సభకు వచ్చి సీట్లో కూర్చుంటేనే హాజరు
ABN , Publish Date - Feb 11 , 2026 | 04:03 AM
రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ సమావేశాల నుంచి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డిజిటల్ విధానంలో సభ్యుల హాజరు నమోదు చేయనున్నారు.
ఇకపై పట్టికలో సంతకం అక్కర్లేదు.. సభలో కుర్చీలో ఆశీనులైతేనే హాజరు
సభకు రాకుండానే రిజిస్టర్‌లో వైసీపీ ఎమ్మెల్యేల సంతకాలు
గైర్హాజరవుతూ జీతభత్యాలు తీసుకుంటున్న వైనం.. కొత్త విధానంతో చెక్
స్పీకర్ ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని వైసీపీ ఆరోపణ .. టీడీపీ ఖండన
అమరావతి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ సమావేశాల నుంచి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డిజిటల్ విధానంలో సభ్యుల హాజరు నమోదు చేయనున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు సమావేశాలు ప్రారంభమయ్యే బుధవారం నుంచే ఈ విధానం అమల్లోకి తెస్తున్నట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ తెలిపారు. డిజిటల్ విధానం అమలు చేస్తున్న నేపథ్యంలో ఇకపై సభ్యులు హాజరు పట్టికలో సంతకం చేయనవసరం లేదని, దానిని తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా బయట రిజిస్టర్‌లో సంతకాలు చేసి జీతభత్యాలు తీసుకుంటుండడంపై గత కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన శాసనసభ స్పీకర్ల 86వ అఖిల భారత మహాసభలోనూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు దీనిని ప్రస్తావించారు. అసెంబ్లీకి రాని సభ్యులకు ‘నో వర్క్.. నో పే’ విధానం అమలు చేయాలని, అవసరమైతే రైటు టు రీకాల్ విధానాన్ని తీసుకురావాలని గట్టిగా సూచించారు. ఈ నేపథ్యంలో తాజాగా అమలు చేయనున్న డిజిటల్ విధానంతో వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో.. సభ అనుమతి లేకుండా స్పీకర్ ఇష్టమొచ్చినట్లు కొత్త విధానాలను అమలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపణలు మొదలుపెట్టారు. ఈ ఆరోపణలను టీడీపీ వర్గాలు ఖండించాయి. అసెంబ్లీ నిబంధనావళిలోని రూల్ 362.. అసెంబ్లీలో ఎలాంటి కొత్త విధానాలు అమలు చేయడానికైనా స్పీకర్‌కు సర్వాధికారాలు ఉన్నాయని స్పష్టం చేస్తోందని పేర్కొన్నాయి.
కుర్చీలో కూర్చుంటేనే హాజరు..
శాసనసభలో ఏఐ ఆధారిత హాజరు నమోదుకు ఏడాదిగా కసరత్తు జరుగుతోంది. సభ్యులు సభలో తమకు కేటాయించిన కుర్చీలో కూర్చున్న తర్వాతే.. ఏఐ ఆధారిత డిజిటల్ విధానం సంబంధిత సభ్యుడి హాజరును నమోదు చేస్తుంది. ఈ కారణంగా గతంలో మాదిరి సభకు ఆలస్యంగా వచ్చి సమావేశాలు ముగియకముందే వెళ్లిపోవడానికి ఆస్కారం ఉండదు. సభ్యులు సభలో ఎంత సమయం ఉన్నారనే విషయాన్నీ తెలుసుకోవచ్చు. ఏఐ ఆధారిత హాజరు విధానంలో అత్యాధునిక ఫేస్ రికగ్ననైజేషన్ టెక్నాలజీని వినియోగిస్తారు. సభ్యుడు తనకు నిర్దేశించిన సీటులో కాకుండా వేరే సీటులో కూర్చుంటే అది కూడా గుర్తించి, అప్రమత్తం చేయవచ్చు. ఇప్పటికే ప్రతి సభ్యుడి ఫొటోలను వెక్టరైజేషన్ ద్వారా సేకరించారు. వెక్టరైజేషన్ అంటే ఆయా సభ్యుల రూపురేఖలను గుర్తించేందుకు అవసరమైన కొలతలు తీసుకోవడమన్నమాట. ఒక్కో ఫొటోను 175 వెక్టర్ పాయింట్స్‌గా తీసుకుని సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తిచేశారు. సభలో పీటీజెడ్(పాన్.. టిల్ట్.. జూమ్) కెమెరాలను ఏర్పాటు చేశారు. సభ్యుల హాజరు నమోదులో మానవ ప్రమేయం లేకుండా ఎకాయెకిన డ్యాష్‌బోర్డుకు సమాచారం చేరిపోతుంది.