Share News

సోషల్‌ మీడియా వినియోగంలో చిన్నారులపై ఆంక్షలు!

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:38 AM

చిన్నారులను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ వెల్లడించారు.

సోషల్‌ మీడియా వినియోగంలో చిన్నారులపై ఆంక్షలు!

  • 16 ఏళ్లలోపు వారిని దూరంగా ఉంచడంపై అధ్యయనం చేస్తున్నాం

  • సాధ్యాసాధ్యాలను పరిశీలించాకే నిర్ణయం

  • బ్లూమ్‌బర్గ్‌ ఇంటర్వ్యూలో లోకేశ్‌ వెల్లడి

  • పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా ఏపీ

  • దేశవ్యాప్తంగా వచ్చినవాటిలో ఏపీకి 25శాతం రావడమే నిదర్శనం

  • 18 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు: మంత్రి

ఇంటర్నెట్ డెస్క్: చిన్నారులను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. దావోస్‌ పర్యటనలో ఉన్న ఆయన బ్లూమ్‌బర్గ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆస్ట్రేలియాలో గత ఏడాది డిసెంబరు నుంచి 16 ఏళ్ల లోపు చిన్నారులు సోషల్‌ మీడియాను వినియోగించడంపై నిషేధం విఽధించారని, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ విధానం అమలుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని లోకేశ్‌ తెలిపారు. సోషల్‌ మీడియాపై ఆంక్షలు లేకపోవడం వల్ల.. దాని ద్వారా రకరకాల కంటెంట్‌ అందుబాటులోకి వస్తోందని, దానిని అర్థం చేసుకునే పరిణతి చిన్నారుల్లో ఉండదని, ఒక్కోసారి దాని వల్ల దుష్పరిణామాలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ కారణంగా 16 ఏళ్లలోపు చిన్నారులను సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారాలకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. అయితే దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. భారతదేశంలో పెట్టుబడులకు ఏపీ ప్రధాన కేంద్రంగా మారుతోందని, దేశం మొత్తంలో వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి రావడమే దీనికి నిదర్శనమని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని.. గత 18 నెలల్లో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 05:18 AM