సర్క్యులర్ ఎకానమీ దిశగా పట్టణాలు
ABN , Publish Date - May 11 , 2026 | 04:54 AM
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ జీవన ప్రమాణాలున్న టాప్ 100 నగరాల్లో మన రాష్ట్రం నుంచి కనీసం రెండు నగరాలు ఉండేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది.
ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు సాంకేతికత
స్వయం సహాయక సంఘాల సహకారం
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి ర్యాంకులే లక్ష్యం
46 మున్సిపాలిటీలను ఎంపిక చేసి శిక్షణ
రాష్ట్రంలోని పట్టణాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో, పర్యావరణ అనుకూలంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పౌరుడికి సురక్షితమైన తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు కల్పించడంతో పాటు సాంకేతికత సాయంతో వ్యర్థాల నిర్వహణ, మోడల్ సర్క్యులర్ ఎకానమీ తీసుకురావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ చర్యలు చేపట్టింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ జీవన ప్రమాణాలున్న టాప్ 100 నగరాల్లో మన రాష్ట్రం నుంచి కనీసం రెండు నగరాలు ఉండేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ‘చెత్త నుంచి సంపద’ అనే విధానంతో సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేస్తూ, పర్యావరణానికి మేలు చేసే పద్ధతులను అమలు చేయనుంది. దీని లో భాగంగా ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. ఏప్రి ల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2026ను పకడ్బందీగా అమ లు చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించిం ది. జూన్ 15 నాటికల్లా భారీ స్థాయిలో చెత్తను ఉత్పత్తి చేసే వారిని గుర్తించి ఆన్‌లైన్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలని, స్వయం సహాయక సంఘాలు, స్థానిక వ్యాపారుల ద్వారా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించాలని దిశా నిర్దేశం చేసింది. పల్లెలు, పట్టణాల మధ్య వ్యత్యాసం లేకుం డా డంపింగ్ యార్డులు, చెత్త ప్రాసెసింగ్ యూనిట్లను అనుసంధానం చేయాలని స్పష్టం చేసింది.
50 శాతం పచ్చదనం లక్ష్యం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని, డీప్ టెక్ పాలనతో పారదర్శకతను పెంచుతున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు స్వచ్ఛ సర్వేక్షణ్-2025లో జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి అత్యుత్తమ ర్యాంకులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. దీనికోసం ఇప్పటికే జాతీయ ర్యాంకింగ్స్ సాధించే సత్తా ఉన్న 46 మున్సిపాలిటీలను ఎంపిక చేసి, రాష్ట్ర స్థాయి పీఎంయూ బృందాల ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం వాష్ ఐ, సాహస్, ఏఐఐఎల్‌ఎ్‌సజీ సంస్థల సహకారంతో 35 వేల మందికి పైగా సిబ్బందికి శిక్షణ ఇచ్చి ప్రజల్లో అవగాహన కల్పించారు. స్వచ్ఛ ర్యాంకుల్లో మెరుగైన ఫలితాల కోసం ఇంటింటి నుంచి చెత్త సేకరణ, మూలం వద్దే చెత్తను వేరుచేయడం వంటి అంశాలకు వంద శాతం ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రస్తుత ర్యాంకింగ్‌లో గుంటూరు, విశాఖపట్నం, కోనసీమ జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి.
ప్రైవేట్ భూ సేకరణ
ఆయా ప్రాజెక్టులకు అవసరమైన 89.44 ఎకరాల ప్రైవేట్ భూమిని వెంటనే సేకరించాల్సిన అవసరముందని అధికారులు చెబుతున్నారు. దీనికిగాను రూ.326.49 కోట్ల మేరకు ఖర్చవుతాయని తెలిపారు. అలాగే ప్రతి నెలా 10, 20వ తేదీల్లో స్థానిక సంస్థల పరిధిలో తప్పనిసరిగా ఈ-వేస్ట్ సేకరించేలా చర్యలు తీసుకున్నారు. ఈ పనులన్నీ సజావుగా జరిగేలా కలెక్టర్ల అధ్యక్షతన మున్సిపల్, పంచాయతిరాజ్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, సమీక్ష నిర్వహించాలని మున్సిపల్ శాఖ ఆదేశించింది. దీంతో పాటు పరిశ్రమలశాఖ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, కడప, పల్నాడు, నంద్యాల వంటి జిల్లాల్లో సుమారు 590 ఎకరాలకు పైగా భూములను దీనికి కేటాయించారు. పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రత్యేక రాయితీలు కూడా అందిస్తున్నారు.
జూన్ నాటికి..
జూన్ నాటికి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో వంద శాతం ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్య సాధన కోసం పర్యావరణ అనుకూలమైన ఈ-ఆటోలను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికి 501 వాహనాలకు అనుమతులివ్వగా, నెల్లూరు మున్సిపాలిటీలో తొలి విడతగా 30 వాహనాలతో సేవలు ప్రారంభమయ్యాయి. దశాబ్దాలుగా పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త గుట్టల తొలగింపులో కూడా వేగం పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 152 లక్షల టన్నుల చెత్తలో ఇప్పటికే 118 లక్షల టన్నులకు పైగా చెత్తను తొలగించారు. జూన్ నాటికి ఈ ప్రక్రియను వంద శాతం పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. వ్యర్థాల నిర్వహణను మరింత పకడ్బందీగా చేపట్టేందుకు కొత్తగా 107 ఇంటిగ్రేటెడ్ ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటితో పాటు 148 మురుగునీటి శుద్ధి కేంద్రాలను అక్టోబరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
అపార్ట్‌మెంట్లలో బయో-డైజెస్టర్లు
అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల లాంటి భారీగా చెత్తను ఉత్పత్తి చేసే వారిని సర్వే ద్వారా గుర్తించి, కొత్త నిబంధనల ప్రకారం వారి ఆవరణల్లోను చెత్తను కంపో్‌స్టగా మార్చే బయో-డైజెస్టర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. దీనికోసం తయారీ సంస్థలతో మాట్లాడి తక్కువ ధరకే ఆ యంత్రాలు అందేలా ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.