రూ.2,387 కోట్లతో సెమీకండక్టర్ పరిశ్రమ
ABN , Publish Date - Feb 25 , 2026 | 04:04 AM
విశాఖపట్నం జిల్లా ఆనందవరం మండలం తర్లువాడ గ్రామంలో రూ.2,387.81 కోట్లతో నిర్మించే సెమీకండక్టర్ పరిశ్రమకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
40శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికీ ఫ్రీ బస్సు
నీరు-చెట్టు పనుల కేసులు ఎత్తివేతకు నిర్ణయం
క్యాబినెట్ సమావేశంలో 57 అంశాలకు ఆమోదం
అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా ఆనందవరం మండలం తర్లువాడ గ్రామంలో రూ.2,387.81 కోట్లతో నిర్మించే సెమీకండక్టర్ పరిశ్రమకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ సెమీ కండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 2024-29 కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు విస్తరించేందుకు ఈ నెల 18న జరిగిన ఎస్‌ఐపీబీలో తీసుకున్న సిఫారసులను అనుమతించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో 57 అంశాలకు ఆమోదం లభించింది.
క్యాబినెట్ ఆమోదించిన మరికొన్ని నిర్ణయాలు ఇవీ...
ఏపీ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ సవరణ బిల్లు-2026ను ప్రవేశపెట్టడానికి ఆమోదం. మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన లైఫ్‌ట్యాక్స్‌పై 10ు అదనపు పన్నును రోడ్డు సేప్టీ సెస్‌గా విధించి వసూలు చేయడానికి 3-సీ లెవీ ఆఫ్ రోడ్ సేఫ్టీ సెస్ అనే కొత్త సెక్షన్‌ను ప్రవేశపెట్టడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టనుంది.
స్త్రీశక్తి పథకంలో భాగంగా 40శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని విస్తరించడానికి ఆమోదం. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం ఇస్తున్న 50 శాతం రాయితీని కొనసాగింపునకు అనుమతి.
చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం పట్నం గ్రామంలో 18.60 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి కేటాయించారు. కాణిపాకం యాత్రికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి, అభివృద్ధి కార్యకలాపాలకు మార్కెట్ విలువ ఎకరా రూ.8.75 లక్షల చొప్పున కేటాయిస్తారు.
ప్రస్తుత ‘పర్యావరణ, అటవీ, విజ్ఞాన, సాంకేతిక శాఖ’ను ‘పర్యావరణ, అటవీశాఖ’గా నామకరణం చేయాలని ప్రతిపాదించింది. ‘సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ’ను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఫిబ్రవరి 11న జరిగిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
కొల్లేరు వన్యప్రాణి అభయారణ్య సరిహద్దుల హేతుబద్ధీకరణపై 48వ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ సమావేశం చేసిన సిఫారసుల ప్రకారం చర్యలు తీసుకోవడానికి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని సంప్రదించేందుకు చేసిన ప్రతిపాదనలను ఆమోదించింది.
విశాఖపట్నం రుషికొండలో వి హోటల్ అనే స్వంత బ్రాండ్ కింద 3-స్టార్ హోటల్ అభివృద్ధి కోసం వీరాంజనేయ హాస్పిటాలిటీకి ప్రోత్సాహకాలకు ఆమోదం.
సత్యసాయి జిల్లా పెనుగొండలోని గనగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పాదపీఠం వద్ద మెగా స్పిరిచ్యువల్ అండ్ కల్చరల్ టూరిజం సెంటర్-బేస్ క్యాంప్ అభివృద్ధి కోసం బెంగుళూరు ఇస్కాన్‌కు భూమి, ప్రోత్సాహకాలు అందించేందుకు జారీ చేసిన ఉత్తర్వులకు అనుమతి లభించింది.
విశాఖ జిల్లా తర్లువాడలో అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌కు 30 ఎకరాల కేటాయింపు, పెట్టుబడికి ప్రత్యేక ప్రోత్సాహకాలు విస్తరించడానికి ఎస్‌ఐపీబీ సిఫారసులకు ఆమోదం.