శనగ రైతుకు ‘దిగుమతుల’ సంకటం
ABN , Publish Date - Mar 20 , 2026 | 04:38 AM
రాష్ట్రంలో శనగ రైతులు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. రబీ సీజన్‌లో ప్రత్యేకంగా పండించే శనగల కొనుగోలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయకపోవడంవల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇక్కడి పంటను కొనేవారు లేరు.. దాచుకునేందుకు చోటూ లేదు
దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం.. దేశంలోకి భారీగా విదేశీ శనగలు
సంకట స్థితిలో రైతులు.. పట్టించుకోని ప్రభుత్వాలు
అమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శనగ రైతులు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. రబీ సీజన్‌లో ప్రత్యేకంగా పండించే శనగల కొనుగోలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయకపోవడంవల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు దేశీయంగా అధికంగా ఉత్పత్తి వచ్చిన శనగల ఎగుమతికి చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం.. విదేశీ శనగల దిగుమతికి అవకాశం కల్పించడం సమస్యను మరింత జఠిలం చేస్తోంది. పండించిన పంటకు కనీస మద్దతు ధరరాక, నిల్వ చేసే మార్గం లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్రం అనుమతితో ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా మారాయి.
దిగుబడి ఆశాజనకం
ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 8.5లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన శనగ పంట 10లక్షల ఎకరాల్లో సాగైం ది. దీనికితోడు వాతావరణం అనుకూలించి, ఉత్పత్తి ఆశాజనకంగా వచ్చింది. సగటున ఎకరానికి 8 క్విం టాళ్ల దిగుబడి వస్తోంది. మొత్తం 8లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా. కానీ రాష్ట్రంలో ప్రస్తుత సీజన్‌లో ధరల మద్దతు పథకం కింద 94,500 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలుకు మాత్రమే కేంద్రం అనుమతించింది. కనీస మద్దతు ధరకు శనగల సేకరణకు నోడల్ ఏజెన్సీగా మార్క్‌ఫెడ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇప్పటివరకు 50వేల టన్నుల దాకా మద్ద తు ధరకు కొనుగోలు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. 2026-27 రబీ సీజన్ లో శనగకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,875 కేంద్రం ప్రకటించింది. కానీ బయట వ్యాపారులు క్వింటా రూ.5 వేల నుం చి రూ.5,500 మధ్య అడుగుతున్నారు. అయినా మార్క్‌ఫెడ్ కేంద్రాలకు తరలించడం కష్టంగా ఉండటంతో.. చాలామంది రైతులు దళారీలకు అమ్ముకుంటున్నారు. రబీలో కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, నెల్లూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో ప్రధానం గా ఎర్ర, తెల్ల శనగ సాగు జరిగింది. ప్రస్తుతం కోతకొచ్చిన శనగలను రైతులు తక్షణ అవసరాలకు కొంత సరుకు అమ్ముకుని, మరికొంత కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకోవాలని భావిస్తున్నారు. వ్యాపారులు కూడా సీజన్‌లో రైతుల నుంచి కొని, స్టాక్ పెట్టి, ధర వచ్చినప్పుడు అమ్ముకుంటున్నారు. కానీ ఈ ఏడాది కోల్డ్‌స్టోరేజీలు ఖాళీ లేక.. ఇళ్లల్లో నిల్వ చేసుకోలేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుత లక్ష్యానికి అదనంగా మరో లక్ష టన్నుల శనగలు కొనుగో లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు మార్క్‌ఫెడ్ అధికారులు తెలిపారు.
విదేశీ దిగుమతులతో తంటా
దేశవాళీ శనగలు నాణ్యంగా ఉన్నా.. వినియోగ అవసరాలకు పోను, కొంత మిగులు ఉంటున్నా.. కేంద్రం విదేశీ శనగల దిగుమతికి అవకాశం కల్పిస్తోంది. విదేశీ శనగలపై గతంలో ఉన్న 40-60శాతం దిగుమతి సుంకాన్ని 2024లో ఎత్తివేసింది. ఆతర్వాత రైతుల ఆందోళనతో దిగుమతి సుంకాన్ని 10శాతానికి పరిమితం చేసింది. దీంతో దేశీయ శనగలు ఎగుమతి కాకపోగా, దిగుమతులు పెరిగి, నిల్వలు భారీగా పేరుకుపోయాయి. కానీ ఈ పంటకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా.. ఉత్పత్తిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం లేదు. కేంద్రం సేకరిస్తుందనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. కేవలం ధర బాగా తగ్గినప్పుడు, లేదా విపత్తులతో పంట నష్టపోయినప్పుడు మాత్రమే బోనస్ లేదా సబ్సిడీ ఇచ్చి, ఉడతా భక్తిగా ఆదుకుంటున్నది. రెండేళ్ల క్రితం దేశీయ శనగల్లో కొన్ని రకాలు క్వింటా రూ.10వేలపైనే పలికాయి. కానీ ఇప్పుడు రూ.ఐదారువేలకు కూడా కొనడం లేదు. మార్కెట్‌లో కిలో శనగలు రూ.100 పలుకుతున్నా.. రైతుకు మాత్రం రూ.60 కూడా రావట్లేదని వాపోతున్నారు.