కల్తీపై నేడు అసెంబ్లీలో చర్చ
ABN , Publish Date - Feb 24 , 2026 | 03:56 AM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై మంగళవారం శాసనసభలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉ.10.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు
10 మంది కూటమి ఎమ్మెల్యేలకు మాట్లాడే చాన్స్
మధ్యాహ్నం 12.30కు సీఎం ప్రసంగం
తిరుమలలోనూ స్వర్ణ దేవాలయ తరహా నిబంధనలు
అన్యమతస్థుల డిక్లరేషన్ మరింత కఠినంగా అమలు
చంద్రబాబు సమక్షంలో మంత్రుల సూచనలు
సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ స్వామిది కాదు.. వైసీపీదే: సీఎం
కల్తీపై శాసనమండలిలో 26న చర్చ
అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై మంగళవారం శాసనసభలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అసెంబ్లీలోని తన చాంబరులో మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కల్తీ నెయ్యిపై ఎప్పుడు చర్చిద్దామని వారు అడుగగా.. మంగళవారమే పెడదామని ఆయన సూచించారు. ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్ రద్దు చేసి ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కల్తీ నెయ్యిపై చర్చించాలని నిశ్చయించారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఇందులో పాలుపంచుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సీఎం మాట్లాడతారు.
స్వర్ణదేవాలయం నిబంధనలను పరిశీలించాలి..
మంత్రులతో చంద్రబాబు చర్చ సందర్భంగా పలు అంశాలు తెరపైకి వచ్చాయి. తిరుమలలో నిబంధనలను మరింత కఠినతరం చేయాలని, పంజాబ్ అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయంలో నిబంధనలు కఠినంగా ఉంటాయని.. తిరుమలలోనూ ఆ తరహావి అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. కాగా.. కల్తీ నెయ్యి అంశంపై సీబీఐ సిట్ నివేదిక అమలు కోసం రాష్ట్రప్రభుత్వం ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ సుబ్రమణ్యంస్వామి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై చంద్రబాబు స్పందించారు. అది ఆయన వేసిన పిటిషన్ కాదని, వైసీపీ వేయించిన పిటిషన్ అని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
కల్తీపై శాసనమండలిలో 26న చర్చ
సభలో, బయట ఎక్కడైనా కల్తీ నెయ్యిపై చర్చకు సిద్ధమన్న పయ్యావుల
శాసనమండలి బీఏసీ సమావేశం వాడివేడిగా సాగింది. సోమవారం చైర్మన్ మోషేన్ రాజు చాంబరులో జరిగిన భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నడుమ వాడీవేడి చర్చ జరిగింది. బొత్స మాట్లాడుతూ.. మీరు బీఏసీలో ఒకటి చెప్పి, సభలో ఇంకొకటి చెబుతున్నారని అధికారపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పయ్యావుల స్పందిస్తూ.. ఎక్కడైనా ఒకటే చెబుతున్నామని, సభలో గానీ, బయట గానీ కల్తీ నెయ్యిపై చర్చకు సిద్ధమని చెప్పారు. అసెంబ్లీలో, మండలిలో కల్తీనెయ్యిపై చర్చ పెడతామని మొదటి రోజే కోరామని.. చర్చ జరగకుండా మీరే నాలుగురోజులు సభ సమయాన్ని వృథా చేశారని వ్యాఖ్యానించారు. దరిమిలా.. కల్తీనెయ్యిపై 26న మండలిలో చర్చించాలని బీఏసీలో నిర్ణయించారు. బడ్జెట్‌పై మండలిలో చర్చ పెట్టాలని బొత్స కోరగా, ఇప్పటికే చర్చ పూర్తయిందని కేశవ్ సమాధానమిచ్చారు. శాసన సభలో ఇప్పటికే బడ్జెట్‌పై చర్చ పూర్తయిందని, ఇకపై ఆ అంశంపై చర్చ ఉండదని స్పష్టం చేశారు. మంగళవారం హోం శాఖపై, 25న వ్యవసాయ శాఖపై చర్చించాలని నిర్ణయించారు. 28న శనివారం మండలికి సెలవు ప్రకటించారు. తొలుత ఆ రోజు కూడా మండలి సమావేశాలు నిర్వహించాలని భావించినా సభ్యుల కోరిక మేరకు సెలవు ప్రకటించారు.