Share News

బీసీల ‘ఆదరణ’ ఎలా?

ABN , Publish Date - Apr 29 , 2026 | 07:30 AM

‘ఆదరణ 3.0’ అమలు ఎలా?.... ప్రభుత్వం, బీసీ సంక్షేమ శాఖ ముందు ఉన్న పెద్ద ప్రశ్న ఇది. బీసీలను సంఘటితం చేసి.. గ్రూపులుగా ఏర్పాటు చేసి.. సామూహిక యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుండగా..

బీసీల ‘ఆదరణ’ ఎలా?

  • ఆదరణ 3.0 అమలుపై ప్రభుత్వం కసరత్తు.. కమ్యూనిటీ యూనిట్లపై సర్కార్‌ మొగ్గు

  • వ్యక్తిగత యూనిట్ల కోసం క్షేత్రస్థాయి నుంచి వినతులు

  • స్వయం ఉపాధి యూనిట్లు కూడా ఆదరణ కిందికే!

  • ఎటూ తేల్చుకోలేని బీసీ సంక్షేమ శాఖ

  • కన్సల్టెంట్ల సహకారంతో కొనసాగుతున్న కసరత్తు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘ఆదరణ 3.0’ అమలు ఎలా?.... ప్రభుత్వం, బీసీ సంక్షేమ శాఖ ముందు ఉన్న పెద్ద ప్రశ్న ఇది. బీసీలను సంఘటితం చేసి.. గ్రూపులుగా ఏర్పాటు చేసి.. సామూహిక యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుండగా.. క్షేత్రస్థాయిలో బీసీలు మాత్రం వ్యక్తిగత యూనిట్లు కావాలని కోరుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కూటమి సర్కార్‌ అమలుచేసే ఆదరణ 3.0 పథకం ఎలా ఉండాలో ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశించారు. గతంలో మాదిరిగా ఏవో కొన్ని పనిముట్లు పంపిణీ చేయడం, అవసరమున్నా... లేకపోయినా, వృత్తిలో ఉన్నవారు... లేనివారు సైతం ఈ యూనిట్లు పొందడం ద్వారా ఎక్కువగా ఈ పథకం బీసీలకు సద్వినియోగం కాలేదని తేలింది. చాలావరకు యూనిట్లు దుర్వినియోగం అయ్యాయి. అందుకే గతంలో మాదిరిగా లబ్ధిదారులకు వ్యక్తిగత యూనిట్లు కాకుండా కమ్యూనిటీ ఆధారిత యూనిట్లు డిజైన్‌ చేయాలని, స్వయం సహాయక గ్రూపుల కాన్సెప్ట్ లో బీసీల గ్రూపులను ఏర్పాటుచేసి వారికి యూనిట్లు పంపిణీ చేయాలని సూచించారు. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈమేరకు కసరత్తు చేపట్టిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు.. ఇప్పటికే వివిధ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, క్షేత్రస్థాయిలో బీసీ కుల సంఘాలతో మాట్లాడారు. ఆదరణ 3.0లో ఎలాంటి యూనిట్లు అందిస్తే బీసీలు ఆర్థికంగా మరింత ఎదిగే అవకాశం ఉంటుందన్న అంశంపై సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. అయితే కమ్యూనిటీ ఆధారిత యూనిట్లు ఏర్పాటు చేసేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశిస్తే.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా లబ్ధిదారులు వ్యక్తిగత యూనిట్లు కావాలని కోరుతున్నారు. సంఘటితంగా పెద్ద యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఎక్కువ మంది మొగ్గుచూపడం లేదంటున్నారు.


బీసీ నిధులు సద్వినియోగం దిశలో సర్కార్‌

బీసీలకు ఆదరణ 3.0 పథకం ద్వారా ఏటా రూ.1000 కోట్లు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. గతంలో ఎన్నో రకాల స్వయం ఉపాధి యూనిట్లు పంపిణీ చేసినా...ఆర్థికంగా బీసీలు నిలదొక్కుకున్న పరిస్థితి లేదని, ఇప్పుడూ అలాంటి యూనిట్లే ఇచ్చినా... మళ్లీ అదే పరిస్థితి నెలకొంటుందని ముఖ్యమంత్రి ఆలోచన. గతంలో టీడీపీ హయాంలో ఇచ్చిన స్వయం ఉపాధి యూనిట్లు, ఆదరణ ద్వారా ఇచ్చిన నాలుగు లక్షల పైబడిన యూనిట్ల పంపిణీ వల్ల బీసీలు పెద్దగా ఆర్థికంగా ఎదిగిన పరిస్థితులు లేవని భావిస్తున్నారు. అందుకే కొంతమంది బీసీ యువకులను కలిపి సంఘటిత యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అంతేగాకుండా పలానా కులం పలానా వృత్తే చేయాలనే కాన్సెప్ట్‌ కాకుండా... ఎవరు ఏ వృత్తి చేయాలనుకుంటే.. వారికి ఆ వృత్తిలో యూనిట్లు పొందే అవకాశం కల్పించాలని సూచించినట్లు సమాచారం. ముందుగా ఆయా కులవృత్తులకు సంబంధించి మెగా యూనిట్ల రూపకల్పనకు ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీంతో మెగా ల్యాండ్రీ యూనిట్‌, పవర్‌లూమ్‌ మోడల్‌ను రూపొందించి సుమారు 50 రకాల మెగా యూనిట్లకు సంబంధించిన ప్రాజెక్టులపై అధ్యయనం చేయాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులు జిల్లా అధికారులకు సూచించారు. ఆయా కులాలకు సంబంధించిన బీసీలు ఇప్పటికీ అదే వృత్తులు చేపడుతున్న నేపథ్యంలో వారిలో నైపుణ్యం పెంచి, ఆయా వృత్తుల్లో మరింత మెరుగైన అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారు.


క్షేత్రస్థాయిలో వ్యక్తిగత యూనిట్లపైనే దృష్టి

బీసీలను సంఘటితపరిచి మెగా యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో బీసీల ఆలోచనలు ఉన్నాయి. స్వయం ఉపాధి యూనిట్లు ఇస్తామని గత రెండేళ్లుగా ప్రభుత్వం ఊరిస్తోందని, వెంటనే వ్యక్తిగత యూనిట్లు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. మెగా యూనిట్ల వల్ల ఎక్కువమంది బీసీలను సంతృప్తిపరచలేమని కార్పొరేషన్ల డైరెక్టర్లు, చైర్మన్లు కూడా అంటున్నారు. వ్యక్తిగత యూనిట్లకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఆర్థిక సాయం అందిస్తే స్వయం ఉపాధి ద్వారా అభివృద్ధి చెందుతామని క్షేత్రస్థాయిలో బీసీలు అంటున్నారు. ఐదు, పది మందిని కలిపి గ్రూపులను ఏర్పాటుచేసి మెగా యూనిట్లు ఇచ్చినా.. సమన్వయం కుదరక అతి తక్కువ సమయంలోనే గ్రూపులు విచ్ఛిన్నం అవుతాయని అంటున్నారు. ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు చూస్తే మెగా యూనిట్లు అంతమేర సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చని అంటున్నారు. దీంతోపాటు మెగా యూనిట్ల నిర్వహణకు భూమి సమస్య కూడా ఉంటుందని అంటున్నారు. ఉదాహరణకు మెగా పవర్‌లూమ్‌ ఏర్పాటు చేయాలంటే కనీసం 50 సెంట్లు భూమి కావాలి. చేనేత వర్గాలున్న పలుచోట్ల ప్రభుత్వ భూమి అందుబాటులో లేదు. ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి భూమిని కొనుగోలు చేసి యూనిట్లు ఏర్పాటు చేయడం అనేది అసాధ్యం. దీంతోపాటు గతంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా గ్రూపులకు ఇచ్చిన యూనిట్లు ఫెయిల్‌ అయ్యాయని చెప్తున్నారు. వ్యక్తిగత యూనిట్లు ఇవ్వడం ద్వారా తమకు అందాల్సిన సబ్సిడీ అందిస్తే చాలని పలువురు కోరుతున్నారు.


స్వయం ఉపాధి కూడా ఆదరణ కిందికే!

ఇకపై స్వయం ఉపాధి యూనిట్లు ప్రత్యేకంగా ఇవ్వకుండా వాటిని ఆదరణ 3.0 కిందకే తీసుకొచ్చి అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్వయం ఉపాధి యూనిట్ల కోసం ప్రత్యేకంగా రుణం అందించకుండా వారికి అవసరమైన ఆర్థిక సాయాన్ని ఆదరణ పథకం ద్వారా అందిస్తారు. ఇందుకోసం కొన్ని ప్రత్యేక యూనిట్లు డిజైన్‌ చేయనున్నారు. నిరుద్యోగ యువతకు వీలైనన్ని అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

అధికారులపైనే భారం!

మెగా యూనిట్ల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు చూపడం, క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు వ్యక్తిగత యూనిట్లు కోరుకుంటుండటంతో సీఎంకు క్షేత్రస్థాయి పరిస్థితులు వివరించాలని అధికారులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బీసీ యువతకు అవగాహన కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి సూచించిన యూనిట్లు ఏర్పాటు చేయడమా? లేక క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల కోరికను సీఎంకు వివరించడం ద్వారా వ్యక్తిగత యూనిట్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రిని ఒప్పించడమో అధికారులు చేయాల్సి ఉంది. ఇందుకోసం బీసీ సంక్షేమ శాఖ ఇప్పటికే కన్సల్టెంట్లను నియమించుకుంది. ఈ ప్రక్రియను వేగంగా చేస్తేనే.. ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది

Updated Date - Apr 29 , 2026 | 07:30 AM