ఎవరికెన్ని.. ఏవి?
ABN , Publish Date - Oct 13 , 2026 | 03:47 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల నడుమ సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వస్తున్నాయి. ఏ పార్టీకి ఎన్ని, ఎక్కడ అనే అంశంపై మంగళవారం దాదాపుగా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
సీట్ల సర్దుబాటుపై కూటమిలో చర్చలు
చంద్రబాబు నివాసంలో కీలక భేటీ
2024కంటే రెట్టింపు కోరిన జనసేన, బీజేపీ
రిజర్వేషన్లతో స్థానాలపై మారిన అంచనాలు
నేడు జనసేన కార్యాలయంలో చర్చలు
ఆ తర్వాత జాబితాలతో చంద్రబాబు వద్దకు
అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల నడుమ సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వస్తున్నాయి. ఏ పార్టీకి ఎన్ని, ఎక్కడ అనే అంశంపై మంగళవారం దాదాపుగా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. స్థానికంలో సీట్ల సర్దుబాటుపై సోమవారం సీఎం చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో చంద్రబాబుతోపాటు టీడీపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎన్డీయే సమన్వయ కమిటీలో టీడీపీ సభ్యుడైన మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్... బీజేపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో తమకు కేటాయించిన సీట్ల శాతంతో సంబంధం లేకుండా... తమకు బలమున్న స్థానాల్లో పోటీ చేద్దామన్నది తమ ఆలోచన అని, దానికి అనుగుణంగా సీట్లు కేటాయించాలని జనసేన, బీజేపీ కోరినట్లు సమాచారం.
అలాకాని పక్షంలో 2024 ఎన్నికల్లో కేటాయించిన సీట్ల శాతానికి రెట్టింపు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. 2024లో జనసేనకు 12 శాతం సీట్లు కేటాయించారు. స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ 20 నుంచి 25 శాతం సీట్లు కేటాయించాలని కోరుతోంది. ఈ లెక్కన మూడు కార్పొరేషన్లు, 25 మున్సిపాలిటీలు/నగరపంచాయతీలను ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుంది. బీజేపీకి 2024లో సుమారు 5 శాతం సీట్లు కేటాయించారు. వారు ఈసారి 10 శాతం సీట్లు కేటాయించాలని కోరుతున్నారు. అంటే 1 లేదా 2 కార్పొరేషన్లు, 10 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలపై చర్చలు జరిపిన కూటమి నేతలు దాదాపు ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అయితే... ఏయే స్థానాలు కేటాయించాలనే అంశంపై స్పష్టత రాలేదు. ఎన్నికల షెడ్యూల్‌కు రెండు రోజుల ముందు రిజర్వేషన్లను ప్రకటించడంతో తాము ముందుగా అనుకున్న సమీకరణాల్లో మార్పులు వచ్చాయని జనసేన, బీజేపీ నేతలు పేర్కొన్నట్లు సమాచారం. హడావిడిగా రిజర్వేషన్లు ప్రకటించడంపైనా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని మార్చేందుకు ఏమైనా అవకాశాలు ఉంటే పరిశీలించాలని కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. రిజర్వేషన్ల ప్రకటనపై తమ పార్టీలోనూ అసంతృప్తి ఉన్నప్పటికీ చట్టబద్ధంగా జరగాల్సిన ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని, రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు.
నేడు మరోసారి చర్చలు..
తాము ముందుగా అనుకున్న స్థానాలు రిజర్వేషన్ల కారణంగా తారుమారు అయ్యాయని... కొత్త స్థానాల ఎంపిక, అక్కడ అభ్యర్థులు ఎవరన్న దానిపై తమ పార్టీల నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని జనసేన, బీజేపీ కోరడంతో మంగళవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జనసేన కార్యాలయానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు వెళ్లనున్నారు. అక్కడ జనసేనాని పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌తో సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా తమ పార్టీ నాయకులతో చర్చించి తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానాల జాబితాను సిద్ధం చేసుకోనున్నారు. వీరి నడుమ చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాత మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు నివాసంలో మరోసారి కూటమి నేతలంతా సమావేశమై సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి రానున్నారు.
తిరుపతి, నెల్లూరు కోరిన బీజేపీ
తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లను తమకు కేటాయించాలని బీజేపీ నేతలు కోరినట్లు తెలిసింది. అయితే.. నెల్లూరులో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ బీజేపీ పోటీ చేయడం సరైన నిర్ణయం కాబోదని టీడీపీ నేతలు సూచించడంతోపాటు తిరుపతి స్థానం నుంచి టీడీపీ బరిలో ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. వేరే ఏదైనా కార్పొరేషన్‌ను ఎంపిక చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. మరోవైపు జనసేనకు కేటాయించే మూడు కార్పొరేషన్ స్థానాలపై సందిగ్ధత కొనసాగుతోంది. విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ కార్పొరేషన్లను జనసేన కోరుతోంది. అయితే రాజధాని ప్రాంతంలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రెండు కీలకమైన స్థానాలను జనసేనకు ఇవ్వడం ఎంత వరకు సమంజసమనే చర్చ వచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్కులో వివక్ష
ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు