Share News

సైబర్‌ మోసగాళ్లకు చెక్‌

ABN , Publish Date - May 24 , 2026 | 04:24 AM

సైబర్‌ నేరాలు, డిజిటల్‌ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఏడాది కాలంలో ప్రజల నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.667 కోట్లు కాజేయడం పట్ల...

సైబర్‌ మోసగాళ్లకు చెక్‌

  • 500 మంది సైబర్‌ గార్డ్‌లు సిద్ధం

  • ఆన్‌లైన్‌ నేరగాళ్ల ఆటకట్టు.. ఐటీ శాఖ, బ్యాంకర్లతో సమన్వయం

  • సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆరు కీలక చర్యలు ప్రకటించిన డీజీపీ

  • విశాఖ, విజయవాడ, తిరుపతిలో ప్రత్యేక సైబర్‌ వార్‌రూమ్‌లు

  • ఏఐ ఆధారిత పర్యవేక్షణ, ప్రజలకు విస్తృత అవగాహనతో మోసాల కట్టడి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సైబర్‌ నేరాలు, డిజిటల్‌ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఏడాది కాలంలో ప్రజల నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.667 కోట్లు కాజేయడం పట్ల సీఎం చంద్రబాబు కూడా ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో శాంతి భద్రతలపై సమీక్ష సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సైబర్‌ మోసాలు, సోషల్‌ మీడియా దుర్వినియోగాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనే అంశంపై డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా గత వారం విజయవాడ, విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్లతో పాటు జిల్లాల ఎస్పీలతో సమీక్షించారు. సమావేశం అనంతరం ఆరు కీలక చర్యలతో ప్రత్యేక ప్రణాళికను ప్రకటించారు. అందులో భాగంగా ఆన్‌లైన్‌ మోసాల కట్టడికి పోలీసుశాఖ 500 మంది ‘సైబర్‌ గార్డు’లతో కొత్త సైన్యాన్ని సిద్ధం చేసింది. పెట్టుబడి మోసాలు, డిజిటల్‌ అరెస్టు అంటూ బెదిరింపులు, కేవైసీ అప్‌డేట్లు, అనామక ఖాతాలతో దోచుకొంటున్న సైబర్‌ నేరగాళ్ల పనిపట్టేందుకు నడుం బిగించింది. సైబర్‌ గార్డుల సాయంతో వ్యవస్థీకృత, సరిహద్దు బయటి ముఠాల భరతం పట్టనుంది. పోలీసు శాఖలో సైబర్‌ నేరాలపై అవగాహన ఉన్న సిబ్బందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి, వారందరికీ తగిన శిక్షణ అందించి, ప్రజల సొమ్ము సైబర్‌ మోసగాళ్ల పాలు కాకుండా అడ్డుకోబోతోంది. సైబర్‌ చోరుల్ని గుర్తించేందుకు ఐటీ శాఖ సహకారం తీసుకోనుంది. ‘మ్యూల్‌’ ఖాతాలను స్తంభింపజేసేందుకు బ్యాంకర్లతో సమన్వయం చేసుకోనుంది.


సైబర్‌ నేరాలకు చెక్‌ ఇలా..

మోసపూరిత సైబర్‌ సిండికేట్లు ఉపయోగించే నకిలీ బ్యాంకు ఖాతాలను ముందుగానే గుర్తించి నిరోధించేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ), రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇన్నోవేషన్‌ హబ్‌(ఆర్‌బీఐహెచ్‌)లతో పోలీసుశాఖ ఒప్పందం చేసుకుంది. మ్యూల్‌ ఈ-హంటర్‌ వంటి ఏఐ ఆధారిత సాధనాలను ఐ4సీ సస్పెక్ట్‌ రిజిస్ట్రీతో అనుసంధానించి, సైబర్‌ మోసాలకు చెక్‌ పెట్టనుంది. ఇక్కడి ఐటీ శాఖతో సమాచారాన్ని పంచుకొంటూ, బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటారు. వివిధ సైబర్‌ మోసాలపై సోషల్‌ మీడియా ద్వారా నిరంతరం ప్రజల్ని అప్రమత్తం చేసి, మోసాల బారిన పడకుండా అడ్డుకుంటారు. గోల్డెన్‌ అవర్‌, టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1930పై విస్తృత ప్రచారం చేస్తారు. అదేవిధంగా బ్యాంకు ఖాతాలపై ‘లియోన్‌ మార్కింగ్‌’ చేపట్టే విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. మోసగాళ్లు డబ్బును ఇతర డిజిటల్‌ ఖాతాల్లోకి మళ్లించకముందే మ్యూల్‌ ఖాతాల్లోనే బ్రేకులేస్తారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ప్రత్యేక సైబర్‌ యూనిట్లు ఏర్పాటు చేసి, అధునాతన సాధనాలతో సైబర్‌ మోసాలపై నిఘా పెట్టి, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలోని సీసీఎస్‌, శాంతి భద్రతల పోలీసుస్టేషన్ల పనితీరులో సైబర్‌ నేరాల్ని అనుసంధానించి.. ప్రతి జిల్లాలోనూ సైబర్‌ మోసాలు, సోషల్‌ మీడియాలో దూషణల కట్టడిలో వారిని కీలక భాగస్వాముల్ని చేస్తారు.


ప్రధానంగా జరిగే మోసాలు..

సైబర్‌ నేరగాళ్లు ప్రధానంగా పది రకాల మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకు ఖాతా బ్లాక్‌ అయిపోతుందంటూ కేవైసీ కోసం ఎస్‌ఎంఎ్‌సలు, మెయిల్స్‌ ద్వారా నకిలీ లింకులు పంపి గత ఏడాది కాలంలో 8,331 మందిని బురిడీ కొట్టించారు. నకిలీ ట్రేడింగ్‌ యాప్‌లు సృష్టించి, వాటిలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ స్టాక్‌ టిప్స్‌, ఇన్‌సైడర్‌ సమాచారం పేరుతో నకిలీ క్రిప్టో కరెన్సీ లింకులు పంపి.. 6,298 మందిని మోసగించారు. క్రెడిట్‌ కార్డు మోసాలు, ఆన్‌లైన్‌ రుణాలు, ఉద్యోగాలు ఇస్తామంటూ వంచిస్తారు. ఈమోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా సూచిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో విషం చిమ్మితే ఊచలే..

సోషల్‌ మీడియా ఖాతాలు, ట్రోల్‌ గ్రూపులు, సంఘటిత డిజిటల్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఫేక్‌ ప్రచారాలు అధికంగా జరుగుతున్న తీరుపై డీజీపీ, పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు ఇటీవల సమీక్షిస్తున్నారు. సోషల్‌ మీడియాలో దూషణలు, తప్పుడు ప్రచారాలు, మార్ఫింగ్‌, బెదిరింపులు, ఉద్రిక్తతలకు దారితీసే ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలను డీజీపీ ఆదేశించారు.

సైబర్‌ మోసాల కట్టడికి కీలక చర్యలు

  • రాష్ట్రంలో 24 గంటలూ పనిచేసే సైబర్‌ వార్‌రూమ్‌లు

  • 1930 హెల్ప్‌లైన్‌ను బ్యాంకులతో అనుసంధానం.

  • ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలు పెంచడం

  • తొలి దశలో 500 మంది ‘సైబర్‌ గార్డు’ల నియామకం

  • జిల్లా స్థాయు నుంచి మూడంచెల సైబర్‌ వ్యవస్థ

  • సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు

Updated Date - May 24 , 2026 | 04:24 AM