రేపటి నుంచి కలెక్టర్ల సదస్సు
ABN , Publish Date - May 06 , 2026 | 06:13 AM
జిల్లా కలెక్టర్ల సదస్సుకు ప్రభుత్వం మరోసారి శ్రీకారం చుట్టింది. ఈ నెల 7-8 తేదీల్లో సచివాలయం కేంద్రంగా ఈ సదస్సు నిర్వహించనుంది. జిల్లాల అభివృద్ధి, పాలనా..
అజెండాలో ఈ-ఆఫీస్ నిర్వహణ,ఫైళ్ల పరిష్కారం, పీజీఆర్‌ఎస్
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్ల సదస్సుకు ప్రభుత్వం మరోసారి శ్రీకారం చుట్టింది. ఈ నెల 7-8 తేదీల్లో సచివాలయం కేంద్రంగా ఈ సదస్సు నిర్వహించనుంది. జిల్లాల అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో మెరుగైన నిర్వహణ తదితర అంశాలపై కీలక చర్చ జరగనుంది. పాలన, అభివృద్ధిలో ఉత్తమ పనితీరు చూపిన జిల్లాలకు రెవెన్యూ శాఖ ర్యాంకులు ప్రకటించనుంది. ఏయే కారణాలతో ఆయా జిల్లాలకు ఉత్తమ ర్యాంకులు వచ్చాయి?. ఆయా జిల్లాలు అనుసరిచింన నూతన విధానాలు ఏమిటి అనే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయుప్రసాద్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రభుత్వం ‘ఈ-ఆఫీస్’ విధానానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కలెక్టర్లతో చర్చించనున్నారు. దీంతోపాటు ప్రజా ఫిర్యాదులు, ఫైళ్ల పరిష్కారం అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గత రెండు నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటిపై ప్రజల సంతృప్తి స్థాయి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై వారి స్పందన వంటి కీలక అంశాలపైనా చర్చించనున్నారు.
స్వర్ణాంధ్రతో మొదలు
తొలి రోజు సదస్సులో కలెక్టర్లను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం తొలి అజెండాగా ‘స్వర్ణాంధ్ర-2047’పై చర్చిస్తారు. దీనిలో పేదరిక నిర్మూలన, జనాభా నిర్వహణ, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, లాజిస్టిక్స్, తక్కువ ధర ఇంధనం, విద్యుత్ వ్యవస్థ, స్వచ్ఛాంధ్ర, డీప్‌టెక్, ఉత్పాదకత వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. రెండో అంశంగా జీఎ్‌సడీపీని చేర్చారు. 2025-26 ఆర్థికసంవత్సరంలో సాధించిన ఫలితాలు, జిల్లాల వారీగా పురోగతి వంటి అంశాలపై చర్చించనున్నారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అనంతరం, జిల్లాల విజయగాథలపై చర్చిస్తారు. గత కలెక్టర్ల సదస్సులో ఆయా జిల్లాలు ప్రజెంట్ చేసిన విజయగాథలపై తొలుత దృష్టి పెట్టి, తర్వాత కొత్తగా అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు, కోనసీమ, నెల్లూరు, విశాఖ, విజయనగరం జిల్లాల విజయగాథలపై చర్చించనున్నారు. అలాగే, కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎస్ఎస్) అమలుపై కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రజల సానుకూల స్పందనపై సమాచార శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ పథకాల అమలుపై ఏ జిల్లాల్లో ప్రజల స్పందన ఎలా ఉంది?. ఏ పథకంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారో తెలిపేలా ఆయన వివరిస్తారు. తొలి రోజు సదస్సులో చివరి అంశంగా పెట్టుబడుల ప్రతిపాదనలు, వాటి గ్రౌండింగ్‌పై చర్చించనున్నారు.
రెండో రోజు శాంతిభద్రతలు
శాంతిభద్రతల అంశంపై రెండో రోజు కీలక చర్చ జరగనుంది. సదస్సులో తొలుత సంజీవని ప్రాజెక్టు, వేసవి ప్రణాళికలపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. తర్వాత ‘సూపర్‌సిక్స్’ పథకాల అమలుపై చర్చిస్తారు. జిల్లాల అభివృద్ధి, వాటికి ర్యాంకులపై సీఎస్ సాయిప్రసాద్ వివరించనున్నారు. ఆ తర్వాత విద్యాశాఖపై చర్చిస్తారు. అనంతరం, న్యాయశాఖ అంశాలపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఆ తర్వాత శాంతి భద్రతలపై చర్చ ఉంటుంది. జిల్లా కలెక్టర్ లతోపాటు ఎస్పీలు, హోంశాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, జిల్లాల వారీగా శాంతిభద్రతల నిర్వహణపై ఎస్పీలు ప్రజెంటేషన్ ఇస్తారు. చివరగా సీఎం చంద్రబాబు కలెక్టర్‌లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
వీటి సంగతేంటి?
కలెక్టర్ల సదస్సులో చర్చించే అజెండా కీలకం. జరిగిన అభివృద్ధి, జిల్లాల్లో పాలనా వ్యవహారాలు, రానున్నకాలంలో అనుసరించాల్సిన వ్యూహాలను దిశానిర్దేశం చేసేలా సదస్సు నిర్వహిస్తున్నారు. కానీ, 7వ విడత సమావేశాల అజెండాను పరిశీలిస్తే కొత్తదనం కనిపించడం లేదు. అంతా రోటీన్ అన్నట్లుగానే అజెండా రూపకల్పన ఉంది. నిజానికి నడి వేసవిలో కలెక్టర్ల సమావేశాలు జరుగుతున్నాయి. ఈసారి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం ఆరోగ్య సమస్యలేకాదు, తాగునీరు, ఇతర ఇబ్బందులు అనేకం తలత్తే అవకాశం ఉంది. ఇలాంటి కీలక అంశాన్ని వైద్య, ఆరోగ్యశాఖ అంశంగా చేర్చి కేవలం కొద్దిపాటి సమయంలో చర్చ ముగించేలా అజెండాను రూపొందించారు. వేసవిని ఎదుర్కొనే కార్యాచరణ పక్కాగా ఉండాలి. దీనిలో అనేక శాఖలు కలిసి పనిచేసే అంశాలు ఉంటాయి. గత సదస్సులలో ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. ప్రతి కలెక్టర్ గ్రామాల పర్యటనకు వెళ్లాలని, ‘పల్లె నిద్ర’ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ అంశంపై రెవెన్యూశాఖ ఓ నివేదిక తయారు చేసి, ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసి దానిలో పొందుపరచాలని సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు రెవెన్యూశాఖ నుంచి ఈ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. తాజా సదస్సులో అయినా ఈ అంశంపై చర్చిస్తారో లేదో చూడాలి.