పంట నీటి అవసరాలపై వాస్తవాలే పరిగణనలోకి
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:53 AM
పంట నీటి అవసరాలపై వాస్తవాలను, ఐసీఏఆర్-సీఆర్‌ఐడీఏ (హైదరాబాద్) ఆమోదించిన వ్యవసాయ వాతావరణ నివేదికను కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-1 పరిగణనలోకి తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ తెలిపింది.
జలసంఘం ఆదేశాలను కృష్ణా ట్రైబ్యునల్-1 పట్టించుకోలేదు
బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ వాదన
అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): పంట నీటి అవసరాలపై వాస్తవాలను, ఐసీఏఆర్-సీఆర్‌ఐడీఏ (హైదరాబాద్) ఆమోదించిన వ్యవసాయ వాతావరణ నివేదికను కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-1 పరిగణనలోకి తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. అలాగే కేసీ కెనాల్ విషయంలో తార్కిక విశ్లేషణ చేయలేదని.. కాలువ సామర్థ్యాన్ని ఏకపక్షంగా 60 శాతంగా అంచనా వేసిందని అభ్యంతరం వ్యక్తం చేసింది. కాలువల పొడవు, భూభాగం, విస్తీర్ణం ఆధారంగా ప్రాజెక్టుల ప్రొఫైల్స్ భిన్నంగా ఉంటాయని.. ఒకే రీతిలో లెక్కలు వేయడం సరికాదని స్పష్టం చేసింది. మంగళవారం ఢిల్లీలో బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ముందు ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదనలు కొనసాగించారు. కేసీ కెనాల్ పరిధిలో శాస్త్రీయ పంట నీటి అవసరాలపై ట్రైబ్యునల్-1 వెలిబుచ్చిన విశ్లేషణను ఆయన తప్పుబట్టారు. పంట నీటి అవసరాల వినియోగంపై కేంద్ర జల సంఘం ఇచ్చిన ఆదేశాలే ప్రామాణికమని తేల్చిచెప్పారు. ట్రైబ్యునల్ విచారణ బుధవారం కూడా కొనసాగనుంది.