Share News

నక్సల్స్‌ శకం ముగిసింది!

ABN , Publish Date - Mar 31 , 2026 | 04:41 AM

ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్స్‌ శకం ముగిసిందని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ప్రకటించారు. దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలని కేంద్రం నిర్దేశించుకున్న(మార్చి 31) లక్ష్యానికి ఒక రోజు ముందే రాష్ట్రం ఆ లక్ష్యాన్ని చేరుకుందన్నారు

నక్సల్స్‌ శకం ముగిసింది!

  • గడువుకు ఒక రోజు ముందే మావోయిస్టు రహితంగా ఏపీ: డీజీపీ

  • లొంగిపోయిన నారాయణరావు

  • మరో 8 మంది మావోయిస్టులు కూడా

  • వారి నుంచి 19 ఆయుధాలు స్వాధీనం

  • రివార్డులు, పునరావాసం కల్పిస్తాం: డీజీపీ

  • ‘కగార్‌’ను అంచనా వేయలేకపోయాం

  • కాలానికి అనుగుణంగా పార్టీ మారలేదు

  • ప్రజల ఆలోచనా విధానం మాత్రం మారింది

  • అందుకే మావోయిస్టు పార్టీ పతనం: చెల్లూరి

అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్స్‌ శకం ముగిసిందని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ప్రకటించారు. దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలని కేంద్రం నిర్దేశించుకున్న(మార్చి 31) లక్ష్యానికి ఒక రోజు ముందే రాష్ట్రం ఆ లక్ష్యాన్ని చేరుకుందన్నారు. ఈ క్రమంలో పలు ఎన్‌కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్లు వంటివి జరిగాయని వివరించారు. రాష్ట్రం ఈ ఘనత సాధించడం వెనుక ఎందరో పోలీసు అధికారులు, ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌ బలగాల శ్రమ ఉందని పేర్కొన్నారు. వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. కొండపల్లి సీతారామయ్య నుంచి నంబాల కేశవరావు వరకు మావోయిస్టు పార్టీని ఏపీ నాయకత్వం నడిపించింది. ‘ఆపరేషన్‌ కగార్‌’లో భాగంగా గత ఏడాది జరిగిన ఎదురుకాల్పుల్లో నంబాల కేశవరావు దండకారణ్యంలో మరణించారు. ఇదే సమయంలో ఏవోబీలో గాజర్ల రవి, అరుణల ఎన్‌కౌంటర్‌తో ఏపీకి చెందిన నాయకత్వ సంఖ్య తగ్గింది. పార్టీ నాయకత్వంలో మిగిలిన ఏకైక వ్యక్తి చెల్లూరు నారాయణరావు(శ్రీకాకుళం) సోమవారం డీజీపీ ముందు లొంగిపోయారు.


ఆయనతో పాటు మరో 8 మంది మావోయిస్టుల కూడా ఆయుధాలతో లొంగిపోయారు. ఈ సందర్భంగా విజయవాడలోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌లో శాంతి భద్రతల ఏడీజీ మధుసూధన్‌ రెడ్డి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మహేశ్‌ చంద్ర లడ్డా, ఎస్‌ఐబీ చీఫ్‌ పీహెచ్‌డీ రామకృష్ణలతో కలిసి డీజీపీ మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య సున్నాకు చేరుకుంది. ఆయుధాలు వదిలేసి జనజీవనంలో కలవాలన్న మా పిలుపునకు స్పందన వచ్చింది. మూడున్నర దశాబ్దాలుగా అజ్ఞాతంలో పనిచేసిన కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు అలియస్‌ సురేశ్‌ మరో ఎనిమిది మందితో కలిసి ఆయుధాలతో లొంగిపోయారు. ఏపీ నుంచి మావోయిస్టు పార్టీలో మిగిలిన చివరి వ్యక్తి ఈయనే. ఈ రోజు నుంచి నక్సల్స్‌ రహిత రాష్ట్రంగా ఏపీని ప్రకటిస్తున్నాం’’ అని అన్నారు.


పథకాల అమలు

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని డీజీపీ తెలిపారు. వారిపై ఉన్న రివార్డు మొత్తాన్ని అందిస్తామన్నారు. తాత్కాలికంగా ప్రతి ఒక్కరికీ రూ.20 వేల చొప్పున నగదు అందజేశారు. ఏడాదిన్నర కాలంలో ఏపీ పోలీసులు వామపక్ష తీవ్రవాదంపై పలు విజయాలు సాధించారని, ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యులు మాడ్వి హిడ్మా, గాజర్ల రవి, టెక్‌ శంకర్‌, స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యులు అరుణ, జగన్‌, మడకం రాజే సహా 18 మంది పోలీసుకాల్పుల్లో మృతి చెందినట్టు వివరించారు. మన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత ఏడాది నవంబరులో 50 మంది వివిధ కేడర్‌ మావోయిస్టులను అరెస్టు చేసి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ తెలిపారు. ఏడాదిన్నర కాలంలో మృతి చెందిన, అరెస్టయిన, లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య 205 మంది వరకు ఉంటుందన్నారు. 120కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. చెల్లూరితోపాటు లొంగిపోయిన మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఇన్సాస్‌, బీజీఎల్‌, రైఫిళ్ల సహా 19 ఆయుధాలు ఈ సందర్భంగా మీడియా ముందు ప్రదర్శించారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో హింసాత్మక కార్యకలాపాలు సాగించిన మావోయిస్టు పార్టీ శకం ఏపీలో పూర్తిగా ముగిసిందని గుప్తా ప్రకటించారు.


పతనం అందుకే: చెల్లూరి

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైనందువల్లే మావోయిస్టు పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని లొంగిపోయిన మావోయిస్టు నేత చెల్లూరి నారాయణరావు అన్నారు. పార్టీ దెబ్బ తినడానికి కేశవ్‌, హిడ్మా ఎన్‌కౌంటర్లు మాత్రమే కారణం కాదని.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవడం, పార్టీలో నియామకాలు లేకపోవడం, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయి వరకు అందడం, కగార్‌ నిర్బంధాన్ని అంచనా వేయలేక పోవడం వంటివి ఉన్నాయన్నారు. వీటన్నింటికీ మించి పరిస్థితులకు అనుగుణంగా పార్టీ మారకపోవడం పతనానికి కారణమని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనకు శత్రువులు ఎవరూ లేరని, తాను పాల్గొన్న హింసాత్మక ఘటనల వెనుక పార్టీ ఆదేశాలే ఉన్నాయని చెప్పారు. సాయుధ పోరాటంలో హత్యలు చేయడం పొరపాటేనని, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఆయుధాన్ని వదిలేశానని, ఇకపై కుటుంబంతో గడుపుతానని ప్రకటించారు.

లొంగిపోయిన మావోయిస్టులు వీరే..

కర్తం లచ్చు(డీసీఎం), పొడియం రాజే(ఏసీఎం), కర్తం అడమే(ఏసీఎం), ముచ్చిక మాస(ఏసీఎం), మడవి జోగి(ఏసీఎం), ముచ్చిక లక్ష్మణ్‌(పార్టీ మెంబర్‌), మడవి అడమ(పార్టీ సభ్యుడు), కడితి హుర్రే(పార్టీ సభ్యుడు).

Updated Date - Mar 31 , 2026 | 04:42 AM