Share News

ఏడాదిలో 652 కోట్లు దోచేశారు

ABN , Publish Date - May 14 , 2026 | 05:30 AM

పోలీసులు, బ్యాంకర్లు సమన్వయం చేసుకుని సైబర్‌ నేరాల కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.

ఏడాదిలో 652 కోట్లు దోచేశారు

  • ‘సైబర్‌’ వలలో 41వేల మంది

  • సమన్వయంతో సైబర్‌ మోసాలకు చెక్‌ చేప్పాలన్న సీఎం

  • పోలీసుల చర్యలతో రూ.116 కోట్లు ఆపగలిగాం: డీజీపీ

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): పోలీసులు, బ్యాంకర్లు సమన్వయం చేసుకుని సైబర్‌ నేరాల కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. సైబర్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే... గోల్డెన్‌ అవర్‌లో స్పందిస్తే బాధితుల నష్టాన్ని బాగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్‌, ఆర్థిక మోసాల కట్టడిపై పోలీసు శాఖ ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో బుధవారం ఆయన సమీక్షించారు. గత ఆర్థిక సంవత్సరంలో సైబర్‌ నేరగాళ్లు పది రకాల మోసాలతో రాష్ట్రంలో 41,755 మంది నుంచి రూ.652 కోట్లు కొల్లగొట్టారని పోలీసులు వెల్లడించారు. 2025 ఏప్రిల్‌ నుంచి 2026 మార్చి మధ్యలో 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు 9.29 లక్షల కాల్స్‌ రాగా 69,379 ఫిర్యాదులు నమోదైనట్లు వివరించారు. బాధితుల నుంచి మోసగాళ్లు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి సొమ్ము కొల్లగొడుతున్నారని, వాటిని క్షణాల్లోనే మ్యూల్‌ ఖాతాలకు మళ్లిస్తున్నారని డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తా తెలిపారు. ఆ తర్వాత క్రిప్టో కరెన్సీలు, షెల్‌ కంపెనీల ద్వారా నిధులు విదేశాలకు తరలించి ఆనవాళ్లు లేకుండా చేసి మాయమవుతున్నారని చెప్పారు. ఏపీ సీఐడీలోని సైబర్‌ క్రైమ్‌ విభాగం, బ్యాంకర్లు సకాలంలో స్పందించి రూ.116 కోట్లను సైబర్‌ మోసగాళ్లు తమ ఖాతాలకు మళ్లించుకోకుండా ఆపగలిగామని డీజీపీ వివరించారు. రాష్ట్ర స్థాయిలో నిరంతరం పనిచేసేందకు 200 మంది సైబర్‌ పోలీసులతో పాటు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ప్రత్యేక సైబర్‌ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గతేడాదితో పోల్చితే సైబర్‌ నేరాలు, ఆర్థిక మోసాలను 9.6 శాతం తగ్గించినట్లు వివరించారు. సీఎం స్పందిస్తూ... సైబర్‌, ఆర్థిక నేరాల నియంత్రణకు పోలీసులు, బ్యాంకర్లు ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఇతరుల ఖాతాలు దుర్వినియోగం కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. గోల్డెన్‌ అవర్‌లో ఇతర రాష్ట్రాల స్పందన ఎలా ఉందో తెలుసుకుని... వాటిలో ఉత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. ఏపీ సైబర్‌ పాలసీపైనా అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి... సైబర్‌, ఆర్థిక నేరాల నుంచి ప్రజల్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - May 14 , 2026 | 05:30 AM