పంటకాలంపై తెలంగాణ వితండం!
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:51 AM
కృష్ణా డెల్టా నీటి అవసరాలపై తెలంగాణ అడ్డగోలు వాదనలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఆక్షేపించింది. డెల్టా పరిధిలో వరి పంట కాలంపై వితండవాదం చేస్తోందని పేర్కొంది.
కృష్ణా డెల్టాలో వరికి 190 రోజులు కావాలి: ఏపీ
ట్రైబ్యునల్ 152 రోజులు చాలంటే సరేనన్నాం
ఇప్పుడు ఆరుతడి పంటలు చాలంటోంది
బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్ర న్యాయవాదుల సమర్థ వాదనలు
అమరావతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా డెల్టా నీటి అవసరాలపై తెలంగాణ అడ్డగోలు వాదనలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఆక్షేపించింది. డెల్టా పరిధిలో వరి పంట కాలంపై వితండవాదం చేస్తోందని పేర్కొంది. ఆరు తడి పంటలే వేయాలని సలహా ఇవ్వడాన్ని తప్పుబట్టింది. రెండు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి సోమవారం ఢిల్లీలో బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా, సీనియర్ కౌన్సిల్ సభ్యుడు జి.ఉమాపతి, అడ్వకేట్ శరత్ చంద్ర బలమైన వాదనలు వినిపించారు. వాస్తవానికి తమ ప్రాంతంలో వరి పండించేందుకు 180 నుంచి 190 రోజులు నీరు కావాలని.. కానీ 152 రోజులు సరిపోతుందని కృష్ణా ట్రైబ్యునల్ పేర్కొనడంతో దానికి అంగీకరించామని పేర్కొన్నారు. ‘ఖరీఫ్ కాలంలో కృష్ణా డెల్టాలో వరిఽని ప్రధానంగా పండిస్తారు. వరి వంగడాన్ని బట్టి 140 రోజుల్లోనే పంట చేతికి వచ్చే అవకాశాలున్నాయంటూ తమ పంచాంగం చెబుతోందని తెలంగాణ వాదించడం సరికాదు. పంటకాలం విషయంలో ఆ రాష్ట్రానికి అవగాహన లేదు. తెలంగాణ చెబుతున్న 368 రకం వరి వంగడం కృష్ణా డెల్టాలో వేసేందుకు అనువు కాదు. 376 వంగడాన్ని కూడా పట్టించుకోనవసరం లేదు. ఆ రాష్ట్రం చేసిన పరిశోధనల్లోనే ఈ రెండు వంగడాలపై ఏకాభిప్రాయం రాలేదు. 2014లో ఆ రాష్ట్రం విడుదల చేసిన ప్రకటనలో 291 వంగడాన్ని వేస్తే పంట చేతికి వచ్చేసరికి 152 రోజులు పడుతుందని వెల్లడించింది. ఇప్పుడు బ్రజేశ్ ట్రైబ్యునల్ ఎదుట 140 రోజులు చాలని వితండవాదం చేస్తోంది’ అని తెలిపారు.
తమ వాదనను బలపరిచేలా 5 సాక్ష్యాధారాలను ఏపీ న్యాయవాదులు ట్రైబ్యునల్ ముం దుంచారు. కృష్ణా డెల్టాపై సోమవారం బలమైన వాదనలు వినిపించిన ఏపీ.. మంగళవారం కేసీ కెనాల్ పరిధిలో నీటి అవసరాలపై వాదనలు వినిపించనుంది. కాగా.. కృష్ణా జలాలపై తెలంగాణ పిటిషన్ సుప్రీంకోర్టులో బుధవారం విచారణకు రానుంది. దీంతో కృష్ణా జలాలపై తమ తదుపరి వాదనలు గురువారం వినిపిస్తామనిఏపీ కోరనుంది.