‘జనగణన’కు ప్రజలు సహకరించాలి
ABN , Publish Date - Apr 13 , 2026 | 04:46 AM
రాష్ట్రంలో జనగణన కార్యక్రమం సజావుగా జరిగేందుకు పూర్తిస్థాయిలో సహకరించాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.
అధికారులు అడిగిన వివరాలు తెలియజేయాలి
నిబంధనల ఉల్లంఘనకు జరిమానా, జైలుశిక్షలు
అవగాహన కోసం ప్రభుత్వ మార్గదర్శకాలు
రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్
అమరావతి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జనగణన కార్యక్రమం సజావుగా జరిగేందుకు పూర్తిస్థాయిలో సహకరించాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఈ మేరకు జనగణన చట్టం-1948 కింద ప్రజలకు వారి విధులు, బాధ్యతలను గుర్తు చేస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16 నుంచి స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యుమరేషన్), మే 1 నుంచి క్షేత్రస్థాయి గణన ప్రారంభం కానుంది. స్వీయ నమోదు ప్రక్రియలో ప్రజలు తమంతట తామే ఆన్‌లైన్ పోర్టల్‌లో కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ అవకాశం ఈ నెల 30 వరకు అందుబాటులో ఉంటుంది.
ప్రజలు ఇవి తెలుసుకోవాలి..
సెక్షన్-8 ప్రకారం, ప్రతి వ్యక్తి జనాభా లెక్కల అధికారి అడిగే ప్రశ్నలకు తమకు తెలిసినంత వరకు నిజాయితీగా సమాధానం చెప్పాలి.
సెక్షన్-9 ప్రకారం, అధికారులు జనాభా లెక్కల కోసం ఇళ్లకు వచ్చినప్పుడు.. యజమానులు వారిని అనుమతించాలి. అవసరమైన గుర్తులు, అక్షరాలు లేదా సంఖ్యలను గోడలపై వేసేందుకు అనుమతివ్వాలి.
సెక్షన్-11 ప్రకారం, ఈ నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు, ఇతర చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంది. అలాగే అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించకపోవడం వంటి ఉల్లంఘనలు ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. ఉల్లంఘన తీవ్రత ఆధారంగా జరిమానా లేదా జైలుశిక్ష విధించే అవకాశం ఉంది.
జనాభా లెక్కల్లో సేకరించిన వ్యక్తిగత వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు.
సెక్షన్-10 ప్రకారం జనాభా లెక్కల అధికారి ఆదేశాల మేరకు ఇంటి యజమాని లేదా సంస్థ మేనేజర్ తమకు ఇచ్చిన ఫారమ్‌ను కుటుంబ సభ్యుల వివరాలతో కచ్చితంగా నింపాలి. దానిపై సంతకం చేసి, నిర్దేశిత సమయంలోగా అధికారులకు అందజేయాలి.