి భయాలు లేవు. గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా అవసరమైన అన్ని అభివృద్ధి పనులూ చేసి చూపిస్తాం’ అని హామీ ఇచ్చారు. పలువురు గిరిజనులు ‘పవన్‌ కల్యాణ్‌కు జై’ అని నినదించగా.. ఈ ప్రాంతంలో కూటమిని గెలిపించిన తర్వాత తనకు జేజేలు చెప్పాలని ఆయన కోరారు. నందిగరువులో పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటుచేస్తామని, ఓనూరు జంక్షన్‌ నుంచి కొత్తపాలెం గ్రామానికి రోడ్డు నిర్మిస్తామని, అక్కడ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరుచేస్తామని తెలిపారు. అలాగే ఓనూరు, వర్తనాపల్లి గ్రామాల్లో మ్యాజిక్‌ డ్రెయిన్లను నిర్మిస్తామని, తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా కొళాయిలు ఏర్పాటు చేస్తామన్నారు. జీవో 3 పునరుద్ధరణ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సమస్యలు రాత్రికి రాత్రే పరిష్కారం కావని, దశల వారీగా అన్నీ పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో జనసేన సీనియర్‌ నేత, రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌, పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, కమిషనర్‌ కృష్ణతేజ, ఈఎన్‌సీ బాలునాయిక్‌, జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌, జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఎం.వెంకటేశ్వరరావు, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత సంస్థ చైర్మన్‌ వంపూరు గంగులయ్య, వంట్లమామిడి సర్పంచ్‌ పి.రాంబాబు, గిరిజనులు పాల్గొన్నారు.


ఆదివాసీల మధ్య ఆవిర్భావ దినం

ఆదివాసీలతో కలిసి జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పవన్‌ అన్నారు. గిరిజన మారుమూల గ్రామం నందిగరువులో శనివారం మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆదివాసీల కష్టాలు తెలుసుకుని.. వారి సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనతోనే కేవలం 40 కుటుంబాల మధ్య పార్టీ ఆవిర్భావ దినం జరుపుకొంటున్నానన్నారు. నందిగరువుకు రోడ్డు ఎంతో చక్కగా వేశారని, మొదట ఫొటో చూసి.. ఏఐ ఏమోనని అనుమానం కలిగిందని.. అధికారులతో మాట్లాడి అది మనం వేసిన రోడ్డని నిర్ధారించుకున్నానని చెప్పారు.

జనసేనానికి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం

అమరావతి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్తు కోసం పనిచేస్తున్న జన సైనికులకు, వీర మహిళలకు, నేతలకు శుభాభినందనలు తెలిపారు. మంత్రి లోకేశ్‌ ఎక్స్‌లో స్పందిస్తూ... ‘జనసేన ఏడు సిద్ధాంతాలతో ప్రజాజీవితాల్లో భాగం కావడం చాలా సంతోషం. ఈ శుభసందర్భంలో జనసేనాని పవనన్నకు, నేతలు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు’ అని పేర్కొన్నారు.

ఓనూరు జంక్షన్‌ నుంచి కాలినడకన నందిగరువుకు..

ఏజెన్సీ పర్యటనకు విచ్చేసిన డిప్యూటీ సీఎం.. ఇటీవల ప్రధానమంత్రి రోజ్‌గార్‌ యోజన నిధులతో పాడేరు మండలం ఓనూరు జంక్షన్‌ నుంచి నందిగరువు గ్రామానికి నిర్మించిన తారురోడ్డును పరిశీలిస్తూ 2.4 కిలోమీటర్లు కాలినడకన నందిగరువు చేరుకున్నారు. గిరిజన మహిళలు ఆయనకు సంప్రదాయంగా గులాబీలు అందించి బొట్టుపెట్టి ఘన స్వాగతం పలికారు.

Updated Date - Mar 15 , 2026 | 03:30 AM