బస్సుల కోసం బెంగళూరు!
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:24 AM
ఆర్టీసీ బస్సు సర్వీసుల కోసం చేస్తున్న ప్రజా ఉద్యమానికి సామాజిక మాధ్యమాలు వేదికగా నిలిచాయి. రాష్ట్రంలోని పలు ముఖ్యమైన ప్రాంతాల నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు బస్సులు నడపాలంటూ...
‘ప్రజా ప్రయోజనం’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో పోరాటం
ఆర్టీసీ సర్వీసులు పెంచాలంటూ డిమాండ్
ప్రైవేటులో ప్రయాణాలపై ప్రయాణికుల్లో గుబులు
సరిహద్దుల్లో సమస్య మరింత తీవ్రం
(విజయవాడ - ఆంధ్రజ్యోతి)
ఆర్టీసీ బస్సు సర్వీసుల కోసం చేస్తున్న ప్రజా ఉద్యమానికి సామాజిక మాధ్యమాలు వేదికగా నిలిచాయి. రాష్ట్రంలోని పలు ముఖ్యమైన ప్రాంతాల నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు బస్సులు నడపాలంటూ చేస్తున్న డిమాండ్ ఊపందుకుంటోంది. ‘ప్రజా ప్రయోజనం’ పేరుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టా వేదికగా ఈ ఉద్యమం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పాకింది. గతంలో ఆంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరుకు 25 సర్వీసుల వరకు నడిచేవి. ప్రస్తుతం ఆ సంఖ్య తొమ్మిదికి పడిపోయింది. వీటిలో ఎనిమిది విజయవాడ నుంచి కాగా, ఒకటి కాకినాడ నుంచి నడుస్తోంది. ఆర్టీసీ సర్వీసులు తగ్గపోవడాన్ని, తగినన్ని రైళ్లు లేకపోవడాన్ని ప్రైవేటు ఆపరేటర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. సుమారు 40 బస్సులు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రల నుంచి నడుస్తున్నాయంటూ డిమాండ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కేఎస్ ఆర్టీసీ, ఆపీస్ర్టీసీ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగినప్పటికీ బస్సుల సంఖ్య పెరగకపోవడాన్ని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. అందబాటులో ప్రైవేటు బస్సులు ఉన్నా... ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ప్రమాద ఘటనలు పలువురిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సర్వీసుల కోసం, కొత్త రైళ్ల కోసం డిమాండ్ పెరిగింది.
సరిహద్దు జనాల కష్టం వర్ణనాతీతం
కర్ణాటక నుంచి ఏపీ సరిహద్దు జిల్లాలకు కేఎ్‌సఆర్‌టీసీ బస్సులు చాలా తక్కువ. మదనపల్లె నుంచి చింతామణి, బెంగళూరు-కడప, చింతామణి-బెంగళూరు-తిరుపతి, తిరుపతి నుంచి పైలర్ మదనపల్లె, చింతామణి, యలహంక, బెంగళూరు రూట్లలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల సంఖ్య తక్కువగానే ఉంది. ఈ మార్గంలో ప్రయాణీకుల డిమాండ్ ఎక్కువ. దీంతో ప్రైవేటు బస్సులదే రాజ్యం. కడప-మదనపల్లె-బెంగళూరు రూటుతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్లే బస్సుల్లో ఇసుక వేస్తే రాలనంతగా జనాన్ని కుక్కేస్తారు. పై రూట్లలో ఏపీఎస్ ఆర్టీసీ ప్రతి అర్ధగంటకు బస్సు నడపాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ రూట్లలో బస్సులు నడిపితే ఆర్టీసీకి మంచి ఆదాయం వస్తుందని చెబుతున్నారు.