ఏపీ అంటే అన్నపూర్ణ
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:40 AM
‘‘ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ. ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో పేదలు ఎవరూ ఆకలితో ఉండకూడదు. వారి ఆకలి తీర్చడానికి ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాతలుగా మారాలి.’’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం.. ఆకలితో ఎవరూ ఉండకూడదు
ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాతగా మారాలి
అన్నదానంలో భాగస్వాములు కావాలి
త్వరలో మరో ఐదు అన్న క్యాంటీన్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
క్యాంటీన్లను మూసేయాలని జగన్‌కు
మనసెలా వచ్చిందోనని వ్యాఖ్య
విజయవాడలోని అన్న క్యాంటీన్‌లో అల్పాహారం వడ్డించిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు
ప్రజల మధ్యే ‘పుట్టినరోజు’
పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లను వైసీపీ అధికారంలోకి వచ్చాక మూసివేసింది. అలా చేయడానికి జగన్‌కు మనసు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. పేదలకు భోజనం పెడతామని ఎవరైనా ముందుకొస్తే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. వైసీపీ పాలకుల ప్రవర్తన, ఆలోచనా విధానాలకు ఇదొక నిదర్శనం. పేదలు పట్టెడన్నం తింటే కూడా భరించలేని వారు రాజకీయాల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలి.
- సీఎం చంద్రబాబు
విజయవాడ, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ. ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో పేదలు ఎవరూ ఆకలితో ఉండకూడదు. వారి ఆకలి తీర్చడానికి ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాతలుగా మారాలి.’’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం చంద్రబాబు 76వ పుట్టిన రోజును పురస్కరించుకుని సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌లో పేదలు, సాధారణ ప్రజల మధ్య గడిపారు. తొలుత అన్న క్యాంటీన్‌కు వచ్చిన వారికి చంద్రబాబు దంపతులు స్వయంగా అల్పాహారం వడ్డించారు. అనంతరం అందరితో కలిసి వారు కూడా అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురితో మాట్లాడి.. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘పుట్టినరోజు నాడు అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి అల్పాహారం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆకలితో ఎవరూ ఉండకూడదన్న ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం.
ఈ బృహత్తర యజ్ఞంలో స్ఫూర్తిదాతలు సైతం ముందుకు రావాలి. పేదలు.. హోటళ్లకు వెళ్లి తినాలంటే రూ.100 వెచ్చించాల్సి వస్తోంది. కానీ.. అన్న క్యాంటీన్లలో రూ.5కే అందిస్తున్నాం. క్యాంటీన్లను నిర్వహిస్తున్న ‘ఇస్కాన్’ బాగా పనిచేస్తోంది. ప్రస్తుతం 269 అన్న క్యాంటీన్లు ఉన్నాయి. ఇటీవలే 62 కొత్త క్యాంటీన్లను ప్రాంభించాం. రాబోయే రోజుల్లో మరో ఐదు క్యాంటీన్లను ప్రారంభిస్తాం.’’ అని తెలిపారు. అన్న క్యాంటీన్ వద్ద సీఎంకు పలువురు అధికారులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తదితరులు ‘హ్యాపీ బర్త్‌డే సర్’ అని చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు.
భువనేశ్వరికి అభినందనలు
తన పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా అల్పాహారం, భోజనం అందించేందుకు రూ.76 లక్షలు విరాళంగా ఇచ్చిన సతీమణి భువనేశ్వరిని చంద్రబాబు అభినందించారు. ఇదొక స్ఫూర్తిదాయక కార్యక్రమమని వ్యాఖ్యానించారు. అన్నదానం మహాపవిత్రమైందని, ప్రజలు కూడా తోచిన విధంగా అన్నదానాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పీ4 కార్యక్రమంలో అన్న క్యాంటీన్లు ఒకటని చెప్పారు. పది మంది ధనవంతులు 20 మంది పేదలను బంగారు కుటుంబంలా తయారు చేయాలని సూచించారు. సమాజంలో ఆర్థిక అసమానతలను పూర్తిగా తొలగించడమే నిజమైన ప్రజాస్వామ్యమని చెప్పారు.
భువనేశ్వరి ఆదర్శం..
సీఎం సతీమణి భువనేశ్వరి పక్కనే నిలబడి అల్పాహారం తీసుకున్న డ్వాక్రా మహిళతో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె.. తాను డ్వాక్రా ఉత్పత్తులను తయారు చేస్తున్నానని వివరించారు. పిల్లలు ఏం చేస్తున్నారని అడగ్గా.. అమ్మాయి డిగ్రీ చదువుతోందన్నారు. ‘‘డ్వాక్రా ఉత్పత్తుల మీద సాధారణ రోజుల్లో ఆదాయం ఎంత వస్తోంది?. సీజన్‌లో ఎంత వస్తుంది?.’’ అని సీఎం ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. తనకు భువనేశ్వరి ఆదర్శమని చెప్పడంతో.. ‘‘ఆవిడలా పనిచేయాలంటే డబ్బులు సంపాదించాలి. రూ.76 లక్షలు ఇచ్చి ఉచితంగా భోజనం, టిఫిన్ పెట్టించారు.’’ అని వ్యాఖ్యానించారు.
ప్రోత్సహించలేదు!
క్యాంటీన్‌లో ఒక ఆటోడ్రైవర్‌తో మాట్లాడిన సీఎం ఆయన కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. తనకు ఇద్దరబ్బాయిలు ఉన్నారని, పెద్దబ్బాయి ఎంబీఏ చదివాడని, రెండో అబ్బాయికి చదువు అబ్బలేదని, ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడని ఆయన వివరించాడు. చంద్రబాబు స్పందిస్తూ.. చదువు అబ్బకపోవడం కాదు. రెండోఅబ్బాయిని ప్రోత్సహించలేదు అని అన్నారు.