Share News

బీరు.. మొదలైన జోరు!

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:44 AM

ఏప్రిల్‌ రాకతో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. కానీ ఎక్సైజ్‌ శాఖకు మార్చి నుంచే వేసవి ప్రభావం మొదలైంది!. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మందుబాబులు లిక్కర్‌కు బదులుగా బీరు బాటపట్టారు.

బీరు.. మొదలైన  జోరు!

  • వేసవి తాపం ప్రారంభంతో రాష్ట్రంలో పెరిగిన అమ్మకాలు

  • మార్చి నుంచే పెరిగిన విక్రయం

  • వచ్చే రెండు నెలల్లో మరింత

  • ఎక్సైజ్‌కు రాబడి పెరిగే చాన్స్‌

  • తగ్గుతున్న మద్యం వినియోగం

వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తున్నారు. కాస్త మద్యానికి అలవాటైన ప్రాణులు.. బీరు బాట పట్టాయి. దీంతో గత నెల నుంచే రాష్ట్రంలో బీరు అమ్మకాలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే బీరు విక్రయాలు 30 శాతం మేరకు పెరగడం విశేషం. వచ్చే రెండు మాసాల్లో ఎండలు మరింత పెరగనున్న నేపథ్యంలో అమ్మకాల జోరు భారీగా పెరుగుతుందని ఎక్సైజ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఏప్రిల్‌ రాకతో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. కానీ ఎక్సైజ్‌ శాఖకు మార్చి నుంచే వేసవి ప్రభావం మొదలైంది!. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మందుబాబులు లిక్కర్‌కు బదులుగా బీరు బాటపట్టారు. దీంతో రాష్ట్రంలో బీరు అమ్మకాలు భారీగా పెరిగాయి. మార్చి నెలలో 29.8 శాతం మేరకు అధికంగా బీర్లు అమ్ముడైనట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇవి గత ఏడాదికంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. 2025 మార్చిలో 20.11 లక్షల కేసుల బీరు అమ్మగా.. ఈ ఏడాది మార్చిలో 26.11 లక్షల కేసులకు పెరిగాయి. ఇక, ఈ నెల 12వ తేదీ వరకు బీరు విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే 12.72 శాతం మేరకు పెరిగాయి. గతేడాది ఏప్రిల్‌ 12వ తేదీ వరకు 8.16 లక్షల కేసులు అమ్మితే, ఈ ఏడాది ఇదే సమయానికి 9.2 లక్షల కేసులు విక్రయించారు. అయితే, బీరు అమ్మకాలు పెరగడంతో లిక్కర్‌ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది ఏప్రిల్‌లో 12 వరకు 11.78 లక్షల కేసుల మద్యం అమ్మగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇప్పటి వరకు 8.52 లక్షల కేసుల మద్యమే అమ్ముడైంది.


దీని ప్రకారం.. లిక్కర్‌ అమ్మకాలు 27.64 శాతం తగ్గాయి. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్‌ నుంచి బీరు అమ్మకాలు పెరుగుతుంటాయి. కానీ, ఈ ఏడాది మార్చి నుంచే రాష్ట్రంలో బీరు వినియోగం భారీగా పెరిగింది. తెలంగాణతో పోలిస్తే మన రాష్ట్రంలో మద్యం వినియోగదారులు ఎక్కువగా లిక్కర్‌కే మొగ్గు చూపుతారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. తెలంగాణ తరహాలో ఎండలు పెరగ్గానే వినియోగదారులు బీరు కొనుగోలు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయనే అంచనాలు ఉండటంతో బీరు అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.


వెనకబడిన గుంటూరు

రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు మెరుగ్గా ఉంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాత్రం భిన్నంగా ఉంది. గుంటూరులో 2.64శాతం, పల్నాడులో 2.7శాతం మేరకు అమ్మకాలు తగ్గిపోయాయి. ఇక బాపట్లలో 1.19 శాతం మాత్రమే అమ్మకాలు పెరిగాయి. రాష్ట్రమంతా అమ్మకాలు పెరగ్గా.. రాజధాని ప్రాంతంలో అమ్మకాలు తగ్గిపోయాయి. పైగా రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో బార్లు కూడా గుంటూరులోనే ఉన్నాయి. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా 28.4 శాతం వృద్ధి సాధించింది. శ్రీసత్యసాయిలో 27.75 శాతం, కర్నూలులో 26.03 శాతం అమ్మకాలు పెరిగాయి.

బీరు సీసాలో నలకలు

బీరు ఉత్పత్తిలో రెండు పాపులర్‌ బ్రాండ్లపై ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు ఘటనలు ఎక్సైజ్‌ శాఖలో చర్చనీయాంశమయ్యాయి. గుంటూరులో ఓ ప్రముఖ బ్రాండ్‌ విక్రయించే బీరును ఓ వినియోగదారుడు కొనుగోలు చేశారు. అనంతరం దాంట్లో నలకలు(పార్టికల్స్‌) ఉన్నాయని దుకాణానికి తిరిగి తీసుకొచ్చారు. ఆ తర్వాత కొంతమంది కొనుగోలు చేసిన అదే బ్రాండ్‌ బీరు సీసాల్లోనూ పార్టికల్స్‌ కనిపించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా సదరు కంపెనీ గుంటూరులోని కొన్ని షాపుల నుంచి బీరు కేసులను వెనక్కి తీసుకెళ్లినట్లు తెలిసింది. స్టాకు వెనక్కి తీసుకెళ్లడంతో అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి. అలాగే కృష్ణా జిల్లా మొవ్వలో మరో ప్రముఖ కంపెనీ ఇటీవల విక్రయించిన ఓ బీరుకు మరో కంపెనీ మూత పెట్టారు. అలాగే సీసాలోనూ ముప్పావు శాతం వరకే మద్యం ఉంది. రాష్ట్రంలో సరిపడ స్థాయిలో బీరు ఉత్పత్తి లేకపోవడంతో ఆయా కంపెనీల విషయంలో అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Updated Date - Apr 14 , 2026 | 06:45 AM