Share News

ఇక ఠంచనుగా క్యాబినెట్‌ అజెండా

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:29 AM

క్యాబినెట్‌ సమావేశాల అజెండా రూపకల్పన ప్రక్రియను సరిదిద్దేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సిద్ధమయ్యారు. అజెండా రూపకల్పన ప్రక్రియను క్రమబద్ధీకరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక ఠంచనుగా క్యాబినెట్‌ అజెండా

  • సకాలంలో రూపకల్పనపై సీఎస్‌ దృష్టి.. తయారీ ప్రక్రియ క్రమబద్ధీకరణ

  • కొత్త నిబంధనలతో ఉత్తర్వులు జారీ

అమరావతి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): క్యాబినెట్‌ సమావేశాల అజెండా రూపకల్పన ప్రక్రియను సరిదిద్దేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సిద్ధమయ్యారు. అజెండా రూపకల్పన ప్రక్రియను క్రమబద్ధీకరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 10న జరిగిన రాష్ట్ర మంత్రి మండలి భేటీలో.. సమావేశం ప్రారంభమైనా అజెండా కాపీ మంత్రులకు రాలేదంటూ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చిన విషయం విదితమే. ఒక రోజు ముందే మంత్రులకు అందాల్సిన అజెండా కాపీ సమావేశం ప్రారంభమైనా రాకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అజెండా ముందుగానే బయటకు వచ్చేస్తోందన్న కారణంతో సాఫ్ట్‌వేర్‌ మార్చి మంత్రుల ట్యాబ్‌లకు పంపామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆ సమాధానంపైనా సీఎం అసహనం వ్యక్తం చేశారు. క్యాబినెట్‌ అజెండా కాపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రోజు ముందుగానే మంత్రులకు చేరాలని సీఎ్‌సకు స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్‌ రంగంలోకి దిగారు. అజెండా రూపకల్పనలో వివిధ స్థాయిల్లో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించి సకాలంలో సిద్ధం చేసేలా కొత్త నిబంధనలను పేర్కొంటూ అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల్లో ఏముందంటే..

  • క్యాబినెట్‌లో చర్చించాల్సిన అజెండా అంశాలను అన్ని శాఖలు పీపీటీతో సహా ముఖ్యమంత్రి ఆమోదాన్ని కూడా తీసుకుని క్యాబినెట్‌ సమావేశానికి ఒక్క రోజు ముందు ఉదయం 11 గంటలలోపు సమర్పించాలి.

  • తుది అజెండా కాపీని సీఎస్‌ ద్వారా సీఎం ఆమోదానికి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు పంపాలి. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే మంత్రులు, కార్యదర్శులకు ఈ క్యాబినెట్‌ పోర్టల్‌ ద్వారా అజెండాను అందుబాటులో ఉంచాలి. అజెండా కాపీని కార్యదర్శులు, మంత్రుల వాట్సాప్‌ గ్రూపుల్లో సర్క్యులేట్‌ చేయరాదు.

  • ఏదైనా అత్యవసర అంశాలను అజెండాలో చేర్చాల్సి వస్తే సంబంధిత శాఖ కార్యదర్శి చీఫ్‌ సెక్రటరీతో మాట్లాడి ఆమోదం తీసుకోవాలి.

Updated Date - Apr 14 , 2026 | 06:29 AM