Share News

అడుగు ముందుకే...!

ABN , Publish Date - Feb 15 , 2026 | 03:51 AM

కేంద్రం నుంచి ఆగిన రెవెన్యూ లోటు భర్తీ నిధులు, ఇతర గ్రాంట్లలో కోత ఒకవైపు! అనుకున్నంతగా పెరగని సొంత ఆదాయం మరో వైపు! ఈ పరిస్థితుల మధ్యే... వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కొంత వాస్తవిక అంచనాలతో 2026-27 బడ్జెట్‌ను రూపొందించారు.

అడుగు ముందుకే...!

  • కష్టాల బండిని గాడిన పెట్టడమే లక్ష్యం

  • భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌

  • సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి

  • మూలధన వ్యయం పెంచుతూ ప్రగతి

  • రెవెన్యూ లోటు కట్టడిపైనా దృష్టి.. జీఎస్‌డీపీలో అప్పుల వాటాపై నియంత్రణ

  • 3,32,205 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌.. 2025-26 కంటే 10 వేల కోట్లే పెంపు

  • కేంద్ర నిధులపై వాస్తవిక అంచనా.. రెవెన్యూ వ్యయం రూ.2,56,142 కోట్లు

  • అందులో సంక్షేమ వ్యయం వాటాయే 23 శాతం

  • (అమరావతి - ఆంధ్రజ్యోతి)

కేంద్రం నుంచి ఆగిన రెవెన్యూ లోటు భర్తీ నిధులు, ఇతర గ్రాంట్లలో కోత ఒకవైపు! అనుకున్నంతగా పెరగని సొంత ఆదాయం మరో వైపు! ఈ పరిస్థితుల మధ్యే... వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కొంత వాస్తవిక అంచనాలతో 2026-27 బడ్జెట్‌ను రూపొందించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శనివారం రూ.3,32,205 కోట్ల అంచనాలతో అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెవెన్యూలోటు గ్రాంటు, ఇతర గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి వచ్చే ఆదాయం నిలిచిపోవడం, కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా అనుకున్నంత పెరగకపోవడంతో రాష్ట్రానికి రూ.15,000 కోట్లకుపైగా నిధులు ఆగిపోయాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ కంటే కొత్త బడ్జెట్‌ను కేవలం రూ.10వేల కోట్లు మాత్రమే పెంచారు. ఆ లెక్కలు పరిశీలిస్తే... పెరుగుతున్న రెవెన్యూ లోటు కట్టడి చేయడంపై దృష్టి సారించినట్లు అర్థమవుతోంది. అప్పులు తగ్గిస్తూ, మూలధన వ్యయం పెంచుతూ, సంక్షేమాన్ని సాగిస్తూనే అభివృద్ధి దిశగా కదిలేలా చర్యలు చేపట్టారు. కేవలం ఒక ఆర్థిక సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా... రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సుదీర్ఘ లక్ష్యాల సాధనకు అనుగుణంగా బడ్జెట్‌ రూపొందించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ పలుమార్లు ఉద్ఘాటించడం గమనార్హం.


అప్పులు... మూలధన వ్యయం...

జీఎస్‌డీపీలో రాష్ట్ర పబ్లిక్‌ డెట్‌ 36 శాతం... అంటే రూ.7,11,094 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇది 2025-26తో పోల్చితే 75వేల కోట్లు అధికం. జీఎస్డీపీలో పబ్లిక్‌ డెట్‌ వాటా 36 శాతం యథాతథంగా ఉండటం ఇందులో సానుకూల అంశం. ఇక... అభివృద్ధికి, ఆస్తుల కల్పనకు సంకేతమైన మూలధన వ్యయాన్ని కూడా బాగా పెంచారు. బడ్జెట్‌లో ఇందుకు రూ.53,915 కోట్లు కేటాయించారు. మొత్తం ఖర్చులో ఇది 16 శాతం. 2024-25లో 8 శాతం, 2025-26లో 13 శాతం ఉన్న మూలధన వ్యయం ఈసారి 16 శాతానికి చేరడం విశేషం. దీనినే రూపాయల్లో చూస్తే... రాబోయే బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని రూ.53,915 కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.34,498 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.21,172 కోట్లను మూలధనం కోసం ఖర్చు చేశారు.

కేంద్ర పన్నులపై అంచనాలిలా...

కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రూ.64,362 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రూ.56,741 కోట్లు వస్తాయని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో రూ.52,080 కోట్లు వచ్చాయి.

సొంత ఆదాయంపై...

పన్నేతర ఆదాయం రూ.11,474 కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14,324 కోట్లుగా పేర్కొన్నారు. అంటే... కొంత వాస్తవికంగా ఆలోచించి అంచనాలు తగ్గించారన్న మాట. కానీ, గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.5972 కోట్లు మాత్రమే వచ్చింది. సొంత పన్నుల ఆదాయం 2026-27లో రూ.1,25,846 కోట్లు వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రూ.98,025 కోట్లు వస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.89,435 కోట్లు వచ్చింది. బడ్జెట్లో అంచనా వేసిన మొత్తం ఆదాయంలో పన్ను ఆదాయం 54 శాతం, పన్నేతర ఆదాయం 5 శాతం, గ్రాంట్లు 14 శాతం, కేంద్ర పన్నుల్లో వాటాగా 27 శాతంగా చూపించారు.


లోటు... పాట్లు!

రాబోయే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో అప్పులను రూ.98,065 కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అప్పులు రూ.1,03,631 కోట్లకు చేరుతాయని చూపించారు. 2026-27లో అంచనా వేసిన అప్పుల్లో ఆర్‌బీఐ నుంచి 78 శాతం, కేంద్రం నుంచి తీసుకునే రుణాల ద్వారా 19 శాతం, ఇతర రుణాలు 2 శాతం, డిపాజిట్లు, ట్రాన్సాక్షన్‌ నెట్‌ రూపంలో ఒక శాతం అప్పులు వస్తాయి.

రెవెన్యూ వ్యయం ఇలా...

2026-27లో రెవెన్యూ వ్యయాన్ని రూ.2,56,143 కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుత (2025-26) ఆర్థిక సంవత్సరంలో రూ.2,38,022 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయం రూ.2,27,961 కోట్ల మేర జరిగింది. ఈసారి అంచనా వేసిన మొత్తం రెవెన్యూ వ్యయంలో సంక్షేమానికి 23 శాతం, సాధారణ విద్యకు 18 శాతం, ఆరోగ్య రంగానికి 11 శాతం, ఇంధన రంగానికి 11 శాతం, వ్యవసాయ, అనుబంధ రంగాలకు 8 శాతం, పట్టణాభివృద్ధికి 8 శాతం, గృహనిర్మాణ రంగానికి 7 శాతం, రవాణా విభాగానికి 6 శాతం, ఇతర ఖర్చులు 8 శాతం ఉన్నాయి. రెవెన్యూయేతర వ్యయంలో మూలధన వ్యయానికి 64 శాతం, లోన్లు, అడ్వాన్సులకు 7 శాతం, అప్పుల అసలు చెల్లింపుల కోసం 29 శాతం ఉన్నాయి.

ఆదాయ... వ్యయాలు!

  • 2026-27లో అన్ని మార్గాల్లో రూ.2,34,140 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.1,96,904 కోట్లు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,67,676 కోట్ల ఆదాయం వచ్చింది.

  • 2026-27 బడ్జెట్‌ అంచనాల ప్రకారం జీఎ్‌సడీపీ రూ.19,75,073 కోట్లు. అంచనా వేసిన రెవెన్యూ లోటు ఈ జీఎ్‌సడీపీలో 1.11 శాతంగా, ద్రవ్యలోటు 3.84 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎ్‌సడీపీ రూ.17,62,357 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూలోటు అంచనాలు ఇందులో 2.33 శాతం, ద్రవ్యలోటు అంచనాలు 4.57 శాతంగా ఉంటాయని భావిస్తున్నారు.

  • గత ఆర్థిక సంవత్సరంలో రూ.15,91,226 కోట్ల జీఎ్‌సడీపీ నమోదుకాగా, రెవెన్యూ లోటు 3.79 శాతంగా, ద్రవ్యలోటును 5.11 శాతంగా నిర్ధారించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంకంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన జీఎస్‌డీపీ 12.07 శాతం మేర పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీఎ్‌సడీపీ 10.75 శాతం మేర పెరిగింది.


పర్యాటకానికి 439 కోట్లు హర్షణీయం

‘పర్యాటక, సాంస్కృతిక రంగాలకు బడ్జెట్‌లో రూ.439 కోట్లు కేటాయించడం హర్షణీయం.పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి, పెట్టుబడులను ఆకర్షించడం వల్ల రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రూ.28 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలను కుదుర్చుకుని 1,22,631 ఉద్యోగాల కల్పన పర్యాటకశాఖ ద్వారా చేస్తున్నాం. దీనిలో ఇప్పటికే రూ.6,671 కోట్ల పనులు పట్టాలెక్కాయి..’

- కందుల దుర్గేశ్‌, మంత్రి

అద్భుతమైన బడ్జెట్‌

‘కూటమి ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని చెప్పడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఒక నిదర్శనం. బీజేపీఈ బడ్జెట్‌ను హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది. ఇది అద్భుత బడ్జెట్‌.’

- విష్ణుకుమార్‌ రాజు, ఎమ్మెల్యే, బీజేపీ

గత ఏడాదికన్నా ఆరోగ్యానికి ఎక్కువ కేటాయింపు

‘గత బడ్జెట్‌ కన్నా మిన్నగా ఈ బడ్జెట్‌లో ఆరోగ్యానికి 9.5 శాతం కేటాయించడం హర్షణీయం. మూలధన వ్యయానికి రూ.51 వేల కోట్లుకు పైగా నిధులు సమకూర్చడంతో గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో నిలిచిన పలు అభివృద్ధి పథకాలు ఊపందుకుంటాయి.’

- సత్యకుమార్‌, మంత్రి

ప్రజా సంబంధాల శాఖలకు అధిక కేటాయింపులు

‘వ్యవసాయం, అనుబంధ శాఖలకు రూ.53,752 కేట్లు కేటాయించడం ఈ బడ్జెట్‌ అత్యంత ప్రాధాన్యతాంశం. అదే విధంగా రోడ్లు భవనాల శాఖకు, ఆరోగ్య శాఖకు అధిక నిధులు కేటాయించడం ద్వారా ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న శాఖలకు బడ్జెట్‌లో ప్రభుత్వం అధికప్రాధాన్యం ఇచ్చినట్లు అయింది.’

- సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, టీడీపీ

ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట

‘బడ్జెట్‌ ప్రజల ఆశలు నెరవేర్చేలా ఉంది. బడ్జెట్‌లో ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేశారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ రూపకల్పన చేశారు. రుణాల్ని నియంత్రించేలా, సామాజిక న్యాయం దిశగా బడ్జెట్‌ రూపొందించడం బాగుంది.’

- యనమల రామకృష్ణుడు, మాజీ ఆర్థిక మంత్రి


లోటు తగ్గింపుపై దృష్టి పెట్టారు

‘ఆర్థిక క్రమశిక్షణ, బడ్జెట్‌ లోటును తగ్గించడంపై దృష్టి సారించింది. రెవెన్యూ లోటును రాష్ట్ర ఉత్పత్తిలో 1.11 శాతానికి... రూ.22,002 కోట్లకు పరిమితం చేయడం మంచి పరిణామం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడమే కాకుండా పారిశ్రామిక ప్రగతికి, 20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి బడ్జెట్‌ బలమైన పునాది వేసింది.’

- నీలయపాలెం విజయకుమార్‌, చైర్మన్‌, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు

ఆచరణాత్మకం... సంక్షేమ హితం

‘రాష్ట్ర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం. బడ్జెట్‌ ఆచరణాత్మక, సంక్షేమ ఆధారమైనది. ఆర్థిక పరివర్తనపై దీర్ఘకాలిక దృష్టితో రూపొందించారు. ప్రస్తుతం ఆర్థిక లోటు నియంత్రణ అత్యంత కీలకం. అభివృద్ధితో పాటు ఆర్థిక క్రమశిక్షణ అవసరం. స్థిరమైన, సమ్మిళిత వృద్ధికి రోడ్‌మ్యా్‌పను ఈ బడ్జెట్‌ సూచిస్తోంది. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడానికి మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధికి అధిక కేటాయింపులతో పాటు గ్రాంట్లు, సబ్సిడీలను సకాలంలో విడుదల చేయడానికి ఎస్ర్కో యంత్రాంగాన్ని ప్రవేశపెట్టాలని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.’

- పొట్లూరి భాస్కరరావు, అధ్యక్షుడు, ఏపీ చాంబర్స్‌

ఆత్మస్తుతి... పరనింద

‘తమకు మేలు చేస్తారని ప్రజలు ఎంతో ఆశతో ఎదరు చూస్తే నిరాశపరిచారు. బడ్జెట్‌ ప్రసంగం అంతా ఆత్మస్తుతి, పరనిందలా ఉంది. రాష్ట్ర బడ్జెట్‌ వాస్తవాలకు దూరంగా అంకెల గారడీలా,తప్పుల తడకగా ఉంది. బడ్జెట్‌పై కచ్చితంగా మండలిలో చొక్కాపట్టుకొని నిలదీస్తాం.’

- బొత్స సత్యనారాయణ, ప్రతిపక్ష నేత

ప్రజా కంటక బడ్జెట్‌

‘బడ్జెట్‌ అంతా అప్పుల కుప్ప అంకెల గారడీలా ఉంది. వెన్నుపోటు, ప్రజా కంటక బడ్జెట్‌ ఇది. ఉద్యోగస్తులకు మొండిచెయ్యి చూపారు.

- వరుదు కల్యాణి, మొండితోక అరుణ్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు, వైసీపీ


ఎన్నికల హామీలు బారెడు.. కేటాయింపులు మూరెడు

‘బడ్జెట్‌లో సూపర్‌ సిక్స్‌కు ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం దారుణం. ఈ బడ్జెట్‌ కొత్త సీసాలో పాత సారాలా, అంకెలు ఘనం... అప్పుల కుప్పలా, ఊహజనితంగా ఉంది. ఎన్నికల హామీలు బారెడైతే.. కేటాయింపులు మూరెడు. అనేక ఎన్నికల హామీలను ఎగ్గొట్టారు. ఇది మంచి ప్రభుత్వం కాదు... ముంచే ప్రభుత్వం. కూటమి గెలిచి రెండేళ్లు అవుతున్నా మహాశక్తి పథకం అసలు ఉందో లేదో తెలియదు. మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని నమ్మించి కోటిన్నర మంది మహిళలను రెండేళ్లుగా చంద్రబాబు మోసం చేస్తున్నారు. రూ.10 లక్షల వరకూ ఉచిత రుణాలు ఇస్తానని చెప్పి సున్నా వడ్డీ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 50 లక్షల మంది నిరుద్యోగులను చంద్రబాబు మరోసారి మోసం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు చిల్లిగవ్వ కేటాయించలేదు. ప్రభుత్వ ఉద్యోగులనూ చంద్రబాబు వంచించారు. అన్నదాత సుఖీభవ పథకానికి నిధులు పెంచకుండా మళ్లీ పాత కేటాయింపు... రూ.6,000 కోట్లే కొనసాగించడం దారుణం.’

- వైఎస్‌ షర్మిల, రాష్ట్ర అధ్యక్షురాలు, కాంగ్రెస్‌

Updated Date - Feb 15 , 2026 | 06:36 AM