Share News

రైతన్నలకు ఉగాది కానుక

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:04 AM

రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం ఉగాది కానుకగా ’అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులను శుక్రవారం విడుదల చేయనుంది.

రైతన్నలకు ఉగాది కానుక

  • నేడు ‘అన్నదాత సుఖీభవ’ 3.0 నిధుల జమ

  • ఖాతాల్లోకి రూ.4 వేలు.. కేంద్రం మరో రూ.2 వేలు

  • కృష్ణా జిల్లా సూరంపల్లిలో విడుదల చేయనున్న సీఎం

  • రాష్ట్రంలో 46.85 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి

  • ‘సూపర్‌ సిక్స్‌’లో మరో హామీ అమలు సంపూర్ణం

అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం ఉగాది కానుకగా ’అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులను శుక్రవారం విడుదల చేయనుంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో పథకం నిధులు రూ. నాలుగు వేలు జమ చేయనున్నారు. ఇదే రోజు ’పీఎం కిసాన్‌’ కింద రూ. రెండు వేలు ప్రధాని నరేంద్రమోదీ అసోంలోని గువాహటిలో విడుదల చేయనున్నారు. అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ కింద ఈ విడత 46.85 లక్షల రైతు కుటుంబాలకు, రూ.6 వేలు చొప్పున జమ కానున్నాయి. మొత్తం రూ.2,676 కోట్ల చెల్లింపుల్లో రాష్ట్ర వాటా రూ.1,874 కోట్లు, కేంద్ర వాటా రూ.802 కోట్లు. ఇప్పటికే మొదటి, రెండో విడత కలిపి ఒక్కో రైతుకు రూ.14వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. మూడో విడతతో కలిపి ఒక్కో రైతుకు మొత్తం రూ.20వేలు కూటమి ప్రభుత్వం ఇచ్చినట్లవుతుంది. దీంతో మరో ‘సూపర్‌ సిక్స్‌’ మరో హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకున్నట్టు అయింది. ఇందులోభాగంగా, 2025 ఆగస్టు 2న మొదటి విడత రూ.7వేలు ( రాష్ట్రం రూ.5వేలు) చొప్పున రూ.3,174కోట్లు (రాష్ట్రం వాటా రూ.2,342.92 కోట్లు), నవంబరు 19న రెండో విడత రూ.7వేలు (రాష్ట్రం రూ.5వేలు) చొప్పున రూ.3,135కోట్లు (రాష్ట్రంవాటా రూ.2,342.92 కోట్లు) కలిపి రూ.6,309 కోట్లు రైతు కుటుంబాలకు అందించారు. ఇక.. ఏడాది మొత్తంలో రైతులకిచ్చిన సొమ్ములో రాష్ట్ర వాటా రూ.6,560 కోట్లు ఉండగా, కేంద్రం వాటా రూ.2,425కోట్లు ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - Mar 13 , 2026 | 04:05 AM