82 వేల ఎకరాల వక్ఫ్ ఆస్తులు డిజిటలైజేషన్
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:00 AM
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమీద్ పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తుల నమోదుకు 6 నెలల అదనపు గడువు శనివారం(జూన్ 6)తో ముగిసిందని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు.
ఉమీద్ పోర్టల్‌లో నమోదు 100 శాతం పూర్తి: అజీజ్
అమరావతి, జూన్ 7(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమీద్ పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తుల నమోదుకు 6 నెలల అదనపు గడువు శనివారం(జూన్ 6)తో ముగిసిందని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. గడువు ముగిసింది పాత వక్ఫ్ ఆస్తుల నమోదుకేనని నూతన రిజిస్ట్రేషన్‌లకు పోర్టల్ అందుబాటులోనే ఉంటుందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు, సర్వర్ అంతరాయాలు, రికార్డుల కొరత, అంతర్రాష్ట్ర ఆస్తుల వివరాల సేకరణ తదితర అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ.. ప్రత్యేక కార్యాచరణ, నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. రెండు విడతల్లో వంద శాతం ఆస్తుల వివరాలను అప్‌లోడ్ చేశామని పేర్కొన్నారు. 8681 వక్ఫ్ సంస్థలకు చెందిన 82,567 ఎకరాల వక్ఫ్ ఆస్తులను ఉమీద్ పోర్టల్‌లో నమోదు చేసినట్లు వెల్లడించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, ఎన్‌ఎండీ ఫరూక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.