భలే చాన్సులే!
ABN , Publish Date - Mar 25 , 2026 | 03:51 AM
‘ఎమ్మెల్యే సార్’ అని పిలిపించుకోవాలని తహతహలాడుతున్న వారు... అసెంబ్లీలో లేచి నిలబడి ‘అధ్యక్షా’... అని పిలవాలని ఆరాటపడుతున్న వారు... ఎన్నాళ్లుగానో, ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన తెరపైకి వచ్చేసింది.
రాష్ట్రంలో ‘నియోజకవర్గాల పెంపు’ సందడి
నియోజకవర్గాల పునర్విభజనతో కొత్తగా ఏ స్థానాలు ఏర్పడతాయి, ఏయే స్థానాలు మహిళలకు రిజర్వు అవుతాయి... అనే అంశంపై స్పష్టత రావాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. అయితే... దీనిపై రాజకీయ నేతల్లో ఇప్పటి నుంచే జోరుగా చర్చలు మొదలయ్యాయి.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘ఎమ్మెల్యే సార్’ అని పిలిపించుకోవాలని తహతహలాడుతున్న వారు... అసెంబ్లీలో లేచి నిలబడి ‘అధ్యక్షా’... అని పిలవాలని ఆరాటపడుతున్న వారు... ఎన్నాళ్లుగానో, ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన తెరపైకి వచ్చేసింది. ఏకంగా 50 శాతం సీట్లు పెంచేస్తారన్న వార్త ఎందరో ఆశావహులకు వీనుల విందుగా మారింది. దశాబ్దాలుగా నినాదంగానే ఉన్న ‘చట్ట సభల్లో మహిళలకు కోటా’ కూడా సాకారం కానుందని కేంద్రం సంకేతాలు పంపిస్తోంది. ‘ఎప్పటికోగానీ కాదు’ అనుకుంటున్న నియోజకవర్గాల పెంపు... 2029 ఎన్నికల నుంచే అమలులోకి వస్తుందనే సంకేతాలతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. నియోజకవర్గాల పునర్ విభజన, మహిళా రిజర్వేషన్ విధి విధానాలపై స్పష్టత వచ్చేందుకు మరింత సమయం పడుతుంది. అయినప్పటికీ... ఒకవైపు ఆశావహులు సంబరాలు చేసుకుంటుండగా, మరోవైపు ‘మహిళా కోటా’తో సీనియర్లలో కలవరం మొదలైంది. తమ నియోజకవర్గాలు మహిళలకు కేటాయిస్తే పరిస్థితి ఏంటనేదే వారి దిగులు, గుబులు!
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26(1) ప్రకారం సీమాంధ్రలోని 175 అసెంబ్లీ సీట్లను 225కు పెంచాలి. తెలంగాణలోని 119 నియోజకవర్గాలను 153కి పెంచుకునే వెసులుబాటు ఉంది. ఈ హామీ అమలు కోసం రాష్ట్రం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పన్నెండేళ్లుగా కేంద్రం పట్టించుకోలేదు. 2021లో జరగాల్సిన జన గణన, కరోనా కారణంగా వాయిదా పడుతూ రావడంతో పునర్విభజన అంశం కూడా సా...గుతూ వచ్చింది. ఒకానొక దశలో 2026-27 జనగణన ప్రక్రియ తర్వాతే పునర్విభజన ఉంటుందని కేంద్రం కూడా స్పష్టం చేసింది. ఆ లెక్కలు తేలే సరికి 2029 ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. వెరసి... 2034 ఎన్నికల్లోనే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తాయని అంతా భావించారు. అయితే... అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం పునర్విభజన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. 2011 జనాభా లెక్కల ఆధారంగానే ముందుకెళ్లాలని కేంద్ర భావిస్తోంది. అందులోనూ ఏకంగా 50శాతం సీట్లు పెంచాలని యోచిస్తోంది. డీలిమిటేషన్ చట్టంతోపాటు మహిళా రిజర్వేషన్ చట్టానికీ సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లులు తీసుకువచ్చేందుకు కసరత్తు కూడా ప్రారంభించింది.
ఎట్టకేలకు మహిళా కోటాతో...
చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తూ 2023లోనే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందింది. తొలుత దీనిని 2034 ఎన్నికల నుంచి అమలు చేయాలని భావించారు. అయితే... నియోజకవర్గాల పునర్విభజనతోపాటు మహిళా రిజర్వేషన్‌ను కూడా 2029 ఎన్నికల నుంచే అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. అదే జరిగితే... ‘చట్ట సభల్లో మహిళలకూ రిజర్వేషన్లు’ అనే దశాబ్దాలనాటి నినాదం వాస్తవ రూపం దాల్చినట్లవుతుంది. మహిళా సాధికారతలో ఇది మరో మెట్టు. సరిగ్గా ఇక్కడే... అందులోనూ ఇప్పటికే తమ నియోజకవర్గాలపై పట్టుసాధించిన పురుష సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీల్లో గుబులు మొదలైంది. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందన్న ఆనందం ఒకవైపు... 33 శాతం మహిళలకు వెళ్లిపోతాయన్న ఆందోళన మరోవైపు! నియోజకవర్గాల పునర్విభజన అమలులోకి వస్తే... మొత్తం 263 అసెంబ్లీ స్థానాలకుగాను 87 మహిళలకు దక్కుతాయి. 38 ఎంపీ స్థానాల్లో 13 వారికే. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో 33 శాతం, ఓపెన్ క్యాటగిరీలో 33 శాతం సీట్లు మహిళలకు దక్కుతాయి.
ఈ స్థానాల్లో మహిళలదే పైచేయి..
స్థానిక సంస్థల్లో అనుసరిస్తున్న విధానాన్నే మహిళా కోటాకూ పాటిస్తారనుకుంటే... చాలా మంది ముఖ్యనేతల సీట్లు గల్లంతు కావడం ఖాయం. ఇప్పుడున్న 175 అసెంబ్లీ స్థానాల్లో 58 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే 25 ఎంపీ స్థానాల్లో సుమారు 10 స్థానాల్లో మహిళా ఓటర్లదే ఆధిపత్యం. మహిళా ఓటర్లలో భీమిలి నియోజకవర్గం టాప్‌లో ఉంది. ఇక్కడ 1.78 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషుల ఓటర్ల కన్నా వీరి సంఖ్య 10వేలు అధికం. ఇంకా... గుంతకల్లు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పలమనేరు, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం నార్త్, పెందుర్తి, గురజాల, మాచర్ల, వినుకొండ, భీమవరం, రాయదుర్గం, మదనపల్లె, పోలవరం (ఎస్టీ), రంపచోడవరం(ఎస్టీ), కావలి, జమ్మలమడుగు, కొత్తపేట, పాయకరావుపేట (ఎస్సీ), శ్రీకాళహస్తి, ప్రొద్దుటూరు, ఆదోని, విజయనగరం, రాయచోటి, కదిరి, రాప్తాడు, ఆలూరు, గుంటూరు వెస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, పెనమలూరు, గూడురు (ఎస్సీ), ఒంగోలు, బనగానపల్లె, తాడిపత్రి, రాజమహేంద్రవరం సిటీ, ప్రత్తిపాడు(ఎస్సీ), రాజమహేంద్రవరం రూరల్, ఇచ్చాపురం, కడప, శ్రీకాకుళం, చింతలపూడి(ఎస్సీ), గన్నవరం, మైలవరం, నెల్లూరు రూరల్, తెనాలి, నంద్యాల, అనంతపురం అర్బన్, కర్నూలు, కోవూరు, చంద్రగిరి, మంగళగిరి, పాణ్యం, గాజువాక అసెంబ్లీ స్థానాల్లో పురుషులకంటే మహిళల సంఖ్య ఎక్కువ. ఇక ఎంపీ స్థానాల్లో విశాఖపట్నంలో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత వరుసలో గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు, తిరుపతి(ఎస్సీ), అనంతపురం, నంద్యాల, విజయవాడ, కర్నూలు, కాకినాడ ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లను నిర్ణయిస్తే... ఈ స్థానాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరో సీటు వెతుక్కోక తప్పదు!