వర్షాలు ఆలస్యమైనా.. ఖరీఫ్ సాగుకు ఢోకాలేదు!
ABN , Publish Date - Mar 22 , 2026 | 03:29 AM
దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది రాష్ట్రంలో ఎండలు బాగా ఉంటాయని..
మార్చిలోనూ అందుబాటులో 1,777 టీఎంసీలు.. రిజర్వాయర్లలో 608 టీఎంసీలు
మైనర్ ఇరిగేషన్‌లో 130 టీఎంసీలు
భూగర్భజలాలు 641 టీఎంసీలు
సుస్థిర యాజమాన్య విధానంతో నీటి భరోసా
అందుకే ఖరీఫ్‌కు మే 1 నుంచే నీరిస్తామని
ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటన
సాగుకు రైతాంగమూ సన్నద్ధం
అమరావతి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది రాష్ట్రంలో ఎండలు బాగా ఉంటాయని.. ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర నీటి యాజమాన్య విధానాలను పాటించాలని రాష్ట్రప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఆ శాఖ అంచనాల మాదిరిగానే మార్చి రెండోవారంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇక ముందు మరింత ముదురుతాయి. అయితే వర్షాలు ఆలస్యమైనా ఖరీఫ్ సాగుకు ముప్పులేదని, రిజర్వాయర్లు, చిన్ననీటివనరుల్లో చాలినంత నీరు ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో నీటి సంవత్సరం మే ఒకటో తేదీన మొదలవుతుంది. ప్రధాన రిజర్వాయర్ల నుంచి ఖరీఫ్‌కు నీటి విడుదల మే నెలలోనే ప్రారంభమవుతుంది. ఖరీఫ్ ప్రణాళికను వ్యవసాయ శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. ఉగాది నాడు వ్యవసాయ పంచాంగాన్ని విడుదల చేస్తుంది. గత ఏడాది విస్తారంగా వర్షాలు కురవకపోయినా.. ఎగువ నుంచి వచ్చిన వరదతో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండాయి. ఎగువ నుంచి వచ్చిన వరద నీటిని హంద్రీ-నీవా సుజల స్రవంతి. గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువల ద్వారా రాయలసీమలోని గొలుసుకట్టు చెరువులకు మళ్లించారు. చెరువులన్నింటిని నింపడంతో నీటి నిల్వలతోపాటు భూగర్భ జలాల నిల్వలూ పెరిగాయి. జల వనరుల శాఖ సమగ్ర నీటి యాజమాన్య విధానాన్ని అమలు చేయడంతో.. ఈ ఏడాది ఖరీఫ్‌కు ఢోకా లేదన్న విశ్వాసం కనిపిస్తోంది. అందుకే మే 1 నుంచే ఖరీఫ్‌కు నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీంతో రైతాంగం సాగుకు సన్నద్ధమవుతోంది.
నీటినిల్వలు ఇలా..
రాష్ట్రంలో గత ఏడాది కంటే ఈ ఏడాది 1.35 శాతం అధికంగా.. 900.70 మిల్లీ మీటర్ల మేర వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో 608.4 టీఎంసీల నీటి నిల్వలు రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్నాయని జల వనరుల శాఖ అధికారికంగా నిర్వహిస్తున్న ‘ఏపీ రిమ్స్ ’ యాప్ వెల్లడిస్తోంది. ‘గురువారంనాటికి వివిధ జలాశయాల్లో 608.4 టీఎంసీలున్నాయి. మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో 129.81 టీఎంసీల నీరుంది. 640.76 టీఎంసీల భూగర్భ జలాలు సహా చిన్ననీటి వనరుల్లో 1,168.7 టీఎంసీలు ఉన్నాయి. మొత్తంగా 1,777 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి’ అని జలవనరుల శాఖ వెల్లడించింది.
గోదావరి, కృష్ణా జిల్లాల్లో మైనస్
రాష్ట్రంలో భూగర్భ జలాల్లో కాకినాడ జిల్లాలో 14.72 శాతం మేర మైనస్ కనిపిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 23..33 శాతం లోటు ఉంది. తూర్పుగోదావరిలో మైనస్ 26.21 శాతం, పశ్చిమగోదావరిలో మైనస్ 17.05 శాతం, కృష్ణా జిల్లాలో మైనస్ పది శాతం నమోదయ్యాయి. మిగిలిన జిల్లాలన్నిటిలోనూ భూగర్భ జలాలు సమృద్ధిగానే ఉన్నాయి. రాష్ట్రంలోని జలాశయాలన్నింటిలోనూ 55.19 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. 62 శాతం మేర చెరువుల్లో నీళ్లున్నాయి. భూగర్భ జలాలు సాగునీటి ప్రాజెక్టుల కంటే ఎక్కువగా 640.76 టీఎంసీల టీఎంసీల వరకు ఉన్నాయి.